మూడో రోజూ ప్రతిపక్షాల ఆందోళన
రాజ్‌ఘాట్‌లో ఇండియా బ్లాక్ ఎంపీల శాంతియుత నిరసన
జ్ఞానేశ్ కుమార్, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఇండియా బ్లాక్ కి చెందిన ఎంపిలు మహాత్మాగాంధీ స్మారకమైన రాజ్‌ఘాట్‌కు చేరుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎంపీలతోపాటు వేలాది మంది కార్యకర్తలు కూడా రాజ్‌ఘాట్‌కు తరలివచ్చారు. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, మౌన ప్రార్థన నిర్వహించిన అనంతరం నేతలు నిరసన చేపట్టారు.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఐ(ఎం) రాజ్యసభా పక్ష నేత జాన్ బ్రిట్టాస్, ఎంపీలు వి.శివదాసన్, ఎ.ఎ.రహీం, సీపీఐ రాజ్యసభా పక్షనేత పి.సంతోష్‌కుమార్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అభిషేక్ బెనర్జీ, వయనాడ్ ఎంపి ప్రియాం కగాంధీ నిరసనకు నాయకత్వం వహించారు.
మూడు బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు
ఢిల్లీ కనాట్‌ప్లేస్‌లోని మొహెట్స్ హోటల్‌కు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఎంపిలు చేరుకోవడం ప్రారంభించారు. సుమారు మూడున్నర గంటల సమయంలో మూడు బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు. ఎంపీల బస్సులను అనుసరిస్తూ వేలాది మంది కార్యకర్తలు కాలినడకన రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఇండియా కూటమి నేతలు గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం కొద్దిసేపు మౌన ప్రార్థన నిర్వహించారు. జ్ఞానేశ్ కుమార్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పలుచోట్ల గోడలపై కూడా జ్ఞానేశ్ కుమార్, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
పోలీసుల భారీ మోహరింపు
ప్రతిపక్ష ఎంపిల నిరసన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో గురువారం కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించింది. గత రెండు రోజులుగా నిరసనలకు దిగిన ఎంపీలు, కార్యకర్తలను అరెస్టు చేసి తరలించిన పోలీసులు ఈసారి మాత్రం ఆ విధంగా వ్యవహరించలేదు. ఇండియా కూటమి నేతలను రాజ్‌ఘాట్‌లోకి అనుమతించారు.
మింటో రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎంపిల నిరసనను అడ్డుకునేందుకు తొలుత పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమిం చుకున్నారు. దీంతో ఇండియా కూటమి ఎంపిలు, కార్యకర్తలు రాజ్‌ఘాట్‌కు చేరుకుని నిరసన కొనసాగించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు గ్యానేష్‌కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఓటు చోరీ’పై పోరాటం: ఖర్గే
‘ఓటు చోరీ’పై తమ పోరాటం కొనసాగుతుందని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. శాంతియుతంగా నిరసన చేపట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రజా ప్రయోజనాలపై ఆలోచించే విజ్ఞత కలగాలని ప్రార్థిస్తామని అన్నారు. ఓటర్ల హక్కుతోపాటు ప్రజాస్వామ్య హక్కులు బలహీనప డుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సిఇసి జ్ఞానేష్‌కుమార్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మధ్య ‘కుట్ర’ ఉందని పేర్కొన్నారు. ఆ నలుగురూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని, అది మీరంతా చూస్తారని, ఇది నా హామీ అని అన్నారు. దాదాపు 300 మంది ఎంపిలు శాంతియుతంగా నిరసన చేపట్టాలని భావించినప్పటికీ గత రెండు రోజులుగా తమను అడ్డుకున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిం చేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. రెండోరోజు జంతర్ మంతర్‌కు వెళ్లనివ్వలేదని, ఎంపిలపై దాడి చేశారని తెలిపారు.నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రతిపక్ష ఎంపీల భేటీ కానున్నారు.






కామెంట్‌లు (0)