Magazines

కార్పొరేట్లకు పెద్దపీట..
ప్రజా వ్యతిరేకత భయం

1 గంట క్రితం

corporates
avatar
balaji

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సర్కారుకు దిక్కు తోచని పరిస్థితి

అంబానీ రూ.2 లక్షల కోట్ల అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు భూమి కరువు

హారిపూర్‌, నయాచార్‌ ప్రతిపాదనలకు ప్రభుత్వం బ్రేక్‌

2029 ఎన్నికలే లక్ష్యంగా లెక్కలు వేస్తున్న కాషాయ పార్టీ


కోల్‌కతా : కార్పొరేట్‌ పెట్టుబడులే అభివృద్ధికి కొలమానంగా ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి క్షేత్రస్థాయిలో ప్రజల ఆందోళనలు, భూ సమస్యలు సవాలుగా మారుతున్నాయి. అంబానీల రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన రూ.2 లక్షల కోట్ల అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్‌లో స్థలం ఖరారు చేయలేక ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ప్రజా వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతో ఇప్పటికే రెండు ప్రాంతాలను పక్కనపెట్టగా.. భారీ పెట్టుబడులపై బీజేపీ ప్రభుత్వ ప్రచారానికి ఆచరణలో ఎదురవుతున్న అడ్డంకులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి.. మరీ స్థలమేదీ?

కార్పొరేట్‌ దిగ్గజాలకు పెట్టుబడుల ఆహ్వానాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వానికి అంబానీల అణు విద్యుత్‌ ప్రాజెక్టు విషయంలో భూమి సమస్య ఎదురైంది. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని హారిపూర్‌, నయాచార్‌ ప్రాంతాల్లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని తొలుత భావించినప్పటికీ.. స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందనే భయంతో ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. ఇప్పుడు ప్రత్యామ్నాయ స్థలం కోసం వెతుకుతోంది. రిలయన్స్‌ గ్రూప్‌ ఉన్నతాధికారులు సెప్టెంబర్‌ 30న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ అగర్వాల్‌తో సమావేశమై అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఆరేడేండ్లలో సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇంత భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఇప్పటికీ స్థలం ఖరారు కాకపోవడం గమనార్హం.

ప్రజా ఉద్యమ భయంతో వెనక్కి

హారిపూర్‌ ఇప్పటికే అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ఎన్‌పీసీఐఎల్‌ ఆమోదం పొందిన ప్రాంతం. గతంలో ఇక్కడ వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వగా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా ఆందోళనకు నాయకత్వం వహించారు. చివరకు 2011లో అప్పటి తృణమూల్‌ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసింది. ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ ప్రాజెక్టు చేపడితే ప్రజా ఉద్యమం చెలరేగుతుందని బీజేపీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు భూ సేకరణ వ్యతిరేక ఉద్యమాలు ప్రతిపక్షాలకు రాజకీయంగా లాభం చేకూర్చవచ్చనే అంచనాతో హారిపూర్‌ను తిరస్కరించినకట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజల అభిప్రాయాల కంటే ఎన్నికల రాజకీయాలే నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలకు ఈ పరిణామం తావిస్తోంది.

స్పష్టమైన విధానం లేకుండానే పెట్టుబడుల హామీలు

హారిపూర్‌ తర్వాత హాల్దియా సమీపంలోని నయాచార్‌ను పరిశీలించినా, అక్కడ కూడా భూమికి సంబంధించిన వివాదాలు, స్థానిక నిరసనలు తలెత్తవచ్చని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరోవైపు పెట్టుబడిదారుల కోసం భూమిని నేరుగా కొనుగోలు చేయడం, భూ సమీకరణ చేపట్టడం వంటి విధానాలను ప్రకటించినప్పటికీ, స్పష్టమైన భూ విధానాన్ని ఇంకా విడుదల చేయలేదు. దేశంలో ఇప్పటికే ఉన్న అణు విద్యుత్‌ కేంద్రాలన్నీ ఎక్కువగా జనావాసాలకు దూరంగా, తీర ప్రాంతాల్లో ఉన్నాయి. అలాంటి విస్తారమైన భూమిని పశ్చిమ బెంగాల్‌లో గుర్తించడం కష్టంగా మారింది. అంబానీల ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ప్రజల నిరసనలు, భూ సమస్యలపై స్పష్టత లేకపోవడం ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది. కార్పొరేట్‌ పెట్టుబడుల కోసం భారీ హామీలు ఇస్తున్న బీజేపీ.. వాటి అమలులో ప్రజల అభిప్రాయాలు, భూ సమస్యలు, స్థానిక ప్రయోజనాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటుందన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్