ప్రోత్సాహకాలు ఇస్తున్నా
కానరాని ఫలితాలు
చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటు
మోడీ పాలనలో తయారీ రంగానికి గ్రహణం
న్యూఢిల్లీ : 2014లో తొలిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశీయ తయారీ రంగాన్ని పరుగులు పెట్టిస్తానని గొప్పలు చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి ? గత పుష్కర కాలంలో ఆ రంగంలో సాధించిన పురోగతి ఏమిటి? అని ప్రశ్నించుకుంటే నిరాశాజనక మైన జవాబులే వస్తాయి. ఈ నెల 14వ తేదీన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక లీడర్షిప్ సమ్మిట్‌లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగిస్తూ పారిశ్రామికీకరణ విషయంలో భారతదేశం 1980వ దశకంలో ‘అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింద’ని చెప్పారు. ఈ వ్యాఖ్య దేశ ఆర్థిక గమనంపై ఓ ముఖ్యమైన చర్చను తెర పైకి తెచ్చింది. డెన్ జియావోపింగ్ నేత త్వంలోని చైనాతో ఆయన చేసిన పోలిక చారిత్రకంగా సందర్భోచితమైనదే.
సంస్కరణలను విస్మరించారా ?
అయితే ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం తయారీ రంగంలో నెలకొన్న లోటుకు 1980వ దశకంలో చేజారిన అవకాశాలు ఎంతవరకూ కారణం ? ముఖ్యంగా 2014 తర్వాత మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల పరిమితులను ఆ లోటు ఎంతవరకూ ప్రతిబింబిస్తోంది?. 1978లో ప్రారంభమైన చైనా సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్య కార్యక్రమం దాని ఆర్థిక నిర్మాణాన్ని క్రమంగా మార్చేశాయి. వ్యవసాయ సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, టౌన్షిప్ - గ్రామ పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు, ఎగుమతి ఆధారిత తయారీ రంగం వంటివి చైనాలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు పునాది వేశాయి. ఆ పునాదే చైనాను ప్రపంచ సరఫరాల వ్యవస్థలో చేర్చింది.
మరోవైపు భారతదేశం 1980వ దశకంలో క్రమేపీ సరళీకరణ ప్రక్రియను అనుసరించింది. 1991లో సమగ్ర సంస్కరణలు చేపట్టింది. అయినప్పటికీ భారతదేశం అవకాశాన్ని కోల్పోయిందని చెప్పడం అప్పటికే కొనసాగుతున్న సంస్కరణలను విస్మరించడమే అవుతుంది. సంస్కరణల్లో భాగంగా 1985 తర్వాత మన ప్రభుత్వం పారిశ్రామిక లైసెన్సులను సడలించింది. దిగుమతి నిబంధనలను సరళీకరించింది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించింది.
ఫలితమివ్వని ప్రోత్సాహకాలు
గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ డేటా ప్రకారం భారతదేశపు మొత్తం స్థూల విలువ జోడింపు (గ్రాస్ వాల్యూ యాడెడ్)లో తయారీ రంగం వాటా 2022-23లో ఎలా ఉందో 2925-26లో కూడా అలాగే స్థిరంగా ఉంది. దేశంలో తయారీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు ఫలితాలు ఇస్తుంటే ఉత్పత్తి కొనసాగింపునకు అవసరమైన విడిభాగాలు, పారిశ్రామిక ముడి సరుకుల కోసం చైనాపై ఎందుకు ఇంతగా ఆధారపడాల్సి వస్తోంది? ఈ సమస్యకు ఉద్యోగ కల్పన కూడా ఓ కొలమానాన్ని అందిస్తోంది. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం మొత్తం ఉద్యోగాలలో తయారీ రంగం వాటా 2017-18లో 12.1 శాతం ఉండగా 2023-24 నాటికి అది 11.4 శాతానికి పడిపోయింది. అదే సమయంలో వ్యవసాయ రంగం వాటా 44 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తయారీ రంగంలో సాంకేతికతలోనూ, జవాబుదారీతనంలోనూ కూడా భారత్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అన్నింటా చైనాపై ఆధారమే
2025`26 ఆర్థిక సంవత్సరంలో భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం రికార్డు స్థాయికి...అంటే 151.10 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే అందులో ఓ అసమతుల్యత దాగి ఉంది. చైనా నుంచి భారత్ చేసుకున్న దిగుమతుల విలువ 131.63 బిలియన్ డాలర్లకు చేరుకోగా మన దేశం నుంచి కేవలం 19.47 బిలియన్ డాలర్ల మేర మాత్రమే ఎగుమతులు జరిగాయి. దీంతో వాణిజ్య లోటు 112.16 బిలియన్ డాలర్లకు పెరిగింది. చైనాపై ఆధారపడడం అనేది కేవలం తుది వినియోగ ఉత్పత్తులకే పరిమితం కాకుండా దేశీయ తయారీకి అవసరమైన పారిశ్రామిక ముడి సరుకుల వరకూ విస్తరించింది. లోక్‌సభకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం...2024 - 25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం చేసు కున్న ఎలక్ట్రానిక్ విడిభాగాల దిగుమతుల్లో 37.94 శాతం, కొన్ని పారిశ్రామిక యంత్రాల దిగుమతుల్లో 45.24 శాతం, కంప్యూటర్ హార్డ్‌వేర్ - పెరిఫెరల్స్లో 49.46 శాతం, బల్క్ డ్రగ్స్-డ్రగ్స్ ఇంటర్మీడియట్లలో 74.11 శాతం వాటా చైనాదే.దీనిని బట్టి చూస్తే వాణిజ్య లోటు పరిమాణానికే కాకుండా చైనా మధ్యంతర వస్తువులు, యంత్రాలు, కీలక భాగాలపై మన దేశం ఆధారపడడం వరకూ విస్తరించింది.
విధానాలు, ఫలితాల మధ్య అంతరం
భారత అభివ ద్ధి గమనంపై ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వేసిన అంచనా ప్రకారం 1980వ దశకం ప్రారంభంలోనే దేశంలో వ్యాపార అనుకూల మార్పుకు నాంది పడింది. అయితే 1991 చెల్లింపుల సమతూకం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) సంక్షోభం తర్వాతే సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 1980వ దశకంలో భారతదేశం పారిశ్రామికీకరణ అవకాశాలను కోల్పోయిందా లేదా అనే దానిపై కంటే చైనా అంతటి సమర్ధత కలిగిన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థ అభివ ద్ధికి అడ్డుపడిన పరిమితుల సమస్యలను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తగిన విధంగా పరిష్కరించాయా లేదా అన్నదే ముఖ్యం. ప్రధానంగా ఈ విషయంలో మోడీ ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేశంలో విధానాలకు, ఫలితాలకు మధ్య ఉన్న అంతరానికి ఉత్పాదక రంగమే అత్యంత స్పష్టమైన సూచిక. ప్రపంచబ్యాంక్ యొక్క మాన్యుఫాక్చరింగ్ వాల్యూ యాడెడ్ సూచిక ప్రకారం 2025 నాటికి భారత జీడీపీలో తయారీ రంగం వాటా 13.47 శాతం కాగా చైనాలో అది 24.73 శాతంగా ఉంది.
పరివర్తన ఎక్కడ?
చైనాలో పరివర్తన అనేది కేవలం ఒక సంస్కరణల కార్యక్రమం ద్వారానో లేక దశాబ్ద కాలంలో వచ్చిన ఫలితమో కాదు. నిరంతర పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివ ద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవడం, ఉత్పత్తి స్థాయిని పెంచడం, అంతర్జాతీయ ఉత్పత్తి నెట్‌వర్క్‌లలో కలవడం వంటివి అందులో ఇమిడి ఉన్నాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం భారత్‌ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తామని హామీ ఇస్తూ తయారీ రంగాన్ని ఆర్థిక అజెండాలో కేంద్ర స్థానంలో ఉంచింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం, సెమీకండక్టర్ ప్రోత్సాహకాలు, ఇండియా ఏఐ మిషన్... వీటన్నింటినీ పరివర్తనకు సాధనాలుగా చూపించారు. అయినప్పటికీ పుష్కర కాలం గడిచినా మన తయారీ రంగం పునాదిలో నిర్మాణాత్మక మార్పు కన్పించడం లేదు.







కామెంట్లు (0)