ఢిల్లీ మార్చ్ ఉద్రిక్తం
సర్ రద్దు, సీఈసీ రాజీనామాకు డిమాండ్
ఇండియా బ్లాక్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
ఎంపీలు, మహిళా కార్యకర్తలు, నేతల అరెస్టు.. పలువురికి గాయాలు
ప్రియాంకా గాంధీతో పాటు పలువురిని ఛత్రసాల పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
పోలీస్ స్టేషన్‌లోనూ ఎంపీల నిరసన
బారాఖంబా పోలీస్‌స్టేషన్ కు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం సీఎం సతీశన్‌లకు పోలీసులు అడ్డగింత
కాంగ్రెస్ నేతల భారీ ఆందోళన
ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపు
రెండుగంటల అనంతరం రాహుల్, ఇండియా బ్లాక్ ఎంపీల విడుదల
నవతెలంగాణ -న్యూఢిల్లీ
బ్యూరో
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు రెండోరోజు బుధవారం చేపట్టిన మార్చ్ ఉద్రిక్తంగా మారింది. జనపథ్‌లోని సాగర్ రత్న హోటల్ నుంచి జంతర్‌మంతర్‌కు మూడు బస్సుల్లో బయలుదేరిన వీరిని మార్గమధ్యలో అశోక్ రోడ్ వద్ద ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరోపక్క జంతర్ మంతర్‌కు తరలివస్తున్న వేలాది మంది కార్యకర్తలను పోలీసులు మార్గమధ్య లోనే నిలిపేశారు. దీంతో ఎంపీలు నడిరోడ్డుపైనే భైటాయించారు. పడుకొని నిరసన చేపట్టారు. ప్రియాంకగాంధీ నేతృత్వంలో పలువురు మహిళా ఎంపీలు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిరసనకారులు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు, నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళా కార్యకర్తలని కూడా చూడకుండా అందరినీ ఈడ్చుకెళ్ళి బస్సుల్లో కుక్కారు. సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, ఎ.ఎ.రహీం, సీపీఐ ఎంపీ పి.సంతోష్‌కుమార్‌లపై పోలీసులు దాడికి దిగారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలను సైతం పోలీసులు బస్సుల్లోకి ఎక్కిస్తుండగా తోపులాట జరిగింది. బస్సులపైకి ఎక్కి నిరసన తెలిపిన వారిపైనా పోలీసులు లాఠీలు ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురి దుస్తులు చిరిగిపోయాయి. వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. అనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఎంపీలను వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
పోలీస్ స్టేషన్‌లోనూ నిరసన
అరెస్టు అనంతరం ఎంపీలు రాహుల్‌గాంధీ, వి.శివదాసన్, ఎ.ఎ.రహీం తదితర ఎంపీలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి బస్సుల్లో ఎక్కించారు. వారిని బారాఖంబా పోలీస్ స్టేషన్‌లో కొన్ని గంటలపాటు ఉంచారు. అక్కడ కూడా ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. పోలీస్ స్టేషన్ వెలుపల పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రియాంకా గాంధీతో పాటు పలువురు ఎంపీలను ఛత్రసాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బారాఖంబా పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళం సీఎం సతీశన్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకొని ఆందోళన చేపట్టగా వారిని పోలీసులు నిలువరించారు. దాదాపు రెండు గంటల పాటు రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ ఎంపిలను విడుదల చేశారు.
జంతర్‌మంతర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆంక్షలు
నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నివాసంతో పాటు ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనలను నియంత్రించేందుకు జంతర్‌మంతర్ ప్రాంతంలో ఆంక్షలు విధించినప్పటికీ, నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. అశోక్ రోడ్‌తో పాటు పలు ప్రధాన మార్గాలను భద్రతా బలగాలు మూసివేయడంతో ఢిల్లీలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు కూడా గంటల సమయం పట్టిందని ప్రయాణికులు తెలిపారు. ఢిల్లీ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్, ఆర్ఎఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ బలగాలను కూడా భారీగా మోహరించాయి.
మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని నిరీర్యం చేస్తున్నారు
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ద్వారా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడితే తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఆ ఎఫ్ఐఆర్‌లను తాను పతకాలుగానే భావిస్తానని చెప్పారు. ఇప్పటివరకు తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, వంద తన టార్గెట్ అని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరం కలిసి ఈసీని కలవాలనుకున్నామని చెప్పారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. అందుకే ఆయన పదవి నుంచి దిగిపోవాలని కోరుతున్నామని తెలిపారు.
ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా?
ఎంపీలతో ప్రవర్తించే తీరు ఇదేనా?
ఎంపీలను కొడతారా? ఈడ్చి పడేస్తారా? అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మహిళా పోలీసు సిబ్బంది తనను కూడా కిందపడేశారని, ఒళ్లంతా గోళ్లతో గీరారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీని కలుద్దామని అడగడం నేరమా? అని అడిగారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మండిపడ్డారు.
ప్రతిపక్షాల డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చర్యల వెనుక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజల హక్కులను పరిరక్షించినందుకు తమపై ఎన్నికేసులు నమోదైనా తాము భయపడబోమని, వెనుకాడమని స్పష్టం చేశారు. శాంతియుత నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు ‘‘క్రూరమైన బలప్రయోగం’’ చేశారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, ఆ రాక్షసుడిని తరిమికొట్టే వరకు తాము పోరాడుతున్నామని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ అన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. తమ ఆందోళనను అడ్డుకునేందుకు అరెస్టులు, లాఠీ దెబ్బలు పరిష్కారం కాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటమని సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.







కామెంట్‌లు (0)