Magazines

రాజ్యాంగ పరిరక్ష‍ణ అందరి బాధ్యత

36 నిమిషాల క్రితం

responsibility
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

దానిని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమించాలి

రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘిస్తున్న కార్మిక కోడ్‌లు

డిసెంబరు 1-3 ఆందోళనలు.. రాజ్యాంగ హక్కుల అమలుకు పరీక్ష : 
రాజ్యాంగ దినోత్సవ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ​
భారత రాజ్యాంగంలోని లౌకిక, ప్రజాస్వామ్య, సమ్మిళిత స్ఫూర్తిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు కార్మికులు, యువత, విద్యా ర్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎంఎ బేబీ మాట్లాడుతూ డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఆందో ళనలు రాజ్యాంగ హక్కుల అమలుకు పరీక్షగా నిలవనున్నాయని పేర్కొన్నారు. 77 ఏండ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి తుది రూపునిచ్చిందని గుర్తు చేశారు. అనేక సవరణలు జరిగినప్పటికీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేరని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని తెలిపారు. దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా కొనసాగించాలన్న ప్రాథమిక సూత్రాలను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.


రాజ్యాంగ ప్రవేశిక పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతోపాటు ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ఆరాధన స్వేచ్ఛను కల్పిస్తోందని తెలిపారు. గతంలో రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సమీపంలోని బోట్ క్లబ్ వద్ద ప్రజా సమస్యలపై కార్మికులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ నిరసనలకు అనుమతి లేదని, జంతర్ మంతర్, పార్లమెంట్ వీధుల్లోనూ ఆందోళనలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కుదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.కార్మిక హక్కులను హరించే నాలుగు కొత్త కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా వేలాది మంది కార్మికులు ఢిల్లీకి తరలివస్తున్నారని ఎంఎ బేబీ తెలిపారు. కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తూ హక్కుల పరిరక్షణ కోసం వారు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్మిక కోడ్‌లు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం సౌభ్రాతృత్వాన్ని బోధిస్తుంటే, కేంద్రంలోని పాలకులు మనుస్మృతి, గోల్వాల్కర్ రచించిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ భావజాలాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.


ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను అంతర్గత శత్రువులుగా చిత్రీకరించే ధోరణి దేశ ఐక్యతకు ప్రమాదకరమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని, ఆర్ఎస్ఎస్, సావర్కర్ బ్రిటిష్ వారికి సహకరించేందుకు సిద్ధపడ్డారని ఎంఎ. బేబీ అన్నారు. ఈ చారిత్రక నేపథ్యమే కమ్యూనిస్టుల పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరికి కారణమని వివరించారు. మహిళలకు సమానత్వం, శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణ రాజ్యాంగ లక్ష్యాల్లో కీలకమైనవని పేర్కొన్నారు. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణలో విఫలమైనప్పుడు ‘భారత ప్రజలమైన మనం’ ముందుకు వచ్చి రాజ్యాంగంలోని సానుకూల అంశాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ఎర్రజెండా, జాతీయ జెండా ఒకే వేదికపై కలిసి ఎగురుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, విజయరాఘవన్, తపన్ సేన్ పాల్గొన్నారు.

జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సీపీఐ(ఎం) నిరసన చేప‌ట్టింది. గురువారం సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్‌)లో జరిగిన ఈ ఆందోళనలో సర్‌ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ప్రసంగించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కనినిక ఘోష్‌ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ప్రకాశ్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, తపన్‌ సేన్‌, ఎ.విజయరాఘవన్‌, ఆర్‌.అరుణ్‌కుమార్‌, కేంద్ర కమిటీ సభ్యులు ఎళమరం కరీం, పి.కె.శ్రీమతి, కనినిక ఘోష్‌, సుదీప్‌ దత్తా, ఎ.ఆర్‌.సింధు, విక్రమ్‌ సింగ్‌, కె.ఎన్‌.ఉమేష్‌, ఆర్‌.కరుమలయ‌న్‌ తదితరులు పాల్గొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్