అమెరికా, ఇజ్రాయిల్ విమర్శలకు జస్టిస్ మురళీధర్ దీటైన సమాధానం
కాల్పుల విరమణ తర్వాతా
కొనసాగిన పాలస్తీనీయుల హత్యలు
ఐరాస నివేదికలో యుద్ధ నేరాలు,
మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ప్రస్తావన
న్యూఢిల్లీ : గాజాలో ఇజ్రాయిల్ పాలస్తీనీయులపై మారణహోమానికి పాల్పడు తోందన్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి (ఐరాస) తాజా నివేదిక మరోసారి బలపరిచింది. గతేడాది అక్టోబర్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా హత్యలు, దాడులు కొనసాగాయని నివేదిక వెల్లడించింది. దీనిపై అమెరికా, ఇజ్రాయిల్ ప్రతినిధులు తీవ్ర విమర్శలు చేయగా.. నివేదికను రూపొందించిన ఐరాస విచారణ సంఘం అధ్యక్షుడు, భారత మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ దీటుగా స్పందించారు. ఆధారాలను పరిశీలించి, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలకు అనుగుణంగానే నివేదిక రూపొందించామని స్పష్టం చేశారు. నివేదికను ‘చారిత్రక కల్పన’గా ఇజ్రాయిల్ ప్రతినిధి కొట్టిపారేశారు. నివేదికలోని అంశాలకు ఆధారాలు లేవని అమెరికా ఆరోపించడంతోపాటు, ఐరాసపై యూదు వ్యతిరేకత ఆరోపణలు చేసింది. దీనిపై మురళీధర్ స్పందిస్తూ.. ఇజ్రాయిల్‌ను ప్రపంచ దేశాల మధ్య యూదు దేశంగా పేర్కొంటూ అమెరికా ప్రతినిధి చేసిన వ్యాఖ్య ఆలోచనారహితమైనదనీ, అభ్యంతర కరమైనదనీ, జాతి వివక్షతో కూడుకున్నదై ఉండొచ్చని అన్నారు. విచారణ సంఘం పనిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే), అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ప్రమాణాలకు అనుగుణంగా ఆధారాలను సేకరించి, విశ్లేషించిన తర్వాతే నిర్ధారణలకు వచ్చామని చెప్పారు. అవసరమైతే న్యాయ విచారణ సంస్థలకు ఆధారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడులను తమ సంఘం విస్మరించలేదని స్పష్టం చేశారు. ఆ దాడులపై సమగ్ర నివేదికను తొలినాళ్లలోనే విడుదల చేశామనీ, పాలస్తీనా సాయుధ బృందాల చర్యలపైనా ప్రత్యేక నివేదిక సమర్పించామని గుర్తుచేశారు. విచారణ సంఘం సభ్యురాలు, 2026 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నవీ పిళ్లైపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కూడా ఆయన ఖండించారు.
పసిపిల్లలపైనా కాల్పులు
వెస్ట్‌బ్యాంక్‌లో జరిగిన ఏడు హత్యలు, శారీరక, మానసిక హింస ఘటనలను సంఘం పరిశీలించి.. ఆరింటిని నమోదు చేసింది. బాధితులు నిరాయుధులనీ, సైనికులకు ఎలాంటి ముప్పు కలిగించలేదని నివేదిక పేర్కొంది. వారిలో చిన్నారులు, పసిపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 5న హెబ్రోన్‌లో ఏడు నెలల శిశువు ప్రయాణిస్తున్న కారును ఆపినప్పటికీ, ఇజ్రాయిల్ సైనికుడు కాల్పులు జరపడంతో ఆ చిన్నారి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లి మరణించినట్టు నివేదిక వివరించింది. మరో ఘటనలో తమూన్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై కాల్పులు జరగడంతో తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు మరణించగా, మరో ఇద్దరు కుమారులు గాయపడ్డారు.
వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ వైమానిక దాడులు, స్థిరనివాసుల హింస పెరిగాయని నివేదిక తెలిపింది. 2023 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ వరకు వైమానిక దాడుల్లో 254 మంది పాలస్తీనీయులు మరణించినట్టు పేర్కొంది. 2026 ఆగస్టు నాటికి 34,176 మంది నిరాశ్రయులయ్యారు. పాలస్తీనీయులను వారి భూముల నుంచి తరిమివేయడం, ఇజ్రాయిల్ స్థిరనివాసాలను విస్తరించడం, భూభాగాలను స్వాధీనం చేసుకోవడం వంటి లక్ష్యాలతో ఈ దాడులు జరుగుతున్నాయని సంఘం అభిప్రాయపడింది. నిర్బంధంలో ఉన్న పాలస్తీనీయులపై లైంగికదాడి, లైంగిక హింస, చిత్రహింసలు జరిగినట్టు కూడా ఆధారాలు నమోదు చేసింది. కాగా అమెరికా వీసా లభించకపోవడంతో మురళీధర్ ఐరాస సమావేశంలో వీడియో ద్వారా ప్రసంగించారు. బాధితులు, సాక్షులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కోల్పోవడం విచారకరమని అన్నారు. కాల్పుల విరమణతో ప్రజలకు ఉపశమనం లభించిందన్న గత నివేదికకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో హింస కొనసాగుతోందని తాజా నివేదిక స్పష్టం చేసింది.
72,600 మంది మృతి
2023 అక్టోబర్ 7 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు గాజాలో 72,600 మందికిపైగా, వెస్ట్‌బ్యాంక్‌లో వెయ్యి మందికిపైగా పాలస్తీనీయులు మరణించినట్టు నివేదిక వివరించింది. గతేడాది అక్టోబర్ 10 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు కాల్పుల విరమణ అమల్లో ఉన్నట్టు ప్రకటించినప్పటికీ, గాజాలో మరో 1,431 మంది, వెస్ట్‌బ్యాంక్‌లో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరాయుధులైన పాలస్తీనీయుల హత్యలు కొనసాగుతున్నాయని మురళీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ చర్యలకు శిక్ష పడని పరిస్థితి కొనసాగుతోందనీ, అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)