Magazines

ఏపీలో కూటమికే పట్టం

58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో భారీ ఆధిక్యత

అనంతపురంలో బీజేపీ ఓటమి

నందికొట్కూరులో వైసీపీ విజయం

మెరుగుపడిన సీపీఐ(ఎం)

​అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన పట్టణ స్థానిక ఎన్నికల్లో అధికార ‌టీడీపీ కూటమి గెలుపొందింది. రాష్ట్రమంతా కూటమి ఆధిక్యం కనపడింది. కార్పొరేషన్లలో మేయర్‌, కార్పొరేటర్లతో పాటు, మున్సిపాల్టీల్లో ఛైర్‌ ‌పర్సన్‌, వార్డు మెంబర్ల స్థానాల్లోనూ ఇదే స్థితి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ ‌మోహన్‌‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపతో పాటు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాల్టీలోనూ టీడీపీ హవా కొనసాగింది. రాత్రి 11 గంటల సమయానికి వైసీపీ అనంతపురం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌‌లో ఆధిక్యంలో ఉంది. నందికొట్కూరు మున్సిపల్‌ ‌ఛైర్‌‌పర్సన్‌ తో పాటు మెజార్టీ వార్డుల్లోనూ గెలుపొందింది. మరో రెండు మున్సిపాల్టీల్లోనూ ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో గెలిచిన ఒకొక్క కార్పొరేటర్‌ ‌స్థానాలను గెలిచిన సీపీఐ(ఎం) తాజా ఎన్నికల్లో వాటిని నిలబెట్టుకోవడంతో పాటు మరో నాలుగు మున్సిపాల్టీల్లో నాలుగు వార్డు సభ్యుల స్థానాలను అదనంగా సాధించింది.

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ గెలుపొందగా, ప్రస్తుత ఎన్నికల్లో ఒకటి మినహా మిగిలిన స్థానాల్లో అధికార టీడీపీ కూటమి గెలుపొందింది. తాజా ఎన్నికల్లో పోస్టల్‌ ‌ బ్యాలెట్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లు వైసీపీ పోల్‌ ‌కావడం ఉద్యోగుల్లో అధికార కూటమి పట్ల ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోంది.

కార్పొరేషన్లలో ఇలా...

మొత్తం 13 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో రాత్రి పదిగంటల సమయానికి కూటమి ఏడు స్థానాల్లో విజయం సాధించింది. మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌‌ను కేటాయించగా ఆ పార్టీ ఓటమి పాలైంది. వైసీపీ గెలుపును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన విశాఖ మేయర్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి సమీప వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణిపై 2లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. కూటమి మేయర్‌ అభ్యర్థులు తిరుపతిలో మన్నె శ్రీనివాస ప్రసాద్, చిత్తూరులో కఠారి హేమలతమ గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, మచిలీపట్లంలో షూక్‌ అబ్దులా అబీదా, నెల్లూరులో రూప్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, విశాఖలో ముక్కా శ్రావణి, ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు(జనసేన) కర్నూలులో ప్రత్యూష గెలుపొందారు.

మున్సిపాల్టీల్లో ...

మొత్తం 87 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11 గంటల సమయానికి టీడీపీ 54 స్థానాల్లోనూ, జనసేన 16 స్థానాల్లోనూ, బీజేపీ నాలుగు స్థానాల్లోనూ గెలుపొందింది. వైసీపీ నందికొట్కూరు మున్సి పాల్టీలో మాత్రమే విజయం సాధించింది. మరో రెండు స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. రెండింటిలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.


​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్