గ్రాప్-2' ఆంక్షలు అమల్లోకి
అత్యంత పేలవ స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత
324కు చేరిన ఏక్యూఐ.. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత అత్యంత పేలవ స్థాయికి పడిపోవడంతో వాయు కాలుష్య నియంత్రణ కమిషన్ (సీఏక్యూఎం) సోమవారం నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) రెండో దశ ఆంక్షలను తక్షణమే అమల్లోకి తెచ్చింది. ఈ సీజన్లో తొలిసారిగా గాలి నాణ్యత ఈ స్థాయికి పడిపోవడంతో కాలుష్యాన్ని మరింత పెరగకుండా అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టింది. సీఏక్యూఎం వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న ఢిల్లీ గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 117గా నమోదైంది. ఇది మోస్తరు కాలుష్య స్థాయి. అయితే నవంబర్ 1న ఒక్కసారిగా 261కు చేరి పేలవ స్థాయికి పడిపోయింది. సోమవారం నవంబర్ 2 నాటికి ఏక్యూఐ మరింత పెరిగి 324కు చేరుకుంది. దీంతో గాలి నాణ్యత అత్యంత పేలవ స్థాయికి చేరినట్టు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ పరిణామానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లోనూ ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత పేలవ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు.
గాలి నాణ్యత మరింత దిగజారకుండా ముందస్తుగా చేపట్టే అత్యవసర చర్యల సమాహారమే గ్రాప్. ఏక్యూఐ స్థాయిని బట్టి నాలుగు దశల్లో ఆంక్షలు విధిస్తారు. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గ్రాప్-1, 301 నుంచి 400 మధ్య ఉంటే గ్రాప్-2, 401 నుంచి 450 మధ్య ఉంటే గ్రాప్-3 అమలు చేస్తారు. 450 దాటితే గ్రాప్-4 ఆంక్షలు విధిస్తారు.
కాగా సెప్టెంబర్‌లో సీఏక్యూఎం గ్రాప్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. గ్రాప్-3 అమలులో భాగంగా బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ లేదా అంతకంటే తక్కువ ప్రమాణాలు కలిగిన తేలికపాటి నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపై ఆంక్షలను హర్యానాలోని సోనిపట్‌కు కూడా విస్తరించింది. గతంలో ఈ నిబంధనలు గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రజారోగ్యాన్ని కాపాడటం, గాలి నాణ్యత మరింత దిగజారకుండా చూడటం అధికారులకు సవాలుగా మారింది.






కామెంట్లు (0)