Magazines

ఆర్థిక స్వావలంబన ఏదీ?

51 నిమిషాల క్రితం

self-reliance
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 4 నిమిషాల చదవడం

మోడీ పాలనలో మహిళలకు భద్రత లేని ఉపాధి

తక్కువ వేతనాలు, వెట్టిచాకిరీతోనే సరి

ఉద్యోగాల కల్పనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుతున్న గణాంకాలు

పెరుగుతున్న పని భారం..తగ్గుతున్న వేతనాలు : ఐసీఆర్‌ఐఈఆర్‌ తాజా నివేదిక


దేశంలో మహిళా ఉపాధి పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వారికి నాణ్యమైన ఉద్యోగాలు, మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత అందడం లేదు. వ్యవసాయం, స్వయం ఉపాధి, కుటుంబ వ్యాపారాల్లో వేతనం లేని పనులే మహిళలకు ప్రధాన ఉపాధిగా మారుతున్నాయి. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ బాధ్యతలూ వారిపైనే పడుతున్నాయి. మహిళా సాధికారత నినాదాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని తాజా నివేదికలు బయటపెడుతున్నాయి.


న్యూఢిల్లీ : దేశంలో మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ వారి జీవితాల్లో ఆర్థిక భద్రత, మెరుగైన ఉపాధి అవకాశాలు మాత్రం పెరగడం లేదు. 2017-18లో 10.4 కోట్లుగా ఉన్న మహిళా కార్మికుల సంఖ్య 2025 నాటికి 20.1 కోట్లకు చేరింది. అంటే దాదాపు రెట్టింపైంది. అయితే ఈ పెరుగుదలలో అధిక భాగం వ్యవసాయం, స్వయం ఉపాధి, కుటుంబ సభ్యులకు వేతనం లేకుండా సహాయపడే పనుల రూపంలోనే ఉందని భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలి (ఐసీఆర్‌ఐఈఆర్‌) తాజా నివేదిక వెల్లడించింది. ‘2017-18 నుంచి 2025 వరకు భారత్‌లో మహిళల ఉపాధి, సమయ వినియోగం’ పేరుతో విడుదలైన ఈ నివేదిక.. మహిళా ఉపాధి పెరిగిందన్న గణాంకాలకు, వారి వాస్తవ ఆర్థిక పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపింది. ఉద్యోగాల సంఖ్య పెరిగినా వాటి నాణ్యత మాత్రం తగ్గుతోందని స్పష్టం చేసింది. సాధారణ వేతన ఉద్యోగాల కంటే తక్కువ ఆదాయం వచ్చే, భద్రత లేని పనులపైనే మహిళలు ఎక్కువగా ఆధార పడుతున్నారని పేర్కొంది. పని చేసే మహిళల నిష్పత్తి 2017-18లో 22 శాతంగా ఉండగా, 2025 నాటికి 38 శాతానికి పెరిగింది. అయితే ఈ పెరుగుదల ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కనిపించింది. గ్రామీణ మహిళల్లో ఉపాధి నిష్పత్తి 23.7 శాతం నుంచి 44.9 శాతానికి చేరగా, పట్టణాల్లో 18.2 శాతం నుంచి 25.9 శాతానికి మాత్రమే పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ రంగంలోకి పెద్ద సంఖ్యలో వెళ్లడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది. 2025లో గ్రామీణ మహిళా కార్మికుల్లో 73.3 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. 2017-18లో ఈ సంఖ్య 70.7 శాతంగా ఉంది. అంటే మూడు శాతం పెరుగుదల నమోదైంది. పంటల సాగు, పశుపోషణ వంటి పనుల్లో నిమగ్నమైన మహిళల సంఖ్య 5.4 కోట్ల నుంచి 10 కోట్లకు పైగా పెరిగింది. సొంతంగా చిన్నచిన్న పనులు చేసుకునే మహిళల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 1.39 కోట్ల నుంచి 5.6 కోట్లకు పెరిగింది. కుటుంబ సభ్యుల వ్యవసాయం లేదా వ్యాపారంలో వేతనం లేకుండా పనిచేసే మహిళల సంఖ్య 2.88 కోట్ల నుంచి 4.93 కోట్లకు చేరింది. అదే సమయంలో క్రమబద్ధమైన వేతన ఉద్యోగాల్లో ఉన్న గ్రామీణ మహిళల సంఖ్య 79 లక్షల నుంచి 1.39 కోట్లకు మాత్రమే పెరిగింది. మొత్తం మహిళా ఉపాధిలో వీరి వాటా 10.5 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వయం ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 69 లక్షల నుంచి 1.38 కోట్లకు, వేతనం లేని కుటుంబ కార్మికుల సంఖ్య 33 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. కాగా సాధారణ వేతన ఉద్యోగాల్లో మహిళల వాటా 52.2 శాతం నుంచి 50.9 శాతానికి తగ్గడం గమనార్హం.

​పురుషులతో పోలిస్తే సగానికంటే తక్కువ వేతనం

మహిళల ఉపాధి పెరిగినా ఆదాయంలో మాత్రం అసమానత మరింత తీవ్రమైంది. 2025లో గ్రామీణ మహిళల సగటు నెలవారీ వేతనం రూ.6,596 కాగా, పురుషుల వేతనం రూ.14,632గా ఉంది. అంటే పురుషులు సంపాదిస్తున్న ప్రతి వంద రూపాయల్లో మహిళలకు దక్కుతున్నది రూ.45 మాత్రమే. 2017-18లో ఈ వాటా సుమారు 53 శాతంగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల మధ్య నెలవారీ వేతన వ్యత్యాసం రూ.4,200 నుంచి రూ.8 వేలకు పైగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో మహిళల సగటు నెలవారీ వేతనం రూ.15,646 కాగా, పురుషుల వేతనం రూ.25,565గా ఉంది. అంటే పట్టణాల్లోనూ మహిళలకు సమాన వేతనం అందడం లేదు. మరోవైపు గ్రామీణ మహిళలు వారానికి సగటు పని గంటలు 2017-18లో 40 ఉండగా, 2025 నాటికి 34కు తగ్గాయి. పురుషుల పని గంటలు 50 నుంచి 47కు తగ్గాయి. మహిళల ఉపాధి పెరిగిందని చెప్తున్నప్పటికీ వారికి నిరంతర ఉపాధి, తగిన పని గంటలు, మెరుగైన ఆదాయం లభించడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

​ఇంటి పనుల భారం మహిళలపైనే

మహిళలు మెరుగైన ఉద్యోగాల్లోకి వెళ్లడానికి ఇంటి పనులు, పిల్లల సంరక్షణ ప్రధాన అడ్డంకులుగా కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. 2025లో ఉపాధి లేని మహిళల్లో 60 శాతం మంది పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల కారణంగానే పనికి వెళ్లలేకపోతున్నట్టు తెలిపారు. 2021-22లో ఈ సంఖ్య 59 శాతంగా ఉంది. అదే కారణంతో ఉపాధికి దూరంగా ఉన్న పురుషులు ఒక శాతం మాత్రమే. 2019, 2024 సమయ వినియోగ (టైమ్‌ యూజ్‌) సర్వేల ప్రకారం మహిళలు రోజుకు సగటున 320 నిమిషాలు వంట, ఇంటి శుభ్రత, ఇతర గృహ పనులకు కేటాయిస్తున్నారు. పురుషులు ఇందుకు 97 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యుల సంరక్షణకు మహిళలు రోజుకు 144 నిమిషాలు కేటాయిస్తుండగా, పురుషులు 81 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నారు. మహిళలు బయట ఉపాధిలోకి వస్తున్నా ఇంటి బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం పెరగడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

​ఉన్నత పదవుల్లోనూ అసమానత

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) మరో నివేదిక కూడా మహిళల ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్న అసమానతలను బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా సీఈఓలు ఉన్న సంస్థల వాటా 2013లో 23.4 శాతం ఉండగా.. 2025 నాటికి అది 28.2 శాతానికి పెరిగింది. ఉన్నత యాజమాన్య స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం కొంత మెరుగుపడినా, జూనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో మాత్రం తగ్గింది. ముఖ్యంగా మధ్యస్థాయి ఉద్యోగాల్లో లింగ సమతుల్యత 6.4 శాతం పాయింట్లు క్షీణించింది.మహిళలు ఎక్కువగా మానవ వనరులు, ఆర్థిక, పరిపాలనా విభాగాలకే పరిమితమవుతున్నారనీ, సంస్థల కీలక నిర్ణయాలు, లాభనష్టాల నిర్వహణ, పరిశోధన, అభివృద్ధి వంటి విభాగాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. మహిళా సాధికారత కోసం సంస్థలు చేపడుతున్న చర్యలు కూడా తగ్గుతున్నాయి. లింగ సమానత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంస్థల వాటా 2018లో 37.4 శాతం ఉండగా, 2


025లో 26.5 శాతానికి పడిపోవడం ఆందోళనకరం. సమాన వేతనం కోసం చేపట్టే చర్యలు, ప్రసూతి సెలవులు, సహాయక కార్యక్రమాల అమలులోనూ క్షీణత నమోదైంది.మోడీ సర్కారు మహిళల ఉపాధి పెరిగిందనే గణాంకాలతోనే సాధికారత సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటుందనీ, అయితే వీటితోనే అలా చెప్పలేమని ఈ రెండు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలకు భద్రత కలిగిన ఉద్యోగాలు, సమాన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతోపాటు ఇంటి పనులు, పిల్లల సంరక్షణ బాధ్యతలను కుటుంబ సభ్యులు సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. ఉద్యోగాల నాణ్యతను పెంచకుండా, వేతన అసమానతలను తొలగించకుండా మహిళా సాధికారత సాధ్యం కాదన్న వాస్తవాన్ని ఈ నివేదికలు కేంద్ర ప్రభుత్వం ముందుంచుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్