Magazines

రాచకొండ ఎత్తిపోతల వెంటనే మంజూరు చేయాలి

52 నిమిషాల క్రితం

Rachakonda
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 3 నిమిషాల చదవడం

డీపీఆర్ సిద్ధం చేసి, పెండింగ్ పనులు పూర్తి చేయాలి : ​సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎం.డి. జహంగీర్

చౌటుప్పల్‌ ‌వరకు పాదయాత్ర ప్రారంభం


​నవతెలంగాణ–నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మంజూరు చేయాలని, డీపీఆర్ సిద్ధం చేసి అవసరమైన నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా చర్లగూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్ అన్నారు. రాచకొండ ప్రాంతానికి సాగు,తాగు నీరందించాలనే లక్ష్యంతో ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ శివన్నగూడెం రిజర్వాయర్‌ ‌నుంచి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు సీపీఐ(ఎం) నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల మహాపాదయాత్రను జూలకంటి ప్రారంభించారు. సుమారు 75 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్ర మంగళవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ​కమ్యూనిస్టుల ఉద్యమాల ద్వారానే నాగార్జునసాగర్, ఎస్ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు సాధ్యమయ్యాయన్నారు.

ప్రజా ఉద్యమాలు, పాదయాత్రలు, ధర్నాలు, శాసనసభలో పోరాటాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కూలీలకు మెరుగైన వేతనాలు సాధించామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు అవసరమన్నారు. రాచకొండ ప్రాంతం ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమని తెలిపారు. దశాబ్దాలుగా కలుషిత నీటిని తాగుతూ ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులు సమీపంలో ఉన్నప్పటికీ స్వచ్ఛమైన తాగునీరు అందకపోవడం దురదృష్టకరమన్నారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు సీపీఐ(ఎం) అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. ​నల్లగొండ, మునుగోడు, దేవరకొండ, భువనగిరి ప్రాంతాల్లో సాగునీటి సమస్య పరిష్కారానికి 2007లో ప్రాజెక్టు సర్వే చేపట్టగా, 2010లో కేంద్రానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపారని తెలిపారు.

రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సుమారు 3.60 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి ఐదారేండ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు. రెండు టీఎంసీల నీటిని తీసుకువచ్చి, అర టీఎంసీని ఈ ప్రాంతానికి, మిగిలిన 1.5 టీఎంసీలను ఇతర ప్రాంతాలకు అందించేలా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఏడు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, కొన్ని పనులు 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, ప్రధాన కాలువ పనులు మరో 40 నుంచి 42 కిలోమీటర్ల మేర చేపట్టాల్సి ఉందని అన్నారు. గతంలో నీటి కేటాయింపులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను సీపీఐ(ఎం) వ్యతిరేకించిందని, పార్టీ ఒత్తిడితో నిర్ణయించిన కేటాయింపులనే కొనసాగించాలని పాలకులు నిర్ణయించారని పేర్కొన్నారు.

చర్లగూడెం పనులు పూర్తి చేయాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌

చర్లగూడెం ప్రాజెక్టుకు 2015లో శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్‌ విమర్శించారు. సుమారు రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.1,500 నుంచి రూ.1,600 కోట్ల వరకు మాత్రమే ఖర్చు ‌చేశారని అన్నారు. దీంతో పనులు అసంపూర్తిగా ఉండడంతో పాటు పలువురు నిర్వాసితులకు పరిహారం అందలేదన్నారు. ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందో ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ​మునుగోడు, దేవరకొండ ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నారాయణపురం మండలంలో వందలాది ఎకరాల భూములు బీడుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించడంతో పాటు, శివన్నగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని కోరారు. రాజకొండ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదికను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపిందని జహంగీర్ తెలిపారు.

సర్వే పూర్తయిన నేపథ్యంలో డీపీఆర్ సిద్ధం చేసి, నిధులు కేటాయించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. రాచకొండ ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు సీపీఐ(ఎం) పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రకు రైతులు, ప్రజలు, అన్ని వర్గాల వారు మద్దతు తెలిపి, చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వద్ద వినతిపత్రం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బూరుగు కృష్ణారెడ్డి, పాదయాత్ర బృందం సభ్యులు సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, దోడ యాదిరెడ్డి, మల్లేపల్లి లలిత, గుంటోజు శ్రీనివాసచారి, ఐత రాజు గాలయ్య, ఆరుట్ల రాజు కేసాని కృష్ణ, గుండు జంగయ్య, ఉప్పలపల్లి బాలకృష్ణ, కుకుడాల మంగమ్మ, వెలిజాల సుందరయ్య, దూడ భరత్ రెడ్డి, దొంతగోని శంకరయ్య, జనగల యాదయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దోనూరు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు దొంతగాని పెద్దలు, పిట్ట రాములు, చింతకాయల నరసింహ, చాపల మారయ్య పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్