Magazines

ప్రభావం కోల్పోతున్న యాంటీబయాటిక్స్‌

2 గంటల క్రితం

Antibiotics
avatar
balaji

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

సాధారణ ఇన్‌ఫెక్షన్లకూ పనిచేయని మందులు

ఈ కోలి బ్యాక్టీరియాపై సెఫోటాక్సిమ్‌ ప్రభావం 18.4 శాతమే

శక్తివంతమైన మందులనూ తట్టుకుంటున్న బ్యాక్టీరియా


న్యూఢిల్లీ : సాధారణ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే యాంటీబయాటిక్స్‌ క్రమంగా ప్రభావం కోల్పోతున్నాయి. విచ్చలవిడిగా మందుల వాడకం, వైద్యుల చీటీ లేకుండా యాంటీబయాటిక్స్‌ తీసుకోవడంతో బ్యాక్టీరియాలో వాటిని తట్టుకునే శక్తి పెరుగుతోంది. ఫలితంగా సాధారణ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టంగా మారుతోంది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) 2025 వార్షిక నివేదిక ఈ ఆందోళనకర పరిస్థితిని వెల్లడించింది.

ఈ.కోలిపై తగ్గిన ప్రభావం

ఆస్పత్రుల్లో పరీక్షించిన ఈ.కోలి బ్యాక్టీరియా నమూనాల్లో 18.4 శాతం మాత్రమే సెఫోటాక్సిమ్‌ యాంటీబయాటిక్‌కు స్పందించాయి. న్యుమోనియా, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలకు ఈ మందును ఉపయోగిస్తారు.

బలమైన మందులనూ తట్టుకుంటూ..

తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే కార్బపెనెమ్స్‌ యాంటీబయాటిక్స్‌ ప్రభావం కూడా తగ్గుతోంది. క్లెబ్సియెల్లా న్యుమోనియే బ్యాక్టీరియా నమూనాల్లో మూడింట ఒక వంతు మాత్రమే ఈ మందులకు స్పందించాయి. మరోవైపు, అసినెటోబాక్టర్‌ బామాని నమూనాల్లో 91.1 శాతం కార్బపెనెమ్స్‌ను తట్టుకున్నాయి. ఈ బ్యాక్టీరియా ఆస్పత్రుల్లోని రోగులకు న్యుమోనియా, రక్తప్రవాహ ఇన్‌ఫెక్షన్ల ముప్పును కలిగిస్తోంది.

చిన్న ఆస్పత్రుల్లోనూ సమస్య

యాంటీబయాటిక్స్‌ నిరోధకత పెద్ద ఆస్పత్రులకే పరిమితం కాలేదని ఐసీఎంఆర్‌ పరిశోధన విభాగం అధిపతి డాక్టర్‌ కామిని వాలియా తెలిపారు. ఈ.కోలిపై సెఫ్ట్రియాక్సోన్‌ ప్రభావం కేటగిరీ-1 ఆస్పత్రుల్లో 39.8 శాతంగా ఉండగా, కేటగిరీ-2లో 28 శాతానికి, కేటగిరీ-3లో 11.5 శాతానికి పడిపోయిందని వివరించారు. నవంబర్‌ 18న ప్రారంభమైన ప్రపంచ యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ అవగాహన వారోత్సవాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వైద్యుల చీటీ లేకుండా యాంటీబయాటిక్స్‌ విక్రయించడం, అనవసరంగా వాటిని సూచించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మందుల దుర్వినియోగాన్ని అరికట్టకపోతే సాధారణ ఇన్‌ఫెక్షన్లకు కూడా చికిత్స కష్టమై ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్‌ నివేదిక హెచ్చరిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్