ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని మోడీ
భారత్-నేపాల్ ప్రధానుల సమక్షంలో ఒప్పందాలు
న్యూఢిల్లీ : నేపాల్‌లో అభివృద్ధి పనులకు భారత్ రూ. 15 వేల కోట్ల సాయం అందించనుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలపేతమే లక్ష్యంగా భారత్‌లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోడీతో సమావేశమ య్యారు. భారత్- నేపాల్ భాగస్వామ్యంతో చేపట్టే అనేక ప్రాజెక్టులపై ఇరుదేశాల నేతలు చర్చించారు. రైలు, రోడ్డు కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులకు సంబంధించి పలు ఒప్పందాలు చేసుకున్నట్టు భేటీ తర్వాత మోడీ, బాలేంద్ర సంయుక్తంగా ప్రకటించారు.నేపాల్‌లో స్టార్టప్ ఇంక్యుబేటర్, ఐఐటీ హబ్ ఏర్పాటు చేస్తామన్న మోడీ ఝాపా ప్రాంతంలో గ్రీన్ ఆయిల్ స్టోరేజ్ టెర్మినల్ నిర్మిస్తామని తెలిపారు. మోతిహరీ పైప్‌లైన్ ప్రాజెక్టు సహా బన్బాసా ప్రాంతంలో . ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ఏర్పాటుకు నేపాల్‌తో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. మహాకాళి నదిపై మోటరబుల్ వంతెన నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నట్టు మోడీ వివరించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లిన ఇరుదేశాల ప్రధానులు అయోధ్య- జనక్‌పుర్ మధ్య రైలు ప్రారంభించారు.ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన భారీ వరదల వల్ల జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత కుటుంబాలు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భారత్ అందించే సాయం ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేలా నేపాల్ సామర్థ్యాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాలు కేవలం పొరుగు దేశాలకే పరిమితం కావని అన్నారు. ఇరు దేశాల మధ్య ఆత్మీయత, పరస్పర విశ్వాసం ఉన్నాయని, ఒకరి ప్రగతిలో మరొకరు భాగస్వాములమని చెప్పారు. సంతోషాలు, సవాళ్లు ఉమ్మడివేనని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలుస్తామని వివరించారు.
ఎనిమిది కీలక ఒప్పందాలు
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పర్యటన సందర్భంగా భారత్, నేపాల్ ఎనిమిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంతరిక్ష సాంకేతికత, భద్రతా శిక్షణ, పౌర సేవల సామర్థ్య పెంపు, ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారానికి ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేయనున్నాయి. అంతరిక్ష, సమాచార రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), నేపాల్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. దక్షిణాసియా ఉపగ్రహ సేవల వినియోగం కోసం శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లోనూ భాగస్వామ్యం
ఆరోగ్య సంరక్షణ రంగంలోనూ ఇరు దేశాలు రెండు ఒప్పందాలు చేసుకున్నాయి. వైద్యం, ఆరోగ్య రంగాల్లో సహకారానికి భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేపాల్ ఆరోగ్య, ఆహార భద్రతా మంత్రిత్వ శాఖ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల అభివృద్ధికి ప్రభుత్వాల మధ్య మరో ఒప్పందం జరిగింది. సుస్థిర పట్టణాభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహకారం, పశుసంపద, మత్స్య సంపద అభివృద్ధి అంశాలపైనా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో ఆయా రంగాల్లో పరస్పర అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు అవకాశం కలగనుంది.
అయోధ్య-జనక్‌పుర్ మధ్య కొత్త రైలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్ నుంచి నేపాల్‌లోని జనక్‌పుర్ ధామ్ వరకు నడిచే కమలా ఎక్స్‌ప్రెస్ వారపు రైలును ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సోమవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ రైలు సర్వీసుతో ఇరు దేశాల్లోని రెండు ముఖ్యమైన మతపరమైన ప్రాంతాల మధ్య ప్రయాణం సులభతరం కానుంది. అయోధ్య, జనక్‌పుర్ ప్రాంతాలకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సేవ కీలకంగా మారనుంది.
ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ: బాలేంద్ర షా
భారత్‌తో చర్చలు విజయవంతంగా ముగిశాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా విస్తరించుకోవడమే లక్ష్యమని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలతో పాటు వివిధ రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయని వివరించారు.






కామెంట్‌లు (0)