Magazines

దేశ సంపదను కొల్లగొట్టే కుట్ర

16 నిమిషాల క్రితం

nation's
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 4 నిమిషాల చదవడం

రాజ్యాంగంపై మోడీ ముఠా దాడి

ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యం గిట్టని సంఘ్ పరివార్

రాచరికాన్ని మళ్లీ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు

ఆ కుయుక్తులను తిప్పికొడదాం :
 సంవిధాన్ రక్షా మార్చ్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ పిలుపు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

దేశ సంపదను కొల్లగొట్టేందుకు దుష్ట చతుష్టయం పన్నాగం పన్నిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకు అడ్డుగా ఉన్న రాజ్యాంగాన్ని తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బడా పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలే ఆ దుష్ట చతుష్టయం అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ఆ నలుగురు కలిసి చేస్తున్న కుట్రలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతోందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపులో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాందీ విగ్రహం వరకు సంవిధాన్ రక్షా మార్చ్ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం.సందీప్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలతో నివాళులు అర్పించారు.

అనంతరం ‘సంవిధాన్ రక్షా మార్చ్ ... సంవిధాన్ కా రక్షా యుధ్... ఓట్ చోరీ కా విరోధ్’ పేరుతో భారీ బ్యానర్ ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు చేతపట్టుకుని నడుచుకుంటూ బయలుదేరారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని సచివాలయం ముందు నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ బందోబస్తు మధ్య ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గాడ్సే వారసులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా హక్కులను కాపాడుకునేందుకు ప్రజలతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న పోరాటమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కే.సీ.వేణుగోపాల్ తదితరులు పాండవుల మాదిరిగా నిలబడితే, మరో వైపు గాడ్సే బృందం కౌరవుల మాదిరిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాచరికం రద్దై ప్రజలే పాలకులను ఎన్నుకుని తమ సేవకులుగా మార్చుకునే అవకాశాన్ని రాజ్యాంగం ఇవ్వడాన్ని బీజేపీ జీర్ణించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికీ రాచరికం ఉండాలని ఆ పార్టీ ఆశిస్తోందని తెలిపారు.


ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్, బీజేపీ ప్రతి దశలో ప్రజలకు సమాన హక్కులు, అధికారం దక్కడానికి వ్యతిరేకంగానే ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిత్రను వివరించారు. సంఘ్ పరివార్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదనీ, రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని 524 సంస్థానాలను రద్దు చేసి రాజ్యాంగంతో ప్రజలకు సమాన హక్కులతో పాటు ఓటు హక్కుతో పాలకులను ఎన్నుకునే అధికారం కల్పించిందని తెలిపారు. మహనీయులు పండిత జవహర్ లాల్ నెహ్రూ, సర్థార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లు ప్రజలు తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛను ప్రసాదించారని చెప్పారు. అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఒకేసారి అందరికీ ఓటు హక్కు రాలేదని గుర్తుచేశారు. సంఘ్ పరివార్ మొదట్నుంచి అందరికీ సమాన ఓటు హక్కు ఉండటానికి వ్యతిరేకంగా ఉందని తెలిపారు. 2014, 2019లో మోసపూరిత హామీలతో, మూడోసారి ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు.


బ్రిటీషర్ల భారతదేశంలో తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు సైమన్ కమిషన్ వేసినట్టుగా, వారి వారసులైన బీజేపీ పాలకులు సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ను ఉపయోగించుకుని 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు పూనుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు బ్రిటీష్ పాలకులను తరిమికొట్టిన కాంగ్రెస్, నేడు బీజేపీకి బుద్ధి చెప్పి తీరుతుందని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ నిన్న, నేడు, రేపు, భవిష్యత్తులోనూ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గాడ్సే బృందానికి వ్యతిరేకంగా గాంధీ పరివార్ చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం తెలంగాణలో ఒక కోటి ఓట్లు సాధించాలనీ, 17 ఎంపీ సీట్లు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు.

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బి.ఎం.సందీప్ మాట్లాడుతూ అహింసతో యుద్ధం గెలిచి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామనీ, రాజ్యాంగంతో ప్రపంచంలోనే గుర్తింపును సాధించుకున్నామని తెలిపారు. రాజ్యాంగ సభలో 250 మంది సభ్యులతో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ అంబేద్కర్ ప్రతి రోజు 18 గంటల చొప్పున రాజ్యాంగ రచనకు కష్టపడ్డారని తెలిపారు. ప్రజల కోసం ప్రజలు రాసుకున్న ప్రజా రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే వాటిని ప్రయివేటీకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అని నినదిస్తే జవాన్ ను, కిసాన్ ను నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇందిరాగాంధీ పేదరికాన్ని తొలగించాలని పిలుపునిస్తే బీజేపీ పేదలను తొలగించే కుట్రలు చేస్తున్నదన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతికతను తెస్తే ఆ సాంకేతికతను ప్రజల హక్కులను హరించేందుకు దుర్వినియోగం చేస్తున్నదని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం సత్యం - అసత్యం, హింస - అహింస మధ్య పోరాటం జరుగుతుం దన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజ్యాంగంతోనే ప్రజలకు సమాన హక్కులు, ఇష్టమైన ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ లభించాయని గుర్తుచేశారు. ఆ రాజ్యాంగానికి బీజేపీ నుంచి ఉన్న ప్రమాదంపై కాంగ్రెస్ పోరాడుతున్నదని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 13 ఏండ్లుగా బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజహరుద్దీన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్