ప్రశ్నోత్తరాల సమయానికి ముప్పు : సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని సీపీఐ(ఎం) రాజ్యసభాపక్ష నేత జాన్ బ్రిట్టాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టేందుకు ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకు ఉన్న ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, పార్లమెంట్‌ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయలేదని గుర్తుచేశారు. శీతాకాల సమావేశాల ప్రారంభ తేదీపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు సమర్పించేందుకు కనీసం 15 రోజుల ముందస్తు నోటీసు అవసరమని ఆయన వివరించారు. కొత్త సమావేశాలకు కూడా 15 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, సమావేశాల తేదీలు ప్రకటించిన వెంటనే సభ్యులు ప్రశ్నలు సమర్పించే ప్రక్రియ ప్రారంభిస్తారని అన్నారు. అయితే, వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకపోవడంతో వాటి రెండో విడతగా పార్లమెంట్‌ను తిరిగి సమావేశపరిచే అవకాశం ఉందని, తద్వారా 15 రోజుల నోటీసు నిబంధనను పక్కనపెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దాగుడుమూతలు ఎందుకు ?
శీతాకాల సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందని జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. పార్లమెంట్ అంటే అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ భాగస్వాములని పేర్కొన్నారు. సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలను కూడా అయోమయంలో ఉంచడం శత్రుదేశంతో యుద్ధం చేస్తున్నట్లుగా వ్యవహరించడమేనని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కనీస అవసరమని, ప్రస్తుత ప్రభుత్వమైనా దీనిని పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ బిల్లుకు మెజార్టీ కోసం మోడీ, అమిత్‌షా అన్వేషణ : జైరాం రమేష్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 100 రోజులు గడిచినా, లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ మెజార్టీని ‘సూపర్ కలుషిత మెజార్టీ’గా అభివర్ణించింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య, రాష్ట్రాలవారీగా ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని ఆయన సూచించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ, వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకు ప్రస్తుత వ్యవస్థను కొనసాగించాలని పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని జైరాం రమేష్ పేర్కొన్నారు.
వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, విస్తృతమైన డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయవచ్చని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్‌తో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా లేదా పొడిగించిన సమావేశాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ బిల్లు లోక్‌సభలో 15 నుంచి 18 ఓట్ల ఆధిక్యంతో ఆమోదం పొందుతుందని గతంలో ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సమావేశాల తేదీలు, వ్యవధిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభ బలాన్ని డీలిమిటేషన్‌తో గరిష్ఠంగా 850 స్థానాలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. తద్వారా 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందే లోక్‌సభతోపాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1971 జనగణన ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న స్థానాల నిష్పత్తిని కొనసాగించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మరోపక్కడీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వంద రోజులైనా ముగియని పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 100 రోజులు గడిచినా నేటికీ అధికారికంగా ముగియకపోవడం సరికొత్త రికార్డుగా నిలిచింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుందా లేదా అనే ఉత్కంఠా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు లోక్‌సభ, రాజ్యసభలను ప్రొరోగ్ చేయలేదు. ఆగస్టు 13న ఉభయ సభలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే ఆ సమావేశాలను అధికారికంగా ముగించే ప్రొరోగేషన్ ప్రక్రియ మాత్రం చేపట్టలేదు.






కామెంట్లు (0)