Magazines

దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

1 గంట క్రితం

Call for nationwide protests
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 5 నిమిషాల చదవడం

అణచివేత చర్యలను ఖండించిన సీపీఐ(ఎం)

ఆందోళనకారుల పట్ల దురుసుగా, దారుణంగా వ్యవహరించిన పోలీసులు
న్యూఢిల్లీ : సీఈసీ రాజీనామాను డిమాండ్‌ ‌చేస్తూ ఢిల్లీలో శనివారం చేపట్టిన ఆందోళనలపై పోలీసుల తీవ్ర అణచివేత, నిర్బంధ చర్యలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఆందోళన చేపట్టిన రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు, విద్యార్థి, యువజన సంఘాలకు చెందిన వందలాదిమంది నేతలను, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సహా పార్టీ అగ్రనాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించి, దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడిలో ఎంపీ శివదాసన్‌ తదితరులకు గాయాలయ్యాయి. ఈ చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈసీ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని, పెద్దఎత్తున ఓటు హక్కు కోల్పోవడానికి దారితీసిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను రద్దు చేయాలని, ఇతర ఎన్నికల సంస్కరణలను చేపట్టాలని కోరుతూ న్యూఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు తీవ్ర అణచివేత చర్యలు చేపట్టారని విమర్శించింది. జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నిరసన తెలియజేస్తుండగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, పొలిట్‌‌బ్యూరో సభ్యులు, కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌, ప్రముఖ నాయకురాలు బృందాకరత్‌, పొలిట్‌‌బ్యూరో సభ్యులు ఎం.వి.గోవిందన్‌, విజయరాఘవన్, కేంద్ర కమిటీ సభ్యులు కె.కె.శైలజ, పి.కె.శ్రీమతి, థామస్‌ ఇజాక్‌, కె.ఎన్‌.బాలగోపాల్‌, పి.రాజీవ్‌, జాన్‌ ‌బ్రిట్టాస్‌ ‌తదితరులను అరెస్టు చేశారు. మింటో రోడ్‌ ‌సమీపంలో మరికొంతమంది నేతలను అరెస్టు చేశారు. వారిలో పొలిట్‌‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, అరుణ్‌ ‌కుమార్‌, విజ్జూ కృష్ణన్‌, మరియం ధావలె, కేంద్ర కమిటీ సభ్యులు ఎ.ఆర్‌.సింధూ, లోకనాథం తదితరులు వున్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత మాణిక్‌ ‌సర్కార్‌ ‌కూడా అరెస్టయ్యారు. వీరంతా ఇంద్రజిత్‌ ‌గుప్తా రోడ్‌లోని హరికిషన్‌ ‌సింగ్‌ ‌సూర్జీత్‌ ‌భవన్‌‌ నుంచి ప్రదర్శన చేపట్టడానికి ప్రయత్నించగా వారిని అరెస్టు చేశారు. ఇతర సీనియర్‌ ‌పొలిట్‌‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులతో సహా మొత్తంగా సీపీఐ(ఎం) నాయకత్వాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో చాలామందిపై పోలీసులు చాలా దారుణంగా, దురుసుగా వ్యవహరించారు. ఫలితంగా ఎంపీ సదాశివన్‌ ‌వంటి కొంతమందికి గాయాల య్యాయని’ పొలిట్‌‌బ్యూరో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నగరమంతా పూర్తిగా కర్ఫ్యూ విధించినట్లున్నా, ఇంటర్‌‌నెట్‌ ‌నిషేధించినా, మెట్రో స్టేషన్లు మూతపడినా, ఇతర అన్ని రకాల రవాణా మార్గాలను నిలిపివేసినా అన్ని రకాలైన పోలీసుల అణచివేత చర్యలను ఎదుర్కొని మరీ ఆందోళనకారులు తమ నిరసనలు వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చారని తెలిపింది. ‘శనివారం ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులపై అణచివేత చర్యలకు దిగారు. వందలాదిగా రాజకీయ పార్టీల, పౌర సంఘాల నేతలను, విద్యార్ధులను, యువతను అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు, కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌, కేంద్ర కమిటీ సభ్యులు కె.ఎన్‌ బాలగోపాల్‌, జాన్‌ ‌బ్రిట్టాస్‌లను గంటల తరబడి పోలీసు వాహనంలోనే నిర్బంధించారు. వారికి ఆహారం, నీరు ఇవ్వలేదు. కనీసం ముఖ్యమైన మందులను వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. పొలిట్‌‌బ్యూరో సభ్యురాలు మరియం ధావలేతో పాటు నిర్బంధించిన మహిళల బృందాన్ని మౌర్య ఎన్‌‌క్లేవ్‌ ‌పోలీసు స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. కనీసం వారిని వాష్‌‌రూమ్‌‌కు వెళ్లడానికి కూడా అనుమతించలేదు. పార్లమెంట్‌ ‌సభ్యులు ఎ.ఎ.రహీమ్‌ ‌సహా పలువురు నాయకుల మొబైల్‌ ‌ఫోన్లను పోలీసులు లాగేసుకున్నారు. నిరసనకారులపై మొత్తంగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో బలప్రయోగం చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు, రవాణా, కదలికలు, కమ్యూనికేషన్‌‌పై తీవ్రంగా ఆంక్షలు విధించడంతో పాటు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఈ చర్యలన్నీ శాంతియుతంగా నిరసనలు తెలియచేసే ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ స్వేచ్ఛలపై దారుణంగా దాడి చేయడమేనని, నిరంకుశత్వాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించడమేనని సీపీఐ(ఎం) విమర్శించింది. సర్‌ ‌ప్రక్రియ వంటి తీవ్రమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కన్నా ప్రజా సమీకరణల పట్ల తనకున్న భయాన్ని, అసమ్మతిని అణచివేయాలన్న ఆలోచనే కనిపిస్తోందని పేర్కొంది. విస్తృతంగా కొనసాగుతున్న ఈ నిరసనలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కలవరం చెందుతోందని, ఇంత ఉధృతంగా అణచివేత చర్యలు చేపట్టినా ప్రజలు వీధుల్లోకి రాకుండా ఆపలేకపోయారని స్పష్టమవుతోందని తెలిపింది. పోలీసుల నిఘా చర్యలు ఎంత తీవ్రంగా వున్నా, ఢిల్లీలోని సీపీఐ(ఎం) కార్యాలయాల ఎదుట పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించినా కూడా ఈ నిరసనలు కొనసాగాయి. అధి కారాన్ని, బలాన్ని ప్రదర్శించాలనే వ్యామో హంలో పడి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన పిరికితనాన్ని, ప్రజాస్వామ్య బద్ధ పాలనను నిర్వహించడంలో పూర్తి వైఫల్యాన్ని కనబరిచిందని పొలిట్‌‌బ్యూరో విమర్శించింది. ఓటు హక్కు అనేది ప్రజాస్వా మ్యానికి మౌలికమని, దాన్ని, అస్పష్టమైన విధానాలు లేదా ఏకపక్ష బహిష్కరణల ద్వారా దెబ్బతీయలేరని పేర్కొంది. ఈ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా పార్టీ శాఖలన్నీ నిరసనలు చేపట్టాలని పొలిట్‌‌బ్యూరో పిలుపునిచ్చింది.

ఢిల్లీలో మూడు ప్రాంతాల్లో నిరసనలు

ఢిల్లీలో మూడు ప్రాంతాల్లో సీపీఐ, ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌), ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఏఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. హెచ్‌కెఎస్‌ సూర్జిత్‌ భవన్‌ వద్ద సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నిర్వహించిన ఆందోళనలో సీపీఐ జాతీయ సెక్రె టేరియట్‌ సభ్యుడు ప్రకాశ్‌ బాబు నాయకత్వంలో సుమారు 70 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గోల్డా ఖానా వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ అఖిల భారత అధ్యక్షుడు విరాజ్‌ దేవాంగ్‌ నాయకత్వంలో నిరసన చేపట్టారు. బి.డి. మార్గ్‌ వద్ద ఎంపీ పి. సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

సుప్రీంకోర్టు న్యాయవాదులపైనా పోలీసుల దాడి
ప్రధాన న్యాయమూర్తి జోక్యంతోనే విడుదల

విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించిన సుప్రీంకోర్టు న్యాయవాదులపైనా ఢిల్లీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. మహిళా న్యాయవాదులతో సహా సుమారు 60 మంది న్యాయవాదుల ను పోలీసులు క్రూరంగా కొట్టారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని తూర్పు ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు తరలించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకోవడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు వారిని విడుదల చేశారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో సుప్రీంకోర్టు నుంచి న్యాయవాదులు ప్రదర్శనగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన మూడు వరుసల బారికేడ్లను దాటుకుని ముందుకు సాగారు. మండీ హౌస్‌ వద్దకు చేరుకోగానే వందలాది మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులతో సహా ప్రదర్శనకారులపై పోలీసులు దాడి చేశారు. న్యాయవాదులను అదుపులోకి తీసుకుని తూర్పు ఢిల్లీలోని సూరజ్‌మల్‌ ప్రాంతంలో ఉన్న యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు తరలించారు. మరోవైపు, కోర్టు సమీపంలో, న్యాయవాదుల ఛాంబర్ల దగ్గర నేమ్‌ప్లేట్లు లేని పోలీసులు నలుగురు న్యాయవాదులను పట్టుకుని తీసుకెళ్లారు. ఈ ఘటనపై బార్‌ అసోసియేషన్‌, అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ సంఘాలు స్పందించాయి. న్యాయవాదుల నిర్బంధంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకోవాలని కోరాయి. దీంతో ఆయన నగర పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. ప్రధాన న్యాయమూర్తి జోక్యం అనంతరం పోలీసులు న్యాయవాదులను మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేశారు. న్యాయవాదులపై పోలీసుల చర్యను బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది.


సర్‌ పోరాటంలో వెనక్కి తగ్గం : రాహుల్‌ గాంధీ

దశాబ్ద కాలంగా ప్రధాని మోడీ, ఆరెస్సెస్‌లతో తాను పోరాడుతూనే ఉన్నానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఒక ప్రత్యర్థిని ఎలాగైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో.. తాను వారిని అలా అర్థం చేసుకున్నానని చెప్పారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.‘‘మోడీ జీ.. మీకు నచ్చినట్లు చేయండి. పోలీసులందరినీ రంగంలోకి దించండి. 10 వేలు..20 వేలు..50 వేలు.. ఇలా ఎంతమందినైనా సరే. నాయకులందరినీ.. యువతను.. ఇలా అందరినీ అరెస్టు చేయండి. కానీ.. మేమంతా మిమ్మల్ని చుట్టు ముడుతున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని కాపాడు కుంటాం. దేశ ప్రజల గొంతుకను రక్షించు కుంటాం. గత 10-15 ఏండ్లలో దేశానికి జరిగిన అన్యాయం ఇక ఎప్పటికీ జరగకుండా చూస్తాం. ఈ ప్రభుత్వాన్ని, రాజ్యాంగంపై దాడి చేసిన వారిని ఓడించేలా కృషి చేస్తాం’’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్