Magazines

జానపద కళల పరిరక్షణకు సుద్దాల హనుమంతు జాతీయ అవార్డు

6 గంటల క్రితం

Suddala Ashok teja
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

పోచారం యక్షగాన కళాకారుడు మహమ్మద్ అక్బర్‌కు అవార్డు

నవతెలంగాణ – పరకాల

తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ జానపద కళలపై ఆసక్తిని పెంపొందించడంతోపాటు, కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తన తండ్రి సుద్దాల హనుమంతు పేరుతో జాతీయ అవార్డులను అందిస్తున్నట్లు ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. 2010లో సుద్దాల హనుమంతు పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి, అప్పటి నుంచి ఏటా ఒకరు లేదా ఇద్దరు ప్రతిభావంతులైన కళాకారులకు అవార్డులను అందిస్తున్నట్లు వెల్లడించారు.


ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 15 మందికి ఈ అవార్డును అందించగా, 16వ అవార్డును హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు మహమ్మద్ అక్బర్‌కు ప్రదానం చేయనున్నట్లు అశోక్ తేజ పేర్కొన్నారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అక్బర్‌తోపాటు ఓ అనువాదకురాలికి కూడా సుద్దాల హనుమంతు జాతీయ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు.


నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ పోరాటంలో సుద్దాల హనుమంతు జానపద కళలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారని అశోక్ తేజ గుర్తుచేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో జానపద కళలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. తన తల్లి జానకమ్మ, తండ్రి హనుమంతు ప్రజల్లో చైతన్యం నింపేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

మహమ్మద్ అక్బర్‌కు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని అశోక్ తేజ అన్నారు.


తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న కవులు, కళాకారులతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఎంపిక చేసి అవార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. తాను సినీ గేయ రచయితగా ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సకల కళల కళావేదిక రాష్ట్ర చైర్మన్ భూపతి వెంకటేశ్వర్లు, సుభాష్ చంద్రబోస్‌తోపాటు పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్