Magazines

లిబరల్ ఆర్ట్స్‌‌తో అవగాహన

55 నిమిషాల క్రితం

Liberal Arts
avatar
balaji

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం

​హైదరాబాద్‌ బుక్‌‌ఫెయిర్‌ లోగో ఆవిష్కరణలో ప్రొఫెసర్‌ రమామెల్కొటే

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లిబరల్ ఆర్ట్స్(‌మేధస్సును పెంపొందించటం, సృజనాత్మ కత, మానవతావాదం) అనేది మానవుల్లో అవగాహనను పెంచుతుందని ప్రొఫెసర్‌ ‌రమామెల్కొటే అన్నారు. కేవలం చరిత్రే కాకుండా సాహిత్యం, సైన్స్, టెక్నాలజీ పరిశోధనల్లో కూడా దీని పాత్ర ఉంటుందని ఆమె చెప్పారు. పుస్తక ప్రదర్శనలు వివిధ రకాల పుస్తకాలను ఒకే చోటకు చేర్చటమే కాకుండా, జ్ఞానం ఏ ఒక్క రంగానికి పరిమితం కాదనే విషయాన్ని విడమర్చి చెబుతాయని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు సంకుచిత భావాలను, ఎక్స్‌క్లూజివ్‌నెస్‌ను తొలగించి, అన్నింటికీ ఓపెన్‌గా ఉండే తత్త్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతీయేటా ఉత్సాహపూరిత, స్ఫూర్తిదాయక వాతావరణంలో నిర్వహించే హైదరాబాద్‌ పుస్తక మహోత్సవ (బుక్‌‌ఫెయిర్‌) ‌లోగోను ఆదివారం బషీర్‌బాగ్‌ ‌ప్రెస్‌‌క్లబ్‌‌లో రమామెల్కొటే, సీనియర్‌ ఎడిటర్‌ ‌కె.రామచంద్రమూర్తి తదితరులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బుక్‌ ‌ఫెయిర్‌ సొసైటీ ఉపాధ్యక్షులు బాల్‌‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమామెల్కొటే, రామచంద్రమూర్తి, సొసైటీ ఉపాధ్యక్షులు శోభన్‌‌బాబు, సహాయ కార్యదర్శి రజిని, పూర్వ అధ్యక్షులు కవి యాకూబ్‌, కార్యదర్శి నారాయణ రెడ్డి, కోశాధికారి సురేష్‌, కార్యవర్గ సభ్యులు సజయ తదితరులు మాట్లాడారు. బుక్‌‌ఫెయిర్‌‌ను ఈ ఏడాది డిసెంబర్‌ 18నుంచి 28వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ ‌స్టేడియం)లో 11రోజుల పాటు పుస్తకాల పండుగ కొనసాగనుందని చెప్పారు. పుస్తకావిష్కరణలు, బాలల, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రెండేండ్లకోసారి ఎన్నికయ్యే నూతన కార్యవర్గంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని వివరించారు. బుక్‌ ఫెయిర్‌‌ను ఈ ఏడాది 320 స్టాళ్లకు పరిమితం చేశామనీ, స్టాళ్లు ఏర్పాటు చేసుకునే నిర్వాహకుల నుంచి ఆన్‌‌లైన్‌‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

​ జీలానీ బానో ప్రాంగణంగా..

ఈ ఏడాది బుక్‌‌ఫెయిర్‌‌కు ‘జీలానీ బానో’ ప్రాంగణంగా నామకరణం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. భారతీయ ఉర్థూ సాహిత్యంలో విశిష్టమైన కథా, నవలా రచయిత్రిగా ఆమె ప్రఖ్యాతిగాంచారని పేర్కొన్నారు. మహిళలు, పిల్లల హక్కుల కోసం పని చేశారని గుర్తు చేశారు. సాహిత్యాన్ని సామాజిక మార్పునకు ఒక సాధనంగా ఉపయోగించేందుకు తపించారని తెలిపారు. పద్మశ్రీతో సహా ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ తదితర అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. ప్రఖ్యాతిగాంచిన ఆ రచయిత పేరును ప్రధాన ప్రాంగణానికి నామకరణం చేయటమే సరైందని కమిటీ భావించినట్టు తెలిపారు. సాహిత్య వేదికకు ముక్తవరం పార్థసారథి పేరును, పుస్తకావిష్కరణల వేదికకు డాక్టర్‌ ‌వైబీ సత్యనారాయణ, రైటర్స్‌ ‌స్టాల్స్‌‌కు సదానంద శారద, ఏటుకూరి ప్రసాద్‌, మీడియా స్టాల్స్‌‌కు తెలిదేవర భానుమూర్తి పేర్లు పెట్టినట్టుగా వారు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్