Magazines

దీపావళికి ముందే బాదుడు

51 నిమిషాల క్రితం

price hike
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 3 నిమిషాల చదవడం

వాణిజ్య గ్యాస్‌ ధరలు మళ్లీ పెంపు

ఒక్కో సిలిండర్‌పై రూ.10 అదనం

వరుసగా మూడో నెలా పెరిగిన ధరలు

హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ వ్యయాలు పెరిగే అవకాశం

విమాన ఇంధనం కూడా భారమే


న్యూఢిల్లీ : దీపావళి పండుగకు ముందే కేంద్రం సామాన్యులపై మరో ధరల భారం వేసింది. ఇప్పటికే నిత్యావ సర వస్తువుల ధరలతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్న ప్రజలపై పరోక్షంగా ప్రభావం చూపేలా వాణిజ్య వంటగ్యాస్‌ ధరలను మరోసారి పెంచింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.10 పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో దాని ధర రూ.2,820కు చేరింది. నవంబర్‌ 1 నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణ యంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వంట ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు, హోటళ్లలో భోజన బిల్లులు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. మరోవైపు విమాన ఇంధనం (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరలను కూడా చమురు సంస్థలు పెంచాయి. అయితే గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

వరుసగా పెరుగుతున్న వాణిజ్య గ్యాస్‌ ధరలు

వాణిజ్య వంటగ్యాస్‌ ధరలు వరుసగా పెరుగుతుండటం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు భారంగా మారుతోంది. ముఖ్యంగా చిరువ్యాపారులకు ఇది చాలా ఇబ్బందికరంగా మారుతోంది. సెప్టెంబర్‌ 1న ఒక్కో సిలిండర్‌పై రూ.9.50, అక్టోబర్‌ 1న రూ.62.50 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో రూ.10 పెంచాయి. దీంతో మూడు నెలల్లోనే వాణిజ్య గ్యాస్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. జూన్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రికార్డు స్థాయికి చేరింది. ఫిబ్రవరి నుంచి జూన్‌ మధ్య 19 కిలోల సిలిండర్‌ ధర రూ.1,740.50 నుంచి రూ. 3,113.50కు చేరింది. అంటే నాలుగు నెలల్లోనే రూ. 1,373 పెరిగింది. అనంతరం జులై, ఆగస్టు నెలల్లో ధరలు తగ్గినా సెప్టెంబర్‌ నుంచి మళ్లీ పెరుగుదల మొదలైంది.

హైదరాబాద్‌లో రూ.3వేల పైనే!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్‌) డేటా ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో చూసుకుంటే కోల్‌కతాలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర అత్యధికంగా రూ.17 పెరిగింది. ఢిల్లీలో అక్టోబర్‌లో రూ.2,810గా ఉన్న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,820కి చేరింది. అంటే ఒక్కో సిలిండర్‌పై రూ.10 పెరిగింది. అదేవిధంగా చెన్నైలో అక్టోబర్‌లో రూ.2,983గా ఉన్న ధర తాజాగా రూ.2,994.50కి చేరింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.11.50 అదనపు భారం పడింది. ఇక హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.3వేల పైన పలుకుతోంది. తాజా పెంపుతో ఒక్క సిలిండర్ రేటు రూ.3065 పైన ఉంది. ఆపైన అదనంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల అక్టోబర్ 1న కమర్షియల్ సిలిండర్ రేటును రూ.62.50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ.10 పెంచడంతో అదనపు భారం మోపినట్టయింది.

గృహావసరాల గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులేదు

వాణిజ్య గ్యాస్‌ ధరలు పెరిగినప్పటికీ గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరను మాత్రం మార్చలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. ఈ రెండు ఇంధనాల ధరలను చివరిసారిగా మే నెలలో లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున పెంచిన విషయం విదితమే.

వరుసగా నాలుగో నెలా విమాన ఇంధనం ధరల పెంపు

కమర్షియల్‌ వంటగ్యాస్‌తో పాటు విమానాల్లో వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలను కూడా చమురు సంస్థలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, ఇంధన ధరలు బలపడటంతో లీటరుపై రూ.1.37 పెంచాయి. దీంతో గతంలో రూ.137.12గా ఉన్న ఏటీఎఫ్‌ ధర రూ.138.50కు చేరింది. వరుసగా నాలుగో నెల కూడా విమాన ఇంధనం ధరలు పెరగడం గమనార్హం. ఆగస్టు 1న లీటరుపై రూ.5, సెప్టెంబర్‌ 1న రూ.6.28, అక్టోబర్‌ 1న రూ.16 చొప్పున పెంచారు. విమానయాన సంస్థల నిర్వ హణ వ్యయంలో దాదాపు 40 శాతం ఇంధనానికే ఖర్చ వుతుంది. దీంతో ఏటీఎఫ్‌ ధరల పెరుగుదల విమానయాన సంస్థలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపనుంది. ఈ ప్రభా వం విమాన టికెట్ల ధరలపై కూడా పడే అవకాశం ఉంది.

ధరల నియంత్రణలో మోడీ సర్కారు విఫలం

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో వచ్చే మార్పుల ఆధారంగా చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన వంటగ్యాస్‌, విమాన ఇంధన ధరలను సమీక్షించి సవరిస్తుంటాయి. రాష్ట్రాలను బట్టి స్థానిక పన్నులు, ముఖ్యంగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) కారణంగా ధరల్లో తేడాలు ఉంటాయి. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ముందుచూపులేని విధానాలు, అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల కారణంగానే రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందనీ, వరుస ధరల పెంపుతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు, ప్రజలు వాపోతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్