కేంద్రం చెప్తున్న ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో శూన్యం
పెరగని మొక్కజొన్న ధరలు.. చెరకు బకాయిలు యథాతథం
లాభపడుతున్న వ్యాపారులు, డిస్టిలరీల యజమానులు
కోళ్ల దాణా ధరలపైనా ఇథనాల్ ప్రభావం
అవసరానికి మించి ఉత్పత్తి.. అమ్ముడుపోని ఇంధనం
గిట్టుబాటు ధర లభించక అన్నదాతల ఆందోళన
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతోందనీ, రైతులకు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్తోంది. కానీ ఇథనాల్ తయారీకి పంటలు అమ్ముతున్న రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. చెరకు రైతులకు చెల్లింపులు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. మరోవైపు వ్యాపారులు, ఇథనాల్ తయారీ పరిశ్రమలు లాభపడుతుండగా, కోళ్ల పెంపకందారులపై కూడా భారం పడుతోంది. అసలు ఇథనాల్ విధానం వల్ల లాభపడుతున్నదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
న్యూఢిల్లీ : పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా దేశానికి ఇంధన భద్రత కల్పించడంతోపాటు రైతుల ఆదాయం పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మొక్కజొన్న, చెరకు వంటి పంటలతో ఇథనాల్ తయారీకి ప్రోత్సాహకాలు ఇచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధరలు
లభించక రైతులు నష్టపోతున్నారు. చెరకు బకాయిల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి పరిణామాలు రైతులకు ఆశించిన ప్రయోజనాలను దూరం చేస్తున్నాయి.
విధానం మారినా.. రైతుల బతుకులు మారలే!
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతోందనీ, ఆ ప్రయోజనాల్లో పెద్ద మొత్తాన్ని రైతులకు అందించామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా మొక్కజొన్న రైతులు, యూపీలోని షామ్లీ చెరకు రైతుల పరిస్థితి చూస్తే ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఎంత తేడా ఉందో అర్థమవుతోంది. ఇథనాల్ తయారీ పెరిగినా తమ ఆదాయాలు మాత్రం గణనీయంగా పెరగలేదని రైతులు చెప్తున్నారు. 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ తయారీని ప్రోత్సహిస్తూ పలు చర్యలు చేపట్టింది. గతంలో ప్రధానంగా చక్కెర తయారీలో మిగిలే మొలాసిస్తో ఇథనాల్ ఉత్పత్తి చేసేవారు. ఆ తర్వాత మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటలను కూడా ఇందుకు వినియోగించేందుకు అనుమతించారు. దీంతో రైతులకు పంటలకు మెరుగైన ధరలు లభిస్తాయనీ, చక్కెర కర్మాగారాలకు అదనపు ఆదాయం రావడంతో చెరకు బకాయిలు త్వరగా చెల్లిస్తారని కేంద్రం ప్రకటించింది. కానీ మొక్కజొన్న రైతుల పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఛింద్వారా జిల్లాకు చెందిన ధర్మేంద్ర రఘువంశీ 32 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఐదు ఎకరాల్లో చెరకు, మిగిలిన భూమిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు.
ఇథనాల్ తయారీ పరిశ్రమలు తమ ప్రాంతంలో పంటను కొనుగోలు చేయడం ప్రారంభించినప్పుడు మంచి ధరలు వస్తాయని ఆశించారు. అయితే, 2016 నుంచి 2026 మధ్య తమకు క్వింటాలుకు రూ.1,100 నుంచి రూ.1,400 మాత్రమే లభించిందని ఆయన తెలిపారు. గతేడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2,410కు చేరినా, ఆ స్థాయిలో ధర దక్కలేదని చెప్పారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగడం, మార్కెట్లో సరఫరా అధికం కావడం, ఇథనాల్ తయారీకి బియ్యాన్ని కూడా పెద్దఎత్తున వినియోగించడం దీనికి ప్రధాన కారణాలని నిపుణులు చెప్తున్నారు. బియ్యం నుంచి ఎక్కువ ఇథనాల్ ఉత్పత్తి చేయగలగడంతో మొక్కజొన్నకు డిమాండ్ ఆశించినంతగా పెరగడం లేదు. మరోవైపు రైతులు పంటను నేరుగా మార్కెట్లలో విక్రయించాలంటే రవాణా ఖర్చులు, సమయం ఎక్కువవుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తోంది. కొన్ని పరిశ్రమలు రైతుల నుంచి నేరుగా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నా.. వాటి అవసరాలకు స్థానికంగా లభించే పంట సరిపోవడం లేదు. దీంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. రైతులకు మెరుగైన ధరలు అందాలంటే పరిశ్రమలు నేరుగా కొనుగోలు చేయడంతోపాటు సాగులో సాంకేతిక సాయం, పంట నాణ్యతపై సూచనలు ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చెరకు రైతులకూ తప్పని కష్టాలు
యూపీలోని షామ్లీ జిల్లాకు చెందిన కపిల్ ఖతియాన్ కుటుంబం సుమారు 17 ఎకరాల్లో చెరకు సాగు చేస్తోంది. ఏటా వెయ్యి నుంచి 1,500 క్వింటాళ్ల చెరకును సమీపంలోని చక్కెర కర్మాగారానికి విక్రయిస్తోంది. ఇథనాల్ తయారీ ప్రారంభమైతే చెరకు డిమాండ్ పెరిగి, మంచి ధరలు లభిస్తాయని ఆశించింది. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. గతేడాది చెరకు ధర క్వింటాలుకు రూ.370 నుంచి రూ.400కు పెరిగినా, ఈ పెరుగుదల ఇథనాల్ తయారీ వల్ల వచ్చిన అదనపు ప్రయోజనం కాదని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, చెరకు విక్రయించిన డబ్బులు సకాలంలో అందడం లేదు. గత సీజన్లో ఏప్రిల్‌లో ముగిసిన క్రషింగ్ ప్రక్రియకు సంబంధించిన చెల్లింపులు జనవరిలో వచ్చాయి. ఈ ఏడాది కూడా ఐదు నెలల ఆలస్యంగా సెప్టెంబరులో డబ్బులు అందాయి. చెరకు కొనుగోలు చేసిన 14 రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేయాలని అలహాబాద్ హైకోర్టు 2021 డిసెంబరులో ఆదేశించింది. ఆలస్యమైతే ఏటా 15 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. అయినా ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి యూపీలోని 121 చక్కెర కర్మాగారాలు రైతులకు రూ.3,300 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కోళ్ల దాణాపైనా ప్రభావం
ఇథనాల్ తయారీ కోసం వ్యాపారులు పెద్ద మొత్తంలో మొక్కజొన్న కొనుగోలు చేస్తుండటంతో కోళ్ల పెంపకందారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోళ్ల దాణాలో మొక్కజొన్న కీలకమైనది. డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగి, దాణా ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ ప్రభావం కోడి మాంసం, గుడ్ల ధరలపై కూడా పడుతోంది. మొక్కజొన్నను ఇంధన తయారీకి మళ్లించేటప్పుడు ఆహార, పశుదాణా అవసరాలపై కూడా దృష్టి పెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఇథనాల్ తయారీ పరిశ్రమలకూ కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో ఏటా అవసరమయ్యే ఇథనాల్ పరిమాణం సుమారు 1,100 కోట్ల లీటర్లు కాగా, ఉత్పత్తి సామర్థ్యం 2,000 కోట్ల లీటర్లకు చేరింది. దీంతో దాదాపు 700 కోట్ల లీటర్లకు సరైన కొనుగోలు మార్కెట్ లేకపోయిందని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొంటున్నాయి. చమురు సంస్థలు తక్కువ పరిమాణంలో ఇథనాల్ కొనుగోలు చేయడంతో కొన్ని పరిశ్రమల లాభాలు తగ్గుతున్నాయి.
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వాహనాల మైలేజీ తగ్గుతోందంటూ వినియోగదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, మిశ్రమ శాతాన్ని మరింత పెంచాలన్న ప్రభుత్వ ప్రణాళికపైనా చర్చ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే... ఇథనాల్ ఉత్పత్తి పెరిగినంత మాత్రాన రైతుల ఆదాయం పెరగడం లేదని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరలు, సకాలంలో చెల్లింపులు, పరిశ్రమలతో రైతులకు ప్రత్యక్ష సంబంధాలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు ఉంటేనే ఇథనాల్ కార్యక్రమం రైతులకు నిజమైన ప్రయోజనం చేకూరుస్తుంది. లేకపోతే, దేశానికి ఇంధన ఆదా కలుగుతోందన్న ప్రభుత్వ ప్రచారం మధ్య రైతులు మాత్రం పాత సమస్యలతోనే పోరాడాల్సి వస్తుందని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మొక్కజొన్నకు అధిక ధర.. చెరకు రైతులకు నిరాశ
ప్రభుత్వ విధానాల్లో మరో కీలక అంశం కూడా ఉంది. మొక్కజొన్నతో తయారైన ఇథనాల్‌కు లీటరుకు రూ.71.86 చెల్లిస్తుండగా, చెరకు నుంచి తయారైన ఇథనాల్‌కు రూ.65.61 మాత్రమే చెల్లిస్తున్నట్టు జులైలో లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో







కామెంట్లు (0)