Magazines

సీజేపీ నేతలకు జ్యుడీషియల్‌ కస్టడీ

3 గంటల క్రితం

Judicial custody
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 3 నిమిషాల చదవడం

తీహార్ జైలుకు తరలింపు
ఖండించిన సీపీఐ(ఎం) ఓటు హక్కును
సమర్ధించడం నేరమా?


న్యూఢిల్లీ : ఈ నెల 13న జంతర్‌ ‌మంతర్‌‌లోకి ప్రవేశిస్తున్నారన్న ఢిల్లీ పోలీసుల ఆరోపణల నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌ ‌దాస్‌, అశుతోష్‌ ‌రాంకాలకు ఐదు రోజులు జ్యుడీషియల్‌ ‌కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మరో సీజేపీ నేత అజింక్యా షిండెను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.ఇకపై నిరసనల ప్రదేశంగా జంతర్‌‌మంతర్‌‌ వుండదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే

జంతర్‌ ‌మంతర్‌‌లోకి ప్రవేశించడానికి వారు ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులు ఆ ముగ్గురిపై, ఇతరులపై మంగళవారం ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేశారు. తాళం వేసిన గేట్లపైకి, బారికేడ్లపైకి ఎక్కిన ఈ బృందం భారత పతాకాన్ని ప్రదర్శిస్తూ, నినాదాలు చేసింది. ఆ తర్వాత భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని జఫర్‌‌పూర్‌ ‌కలన్‌ ‌పోలీసు స్టేషన్‌‌కు తీసుకెళ్ళారు. బుధవారం తెల్లవారు జామున పార్లమెంట్‌ ‌స్ట్రీట్‌ ‌పోలీసు స్టేషన్‌కు ముగ్గురు సీజేపీ నేతలను తీసుకువచ్చారు. సీజేపీ నేతలు తమ లాయర్లను కలిసేందుకు మంగళవారం అర్ధరాత్రి వరకు అనుమతించలేదని సీజేపీ లీగల్‌ ‌వ్యవహారాలు చూసే రత్నాసింగ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. వారిని తీహార్‌ ‌జైలుకు పంపే అవకాశం వుందని ఆమె తెలిపారు.

జెండాను ఎగురవేయడమే తప్పా?

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే వారు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అసమ్మతి స్వరాలను అణచివేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే, పరోక్ష చర్యలకు బదులుగా ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటించే ధైర్యం చూపాలని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలను పిరికిపంద వ్యూహాలుగా అభివర్ణించారు. అంతుకు ముందు చేసిన పోస్ట్లో సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకా, అజింక్యా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్న ఓ ఫొటోను పంచుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రాసుకొచ్చారు.

'వందేమాతరం అన్నందుకే జైలుకు పంపారు'

తనతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, పార్టీ కార్యకర్తలు జంతర్‌మంతర్‌ వైపు వెళ్లి భారత జెండాను ప్రదర్శించడంతో పాటు 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారని అజింక్యా శిందే తెలిపారు. ఈ కారణంగానే సౌరవ్, ఆశుతోష్‌కు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని ఆరోపించారు. తమ నేతలను జైలుకు పంపడం ద్వారా కార్యకర్తలను భయపెట్టవచ్చని మోదీ, అమిత్ షా భావిస్తే అది పొరపాటేనని అన్నారు. తమ నాయకులు తలెత్తుకుని జైలుకు వెళ్లారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని కార్యకర్తలు స్పష్టం చేసినట్టు తెలిపారు. ఆశుతోష్ రంకా పుట్టినరోజు రోజే ఆయనను జైలుకు పంపడం బాధాకరమని అజింక్యా వ్యాఖ్యానించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.

బ్రిటిష్ పాలనతో పోలిక

స్వాతంత్ర్య పోరాట సమయంలో భారత జెండాను ఎగురవేసి దేశభక్తి నినాదాలు చేసిన విప్లవకారులను బ్రిటిష్ పాలకులు జైలుకు పంపేవారని అజింక్యా గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహా పాలన దేశంలో కొనసాగుతోందని మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ అహంకారం ఎంతోకాలం కొనసాగదని వ్యాఖ్యానించారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సీజేపీ జాతీయ కార్యవర్గం బుధవారం సమావేశం కానుందని తెలిపారు. సమావేశం అనంతరం పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. 16న ఢిల్లీలో తిరంగా మార్చ్‌ నిర్వహించనున్నట్టు అభిజీత్‌ దీప్కే తెలిపారు.

సీపీఐ(ఎం) ఖండన

సీజేపీ నేతలు సౌరవ్‌‌దాస్‌, అశుతోష్‌‌ రాంకాలను అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఓటు హక్కును సమర్ధించడం ఈ ప్రభుత్వ హయాంలో నేరమా? త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం శాంతిని భంగం కలిగించడమని అమిత్‌ ‌షా, ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. తక్షణమే వారిని విడుదల చేయాలని, శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిని ఇలా వేధించడాన్ని ఆపాలని కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్