మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ - మల్హర్ రావు
కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేల మాటలు విని అధికారులు బందిపోట్లు, దోపిడీదార్లుకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజ్పల్లి గ్రామంలో అర్థరాత్రి అధికారులు దౌర్జన్యంగా కూల్చివేసిన ఇండ్లను ఆయన పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ అధికారులు బందిపోట్లు, దోపిడిదారుల కంటే తీవ్రంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారన్నారు. శాత్రాజ్పల్లిలో అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేస్తే అధికారులు పట్టపగలు రావాలే కానీ అర్థరాత్రి వచ్చి దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు.
మంథని ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉండి ఈ ప్రజల ఓట్లతో గెలిచి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ సున్నం పెట్టొద్దని హితవు పలికారు. ఇండ్ల కూల్చివేత విషయం ముందే చెప్పి హెచ్చరించి ఉంటే ఇంతపెద్ద విపత్తు వచ్చేది కాదన్నారు.
వాళ్ళే ఇండ్లు కూల్చివేయించి మళ్లీ వాళ్లే సానుభూతి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా తన సొంతూరు దన్వాడలో మూడు ఇందిరమ్మ ఇండ్లను కూడా నిర్మించలేదనీ, అభివృద్ధి చేయకపోయినా అమాయక ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తూనే ఉన్నారనీ, కానీ వారు మాత్రం ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆవేదన చెందారు. శాత్రాజ్పల్లిలో మైన్ వస్తదని ఎవరూ చెప్పలేదని, కనీసం నోటిఫిషన్కూడా ఇవ్వలేదని, అక్కడ ఎందుకు ఇండ్లు కట్టుకోకూడదో జవాబు చెప్పాలన్నారు.
ఐఏఎస్ అధికారులు సైతం కాంగ్రెస్ కండువాలు కప్పుకుని తిరుగుతున్నారని, భూపాలపల్లి కలెక్టర్, డీఎస్పీలు కళ్లు తెరువాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రతి అధికారిని గుర్తు పెట్టుకుంటామని, రాబోయే రోజుల్లో వారికి పనిస్మెంట్ తప్పదని హెచ్చరించారు. శాత్రాజ్పల్లికి రోడ్డు వేయించి వెలుగులు తీసుకువచ్చింది తామేనని, అన్యాయంగా ఇండ్లు కూల్చివేశారని, ప్రతి కట్టెకు, ప్రతి గూనపెంకకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ నాయకులు, బాధితులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)