డివైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవంలో నాయకుల పిలుపు
నవతెలంగాణ-ఆలేరు రూరల్
భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత కుల, మత, ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు యాసారపు ప్రసాద్, పట్టణ కార్యదర్శి మొరిగాడి పృథ్వి పిలుపునిచ్చారు. గురువారం డివైఎఫ్ఐ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మొరిగాడి పృథ్వి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం యువత ముందుండాలని అన్నారు. యువతలోని సృజనాత్మక శక్తిని గుర్తించి దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ నేడు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో యువతను విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కాసుల నరేష్, డివైఎఫ్ఐ నాయకులు సాయి, వంగరి అరుణ్, మాదాని నవీన్, జశ్వంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)