ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు హస్తం పార్టీకి లేదు
రాహుల్ గాంధీకి ఏటీఎంలా సీఎం రేవంత్ రెడ్డి పాలన : బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్
కరీంనగర్ మహాపాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్
నవతెలంగాణ-కరీంనగర్
కుర్చీ కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ నేతలకు నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో నిర్వహించిన మహాపాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారని, కానీ ప్రజల మద్దతు, అసలైన ఓట్లు బీజేపీకే దక్కాయని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇండియా కూటమి నేతలు నానా యాగి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 36 నెలల పాలన పూర్తికాకముందే 82 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారని, తెలంగాణ ప్రజల శ్రమను దోచి రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ ఖాతాలకు ఏటీఎంలా పనిచేస్తున్నారని ఆరోపించారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ మొదలైందని, 2028-29 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో కాషాయ దళ ప్రభంజనాన్ని చూడాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ 25 ఏండ్లకే ఎమ్మెల్యేగా గెలిచారని, 45 ఏండ్లకే పార్టీకి అధ్యక్షులయ్యారని కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ చనిపోయి ఏండ్లు గడుస్తున్నా వారి ఓట్లు తొలగించలేదని ఆరోపించారు. విదేశీ అక్రమ వలసదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొంది స్థానిక ప్రజల పొట్ట కొడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అభయ్ పాటిల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ కరీంనగర్ ఇన్చార్జి భండారి శాంతి కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు ఎస్.కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, కప్పర హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)