పెగాసస్ నుంచి మణిపూర్ వరకు..
విచారణలు పూర్తయినా అమలుకు నోచుకోని సిఫారసులు
రైతు చట్టాలు, స్వలింగ సంపర్కుల హక్కులు, పర్యావరణం
కీలక అంశాలపై కమిటీలు వేసిన సర్వోన్నత న్యాయస్థానం
నివేదికలు సమర్పించినా కొన్నింటిపై ముందడుగు కరువు
మరికొన్నింటిపై ఇంకా
కొనసాగుతున్న పర్యవేక్షణ
పెగాసస్ నిఘా ఆరోపణలు,మణిపూర్ హింస, రైతు చట్టాలు, పర్యావరణ విధ్వంసం.. ఇలా దేశాన్ని కుదిపేసిన అనేక కీలక అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. విచారణలు జరిపి నివేదికలు, సిఫారసులు సమర్పించినా వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది. కొన్ని నివేదికలు కోర్టు రికార్డులకే పరిమితం కాగా, మరికొన్ని ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. అసలు ఈ కమిటీల నివేదికలపై ఏం జరుగుతోంది? ప్రజలకు న్యాయం చేకూర్చాల్సిన సిఫారసులు కార్యరూపం దాల్చుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
న్యూఢిల్లీ : ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాలపై పరిశీలన, హింసాత్మక ఘటనల్లో బాధితులకు న్యాయం, పర్యావరణ పరిరక్షణ.. ఇలా అనేక కీలక అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఎక్కువగా రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలు విచారణలు జరిపి నివేదికలు, సిఫారసులు సమర్పిస్తున్నాయి. అయితే వాటి నివేదికలపై తదుపరి చర్యలు ఏమిటి? సిఫారసులు అమలవుతున్నాయా? లేక కోర్టు రికార్డులకే పరిమితమవుతున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పెగాసస్ నిఘా వ్యవహారం నుంచి మణిపూర్ హింస వరకు వివిధ కమిటీల పనితీరును పరిశీలిస్తే ఈ పరిస్థితి స్పష్టమవుతోంది.
చార్ధామ్ రహదారి ప్రాజెక్టు
ఉత్తరాఖండ్‌లోని నాలుగు పుణ్యక్షేత్రాల ను కలిపే చార్ధామ్ రహదారుల విస్తరణ వల్ల హిమాలయ పర్యావరణానికి కలిగే నష్టా లను పరిశీలించేందుకు 2019లో సుప్రీంకో ర్టు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పర్యావరణవేత్త రవిచోప్రా నేతృత్వంలోని కమిటీలో రహదారుల వెడల్పుపై విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వ వర్గాలకు చెందిన మెజారిటీ సభ్యులు 12 మీటర్ల వెడల్పును సమర్థించగా, చోప్రా నేతృత్వంలోని నలుగు రు సభ్యులు పర్యావరణానికి అనుకూలంగా 5.5 మీటర్ల వెడల్పునే కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. తర్వాత జస్టిస్ ఏ.కె.సిక్రీ పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు కొనసాగాయి. పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది కమిటీ పరిశీలిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో 18వ నివేదికను కోర్టుకు సమర్పించింది. ధారాలి ప్రాంతంలో వరదల తర్వాత పర్యావరణ, భౌగోళిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని 100 కిలోమీటర్ల పరిధిలోని ఐదు రహదారి పనుల ప్రణాళికలను పునఃపరిశీలించాలని సూచించింది. నేతాలా బైపాస్ నిర్మాణాన్ని కూడా భూగర్భ పరిస్థితులపై అధ్యయనం పూర్తయ్యేవరకు నిలిపివేశారు.
ఎల్జీబీటీక్యూఐఏ+ హక్కుల కమిటీ
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు 2023లో నిరాకరించినప్పటికీ, క్వీర్ జంటలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందడంలో ఎదుర్కొంటున్న వివక్షను పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. 2024 ఏప్రిల్‌లో క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. అయితే ఇప్పటివరకు 2024 మే, ఆగస్టు నెలల్లో రెండుసార్లే సమావేశమైంది. ఈ ఏడాది ఆగస్టులో లోక్‌సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం నివేదిక ఇంకా సమర్పించలేదు. వైద్యం, సంక్షేమ పథకాలు, ఇతర హక్కుల కల్పనపై ఈ కమిటీ పరిశీలించాల్సి ఉంది.
వ్యవసాయ చట్టాలపై కమిటీ
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో 2021 జనవరి 12న సుప్రీంకోర్టు వాటి అమలును నిలిపివేసింది. రైతులు, సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అశోక్ గులాటీ, అనిల్ ఘన్వత్, ప్రమోద్ కుమార్ జోషి ఇందులో సభ్యులుగా ఉన్నారు. 2021 మార్చి 19న కమిటీ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది. అదే ఏడాది డిసెంబరులో కేంద్రం చట్టాలను రద్దు చేయడంతో నివేదికపై కోర్టులో తదుపరి చర్చ జరగలేదు. కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ ఆ నివేదికను స్వయంగా బహిర్గతం చేశారు.
ట్రాన్స్జెండర్ల హక్కుల కమిటీ
ట్రాన్స్‌జెండర్ మహిళ జేన్ కౌశిక్‌కు ఉద్యోగంలో జరిగిన అన్యాయంపై గతేడాది అక్టోబర్ 17న సుప్రీంకోర్టు పరిహారం ప్రకటిస్తూ, ట్రాన్స్జెండర్లకు సమాన ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు, హక్కుల రక్షణ కోసం జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ వర్గాలతో చర్చలు జరుపుతూ సమాన అవకాశాల విధానాన్ని రూపొందిస్తోంది.
విద్యార్థుల ఆందోళనలపై కమిటీ
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన హింసపై విచారణకు ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచేలా ప్రత్యేక పోర్టల్‌ను సిద్ధం చేసినట్టు అక్టోబర్‌లో కమిటీ కోర్టుకు తెలిపింది. మొత్తంగా చూస్తే.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్న కమిటీలు కీలక అంశాలపై నిజాలను వెలికితీయడం, బాధితులకు సహాయం అందించడం, ప్రభుత్వ విధానాలను పరిశీలించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని నివేదికలు సీల్డ్ కవర్లలోనే ఉండిపోగా, మరికొన్ని అమలుకు నోచుకోవడం లేదు. ఇంకొన్ని కమిటీలు ఇప్పటికీ నివేదికల కోసం పనిచేస్తున్నాయి. కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి సిఫారసుల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
పెగాసస్ నిఘాపై విచారణ
జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయ మూర్తులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారుల ఫోన్లపై ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టారన్న ఆరోపణలపై 2021 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ఈ కమిటీని నియమించింది. పెగాసస్‌ను ఉపయోగించారా? ఎవరు కొనుగోలు చేశారు? చట్టబద్ధంగానే నిఘా పెట్టారా? అనే అంశాలను పరిశీలించడం దీని బాధ్యత. 2022 ఆగస్టులో కమిటీ సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. పరిశీలించిన 29 ఫోన్లలో ఐదింటిలో మాల్వేర్ ఉన్నట్టు గుర్తించినా, అది పెగాసస్ అని నిర్ధారించలేకపోయింది. అనంతరం ఈ కేసులో అంతగా పురోగతి లేదు. కమిటీ కార్యకలాపాలు ముగిసినా, న్యాయపరమైన విచారణ మాత్రం పెండింగ్‌లోనే ఉంది.
మణిపూర్ హింసపై కమిటీ
మణిపూర్‌లో హింసాత్మక ఘటనల బాధితులకు సహాయం, పునరావాసం, పరిహారం, సహాయ శిబిరాల నిర్వహణ, ధ్వంసమైన ఇండ్లు, ప్రార్థనా స్థలాల పునరుద్ధరణను పర్యవేక్షించేందుకు 2023 ఆగస్టులో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. బాధితులు ఆధార్ కార్డులు సహా కీలక పత్రాలు కోల్పోయిన విషయాన్ని తొలి నివేదికలో గుర్తించింది. పరిహార పథకంలో మార్పులు చేయాలని, బాధితులకు మానసిక ఆరోగ్య సేవలు, వైద్య సహాయం అందించాలని సూచించింది. బాధితులకు పరిహారం అందించే ప్రక్రియను స్థానిక అధికారులు పర్యవేక్షించాలని సిఫారసు చేసింది. ఈ ఏడాది జనవరి నాటికి 42 నివేదికలు సమర్పించిన ఈ కమిటీ గడువును జులై 31 వరకు పొడిగించారు. ఈ ఏడాది సెప్టెంబరులో సమర్పించిన 47వ నివేదికలో సహాయ శిబిరాల్లో సహజంకాని మరణాలు, వాటి నమోదు, దర్యాప్తులో లోపాలపై ఆందోళన వ్యక్తం చేసింది.






కామెంట్లు (0)