సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర సమస్యలపైనా, తెలంగాణకు ఇచ్చిన హామీలపైనా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన పర్యటనలో ఎందుకు స్పందించలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావడానికి దేశంలో 13 కోట్ల ఓట్లను, తెలంగాణలో 93 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. మైనారిటీలపైనా, దళితులపైనా దాడులను అరికట్టడంలో, మణిపూర్ హింసాకాండను నివారించడంలో కేంద్ర హోం మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఎత్తిచూపారు.
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపిన వారిని, జాతీయ జెండా ఎగురవేసిన వారిని జైళ్లకు పంపడం, నిరసన తెలపడానికి వచ్చిన మహిళలను బట్టలూడదీసి అవమానించిన ఘటనలను హోం మంత్రి సమర్థించుకోవడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికే పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.
ఈ కుట్రలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణ కోసం, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులం దరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర కరువు, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై ఎటువంటి ప్రకటన చేయకుండా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. కరువు బారిన పడిన తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.50 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల నిధుల కేటాయింపుపై గానీ, ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి’ జాతీయ హోదా ఇచ్చే అంశంపై గానీ కేంద్ర హోం మంత్రి నుంచి స్పందన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని విమర్శించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి, సంగారెడ్డి-మేడ్చల్ వరకు ట్రాఫిక్ నివారణకు మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణ, దానికి సంబంధించిన నిధుల విడుదలపై అమిత్ షా మాట్లాడకుండా, కేవలం భాగ్యలక్ష్మి దేవాలయ సందర్శన, భావోద్వేగ అంశాలు, కాంగ్రెస్ వ్యతిరేక ప్రసంగాలతో సరిపెట్టారని తెలిపారు. బీజేపీ పాలకులకు తెలంగాణ ప్రజలన్నా, రాష్ట్ర అభివృద్ధి అన్నా ఏమాత్రం ఆసక్తి, చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
దేశంలో ఏటా 2వేల మంది దళితుల మీద జరుగుతున్న అణచివేతలు, హత్యలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎత్తిచూపారు. మౌలిక అంశాలను పక్కనపెట్టి ప్రతిసారీ భావోద్వేగాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇటువంటి మోసపూరిత చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర విభజన హామీ చట్టాల అమలుపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)