•ఆర్భాటంగా ప్రారంభం..
•ఆచరణలో అంతంతమాత్రం..
•ప్రజలకు చేరువగా పాలన లక్ష్యం..
•ప్రజల్లో మాత్రం కానరాని ఆసక్తి..
నవతెలంగాణ-మర్రిగూడ
సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలన్నా ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 17 ఆగస్టు 2026 మండల ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది.మొదట్లో ఎంతో ఆర్భాటంగా కనిపించిన ఈ కార్యక్రమం రాను రాను పలుచబడిపోతుంది.మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మండలంలో 23 నవంబర్ సోమవారం వరకు మొత్తం14 ప్రజావాణి కార్యక్రమాలు జరిగాయి.ఆగస్టు నెల 16 , సెప్టెంబర్ 9, అక్టోబర్ 9 , నవంబర్ 0, మొత్తం ఇప్పటివరకు 34 అప్లికేషన్లు వచ్చాయి.రెవెన్యూ,పంచాయతీరాజ్,హౌసింగ్ శాఖలకు ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి.ఇందులో 25 అప్లికేషన్స్ పరిష్కారం కాగా, ఇంకా 9 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ప్రజల్లో అవగాహన లేమి
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ వివిధ శాఖల మండల స్థాయి అధికారులు కార్యక్రమానికి విధిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలి.అయితే ఈ కార్యక్రమంపై గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేని కారణంగా అసలు ఇలాంటి కార్యక్రమం మండలంలో జరుగుతున్న విషయమే మండలంలో ఎక్కువ శాతం ప్రజలకు తెలవటం లేదంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.ప్రజావాణి అంటే కలెక్టరేట్ లోనే జరుగుతుందని కోణంలో ఉన్నారు ప్రజలు.నేటికి తమ సమస్యల పరిష్కారానికి పత్రాలు పట్టుకొని జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సమస్య పరిష్కారం కాదంటూ అపోహ
గతంలో తమ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పలు కార్యాలయాల చుట్టూ తిరిగిన జనం మండల ప్రజావాణి లో తమ సమస్యలు పరిష్కారం కాదనే అపోహలో ఉన్నారు.మండలంలోని వివిధ శాఖల అధికారులే మండల ప్రజావాణిలో ఉండటం మూలంగా మండల కార్యాలయాలలో పరిష్కారం కానీ సమస్య మండల ప్రజావాణి ద్వారా ఎలా పరిష్కారం అవుతుందని ప్రశ్నిస్తున్నారు.తద్వారా ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడం ద్వారా ప్రయోజనం శూన్యం అని,ఇచ్చిన సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ పేర్కొంటున్నారు.మండల ప్రజావాణిలో ఏదో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం తప్ప మేజర్ సమస్య పై జిల్లా కేంద్రానికి వెళ్లక తప్పడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి.
అధికారుల సమయపాలన అవసరం
ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు నిర్దేశించిన సమయానికి హాజరు కావలసి ఉంటుంది.కానీ కొంతమంది అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.ఉదయం 11, 12 గంటల వరకు చూసినా కూడా ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయని,ఉన్నతాధికారులు ప్రజావాణి సమయపాలన విషయంలో చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మండల ప్రజావాణిలో జిల్లా అధికారి
మండలంలో జరిగే ప్రజావాణిలో ప్రతి సోమవారం శాఖల వారీగా ఒక జిల్లా అధికారిని ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రజలు ఉన్నత అధికారితో నేరుగా మాట్లాడటం మూలంగా సమస్యకు తక్షణ పరిష్కారం లభిస్తుంది,మండల అధికారుల్లో కూడా బాధ్యత పెరుగుతుంది తద్వారా శాఖల వారిగా మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా స్థాయి అధికారిని నియమించాలి
•ఏర్పుల యాదయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
ప్రతి సోమవారం మండల స్థాయిలో జరిగే ప్రజావాణి లో మండల అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారిని కూడా నియమించాలి.తద్వారా ప్రజల్లో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం పెరుగుతుంది.అధికారులు కూడా సమయపాలన పాటించాలి.మండల ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించాలి
రెవెన్యూ,పంచాయతీరాజ్ కే ఎక్కువ దరఖాస్తులు
•జి సి మున్నయ్య (ఎంపీడీవో,ప్రజా వాణి నోడల్ అధికారి)
మండలంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో రెవెన్యూ,పంచాయతీరాజ్ శాఖ లకే ఎక్కువ దరఖాస్తుల అందుతున్నాయి.కార్యక్రమానికి అందరూ అధికారులు సకాలంలో హాజరు కావడం జరుగుతుంది.ప్రజల్లో అవగాహన కల్పించి,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.







కామెంట్లు (0)