మోడీ సర్కారు చేతుల్లో ప్రయివేటీకరణ
విదేశీ ప్రయివేటు సంస్థకు ఐడీబీఐ బ్యాంకు అప్పగింత!
‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదం వెనుక ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం
పార్లమెంటు హామీలకు విలువ లేదా?
కేంద్రం తీరుపై బ్యాంకింగ్ నిపుణుల విమర్శలు
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పే మోడీ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజాధనంతో నిలదొక్కు కున్న ఐడీబీఐ బ్యాంకును విదేశీ ప్రయివేటు సంస్థకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది. నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ సాయం తీసుకున్న బ్యాంకు... లాభాల బాట పట్టాక ప్రయివేటు యాజమాన్యంలోకి వెళ్లనుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సొమ్ముతో సంస్థలను ఆదుకోవడం.. అవి కోలుకున్నాక వాటిపై నియంత్రణను వదులుకోవడం మోడీ సర్కారు ఆర్థిక విధానాలపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్రం తీరుపై బ్యాంకింగ్ సెక్టార్ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కలిపి కలిగి ఉన్న 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు అనుబంధ సంస్థకు విక్రయించేందుకు ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో బ్యాంకు యాజమాన్యంపై ప్రయివేటు సంస్థకు పట్టు లభించే అవకాశం ఏర్పడింది. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సంస్థను విక్రయించాలన్న నిర్ణయం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల భవిష్యత్తు, ప్రజాధన వినియోగం, ఆర్థిక స్వావలంబనపై చర్చకు దారితీస్తోంది.
ప్రజల సొమ్ముతో బలోపేతం.. ప్రయివేటుకు అప్పగింత
1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 ప్రధాన ప్రయివేటు బ్యాంకులను, 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసింది. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఉపాధి, సామాజిక అవసరాలకు రుణాలు అందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. 1964లో అభివృద్ధి ఆర్థిక సంస్థగా ఏర్పాటైన ఐడీబీఐని 1976లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు. 2004లో వాణిజ్య బ్యాంకుగా మార్చారు. అప్పట్లో పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రభుత్వం కనీసం 51 శాతం వాటాను తన వద్దే ఉంచుకుంటుందని అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని పక్కనపెట్టి నియంత్రణను వదులుకోవడం వెనుక కారణాలేమిటో మోడీ ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సి ఉందనే ప్రశ్నలు వినబడుతున్నాయి.
లాభాలు పెరిగాక అమ్మకానికి తొందరెందుకు?
ఐడీబీఐ బ్యాంకు 2020–21లో రూ.1,359 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, 2025–26 నాటికి అది రూ.9,513 కోట్లకు పెరిగింది. ఈ ఆరేండ్లలో మొత్తం నికర లాభం సుమారు రూ.30,106 కోట్లు. గతంలో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగం అండగా నిలిచింది. ఇప్పుడు అదే బ్యాంకు లాభాల్లోకి వచ్చిన తర్వాత నియంత్రణను ప్రయివేటు సంస్థకు అప్పగించాలన్న నిర్ణయం ప్రభుత్వ ప్రాధాన్యాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ''నష్టాల భారం ప్రజలదే.. లాభాలపై హక్కు ఎవరిది? బ్యాంకు పునరుద్ధరణకు వినియోగించిన ప్రజాధనాన్ని కేవలం ఖర్చుగా చూడలేం. భవిష్యత్తులో వచ్చే లాభాలు, ప్రభుత్వానికి అందే డివిడెండ్లు, సామాజిక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ అంశాలను పక్కనపెట్టి విక్రయానికి మొగ్గుచూపడం ప్రజా ప్రయోజనాల కంటే ప్రయివేటు యాజమాన్యానికి ప్రాధాన్యమిస్తున్నారు'' అనే విమర్శలు, సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సామాజిక బ్యాంకింగ్‌కు ముప్పు
జన్‌ధన్ ఖాతాలు, ముద్ర రుణాలు, రైతులకు పంట రుణాలు, వీధి వ్యాపారులకు స్వనిధి, సంక్షేమ పథకాల నగదు బదిలీ వంటి కార్యక్రమాలకు ప్రభుత్వ బ్యాంకుల విస్తృత నెట్వర్క్ కీలకం. ప్రయివేటు బ్యాంకులకూ నియంత్రణ నిబంధనలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యం ద్వారా సామాజిక లక్ష్యాలను నేరుగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఐడీబీఐ విక్రయం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సేవలు, చిన్న ఖాతాదారులకు అందుబాటు, బలహీన వర్గాలకు రుణాల లభ్యత ఎలా ఉంటాయో మోడీ ప్రభుత్వం స్పష్టం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. నేటి ఐడీబీఐ నిర్ణయం రేపు ఇతర ప్రభుత్వ బ్యాంకులకూ వర్తిస్తే సామాజిక బ్యాంకింగ్ భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రయివేటీకరణే సంస్కరణ కాదు
సమర్థత, సాంకేతిక అభివృద్ధి, మెరుగైన నిర్వహణ కోసం ప్రయివేటీకరణ తప్పనిసరి అన్న వాదన సరికాదని నిపుణులు చెప్తున్నారు. ప్రయివేటు బ్యాంకుల్లోనూ నియంత్రణ లోపాలు, అక్రమాలు చోటుచేసుకోవచ్చని అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాపై విధించిన 750 మిలియన్ డాలర్ల జరిమానాను వారు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో పారదర్శకత, సమర్థవంతమైన బోర్డులు, సాంకేతిక పెట్టుబడులు, తగిన సిబ్బందితో సంస్కరణలు చేపట్టవచ్చనీ, అందుకు యాజమాన్యాన్ని ప్రయివేటుకు అప్పగించాల్సిన అవసరం లేదన్నది ప్రధాన వాదనగా వారు చెప్తున్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదం ఏమైంది?
దేశం స్వావలంబన సాధించాలని మోడీ ప్రభుత్వం పదేపదే చెప్తోంది. అయితే ప్రజాధనంతో బలోపేతం చేసిన కీలక ఆర్థిక సంస్థపై ప్రభుత్వ నియంత్రణను వదులుకోవడం ఆ నినాదానికి విరుద్ధంగా కనిపిస్తోంది. దేశ ప్రజల పొదుపు ఎక్కడికి వెళ్లాలి, దీర్ఘకాలిక పెట్టుబడులు ఏ రంగాలకు అందాలి, అభివృద్ధికి ఏ ప్రాధాన్యాలు ఇవ్వాలనే నిర్ణయాల్లో దేశానికి స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యం ఉండాలి. విదేశీ పెట్టుబడులు భారత చట్టాలు, ఆర్బీఐ నిబంధనలకు లోబడే ఉన్నప్పటికీ, నియంత్రణ పర్యవేక్షణకు ప్రభుత్వ యాజమాన్యానికి మధ్య తేడా ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఉద్యోగులు, ఖాతాదారుల భవిష్యత్తుకు భరోసా ఏది?
బ్యాంకు విక్రయం వల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రత, వేతనాలు, పెన్షన్లు, ట్రేడ్ యూనియన్ హక్కులు, రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రభుత్వం వెల్లడించాలనే డిమాండ్ ఉంది. ''గ్రామీణ శాఖలు, తక్కువ సేవా రుసుములు, పేదలకు రుణాల లభ్యతను కాపాడేందుకు స్పష్టమైన, చట్టబద్ధమైన హామీలు ఇవ్వాలి. బ్యాంకును పునరుద్ధరించడంలో భాగస్వాములైన ఉద్యోగులు, దానిపై నమ్మకంతో సేవలు పొందుతున్న ఖాతాదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి'' అని నిపుణులు చెప్తున్నారు.
'విక్రయాన్ని నిలిపివేసి సమీక్షించాలి'
ఐడీబీఐ విక్రయ ప్రక్రియను నిలిపివేసి, బ్యాంకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పెట్టుబడిపై భవిష్యత్తు ఆదాయం, విక్రయ ధర నిర్ణయించిన విధానం, ప్రభుత్వ యాజమాన్యాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాలపై సమగ్ర సమీక్ష జరపాలని వారు సూచిస్తున్నారు. ఈ అంశాలను పార్లమెంటు ముందుంచి ఉద్యోగ సంఘాలు, ఖాతాదారులు, ఆర్థికవేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్తున్నారు. ''ప్రజల సొమ్ముతో నష్టాల నుంచి బయటపడిన సంస్థను లాభాల్లోకి వచ్చిన తర్వాత ప్రయివేటుకు అప్పగించడమే అభివృద్ధి విధానమా? ప్రజాధనంతో ఏర్పడిన సంస్థలపై ప్రజలకు, ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం ఉండాలి. ఐడీబీఐ విక్రయం కేవలం ఒక బ్యాంకు భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదు.. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఎవరికి మేలు చేస్తున్నాయన్నది కీలకంగా మారింది'' అని వారు అంటున్నారు.






కామెంట్లు (0)