Magazines

26న దేశవ్యాప్త నిరసన

1 గంట క్రితం

Nationwide protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

వ్యవసాయ, గ్రామీణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలి

అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు

​ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలి

​రోజుకు రూ.700 వేతనంతో 200 రోజుల పని కల్పించాలని డిమాండ్‌

​​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 26న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో వ్యవసాయ, గ్రామీణ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది. రైతులు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలో అంతర్భాగమని, కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా ఇరువర్గాలూ ఐక్యంగా పోరాడాలని సూచించింది. ఈ మేరకు బి. వెంకట్‌ (ఎఐఎడబ్ల్యూయూ), జి.ఎస్‌. గోరియా (బీకేఎంయూ), ధీరేంద్ర ఝా (ఎఐఎఆర్ఎల్ఎ), అసిత్‌ గంగూలీ (ఎఐఎస్‌కేఎస్‌), ధర్మేంద్ర (ఎఐఎకేఎస్‌యూ) మంగళవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు సాగించిన చారిత్రాత్మక పోరాటంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుందని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పేర్కొంది. అయితే 2021 డిసెంబర్‌ 9న రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించింది. అన్ని పంటలకు సి2+50 శాతం ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించేందుకు నిరాకరిస్తోందని తెలిపింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల దోపిడీకి అప్పగించే విధానాలను కొనసాగిస్తోందని, గిట్టుబాటు ధరలు లభించక వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయని, వ్యవసాయ కార్మికులకు తగినన్ని పనిదినాలు లభించడం లేదని పేర్కొంది. నిరుద్యోగం, వలసలు, పేదరికం, ఆకలి పెరుగుతున్నాయని తెలిపింది. ఉపాధి హామీ వ్యవస్థను బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గ్రామీణ కార్మికుల జీవనోపాధి హక్కులపై ప్రత్యక్ష దాడి అని విమర్శించింది.

కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు

2005లో అమల్లోకి వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని, దానిని బలహీనపరిచే మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల పని, రోజుకు రూ.700 కనీస వేతనం కల్పించాలని, వేసవిలో ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వడంతోపాటు ఇందుకు తగిన నిధులు కేటాయించాలని కోరింది. భూమిలేని వ్యవసాయ కార్మికులకు సాగు భూములు పంపిణీ చేయాలని, దళితులు, ఆదివాసీలు, మహిళా వ్యవసాయ కార్మికులపై సామాజిక వివక్ష, దాడులు, అణచివేతలను అరికట్టాలని పేర్కొంది. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను పూర్తిగా రద్దు చేసి, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, సామూహిక చర్చల హక్కు, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పరిరక్షించాలని డిమాండ్‌ చేసింది.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, దీని పేరుతో తొలగించిన కోట్లాది మంది ఓటర్ల పేర్లను ప్రతి పంచాయతీలో బహిర్గతం చేయాలని కోరింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై విచారణ, చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ప్రజల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు, ప్రజాస్వామ్య హక్కులు, పౌరసత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది.కార్పొరేట్‌ గుత్తాధిపత్య సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు కల్పిస్తూ, రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక ప్రజలపై భారాలు మోపుతోందని ఉమ్మడి వేదిక విమర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ‌ప్రయివేటీకరిస్తూ, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగిస్తోందని పేర్కొంది. మతతత్వ రాజకీయాలతో ప్రజల మధ్య విభజన సృష్టించి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 26న జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేసి ఉపాధి హక్కుల పరిరక్షణకు, కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్