Magazines

పెరగని ఎమ్మెస్పీ

29 నిమిషాల క్రితం

MSP
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రయివేటుకు తరలుతున్న ధాన్యం

భవిష్యత్‌‌లో బియ్యం ధరలు మరింత పెరిగే ప్రమాదం

డిమాండ్‌‌కు తగినట్టు మద్దతు
 ధర పెంచని ప్రభుత్వం

సర్కారు ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 65 లక్షల టన్నులు

మార్కెట్లకు వచ్చింది 
6 లక్షల టన్నులే


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే సర్కారు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే బహిరంగమార్కెట్లో వ్యాపారులు అధిక ధర చెల్లించి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులకు లాభంగా ఉండటంతో వారు కూడా ప్రయివేటులో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఎల్‌‌నినోతో వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి వంటి కారణాలతో గతంకంటే ఈసారి వరి ధాన్యం దిగుబడి తగ్గింది. ఫలితంగా డిమాండ్‌ ‌పెరిగింది. ప్రయివేటు వ్యాపారులు అధిక ధరలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుండటం, భవిష్యత్‌‌లో బియ్యం ధరలు మరింత పెరిగేందుకు దోహదపడతాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు కిలో రూ.85 నుంచి రూ.100 వరకు పెరిగాయి. గతంలో బాస్మతి బియ్యానికే ఇంతటి ధరలు ఉండేవి. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ఇప్పుడే పసిగట్టాలి. ప్రస్తుత మార్కెట్‌ ‌డిమాండ్‌‌ను దృష్టిలో ఉంచుకొని బహిరంగమార్కెట్‌ ‌కంటే ఓ రూపాయి ఎక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది భవిష్యత్‌ ‌బియ్యం ధరల పెరుగుదలను అరికట్టడానికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ​వానాకాలానికి సంబంధించి వడ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి.

అందుకోసం 5,800 కొనుగోళ్లు కేంద్రాలను సివిల్‌‌ సప్లయ్‌ ‌శాఖ సిద్ధం చేసింది. కల్లాల్లోకి వడ్లు వస్తున్న కొద్దీ మరో 2,500 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 8,300 కేంద్రాల ద్వారా ఈ సీజన్‌‌లో 65 లక్షల టన్నుల వడ్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు మార్కెట్లలోకి వచ్చిన ధాన్యం దాదాపు 6 లక్షల టన్నులు (0.9శాతం)మాత్రమే. వ్యవసాయ మార్కెట్లలోకి ధాన్యం రాకపోవటమే ఇందుకు కారణం. బహిరంగ మార్కెట్లలో వడ్లు క్వింటాల్‌కు ‌ధర రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు పలకటమే దీనికి ప్రధాన కారణం. దీని వల్ల రైతులు బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. రైస్‌ ‌మిల్లర్లు, కొంత మంది దళారులు రైతుల వద్దకు నేరుగా వెళ్లి అక్కడే కాంటా వేసి గోదాముల్లోకి తరలిస్తున్నారు.ఈ పరిస్థితుల కారణంగా రైతులు ఐకేపీ కేంద్రాలకు వడ్లు తేవడం లేదు.

​ప్రయివేటు గోదాముల్లో నిల్వలు

ఎల్‌‌నినో ప్రభావం వల్ల రానున్న కాలంలో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది. నీటి వనరులు తగ్గిపోవడంతో వరి పంట పండించడం రైతులకు కష్టంగా మారుతోంది. దీనితో ఇప్పుడు పండిన పంటను భారీ ఎత్తున కొని నిల్వ చేసుకునేందుకు దళారులు వేల టన్నులు కొనుగోలు చేస్తున్నారు. కరువు పరిస్థితుల్లో వడ్లను బియ్యంగా మార్చి అధిక ధరలకు మార్కెట్‌‌ల్లో అమ్ముకునేందుకు ప్లాన్‌ ‌చేస్తున్నారు. తద్వారా వందల కోట్లు ఆర్జించే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్‌ ఏ రకం క్వింటా వడ్లకు మద్దతు ధర రూ. 2,461, కామన్‌ ‌వెరైటీ రకానికి రూ. 2,441 ధరను నిర్ణయించింది. వడ్లకు మద్దతు ధరతోపాటు ఏడు వెరైటీలకు క్వింటాకు రూ. 500 బోనస్‌ ఇస్తున్నది. ఈ మొత్తం కలిపినా క్వింటాకు రూ.3 వేలకు మించి రావటం లేదు. అదే బహిరంగ మార్కెట్‌‌లో అయితే అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వస్తున్నాయి. అందువల్ల రైతులు బహిరంగ మార్కెట్‌‌కు తరలిస్తున్నారు.

​ఐకేపీ కేంద్రాలకు ధాన్యం 40 శాతమే

రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సేకరణ లక్ష్యం 65 లక్షల టన్నులు. ఈసారి 40 శాతం మాత్రమే ఐకేపీ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరువు పరిస్థితుల్లో రైతులు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడం వల్ల ఐకేపీ కేంద్రాలకు సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతుంది. ఆదిలాబాద్‌ ‌జిల్లా నుంచి తక్కువ స్థాయిలో సేకరణ ఉంటుంది. ఎక్కువ ఉత్పత్తి అయ్యే జిల్లాల నుంచి సేకరణ తగ్గుతోంది.

​నిల్వలకు తిప్పలు

ఐకేపీ కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాములు లేవు. ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి తిప్పలుతప్పడం లేదు. ఇప్పటికే రైస్‌ ‌మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయి. వాటిని తొలగించకుండా కొత్త ధాన్యం నిల్వ చేసుకోలేమంటూ రైస్‌‌ మిల్లర్లు చెబుతున్నారు. దీంతో సివిల్‌ ‌సప్లయ్‌ ‌శాఖకు, రైస్‌ ‌మిల్లర్లకు మధ్య విభేదాలు తలెత్తాయి. క్వింటా వడ్లు ఆడించిన తర్వాత 67 కిలోలు ఇవ్వాలని ఎఫ్‌‌సీఐ నిబంధన పెట్టింది. రైస్‌ మిల్లర్లు మాత్రం 58 కిలోలకు మించి రావని చెబుతున్నారు. దీనితో సివిల్‌‌సప్లయ్‌ ‌శాఖ, రైస్‌ ‌మిల్లర్లకు మధ్య చర్చోపర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంట కోతకు రావడంతో రైతులకు అత్యధిక ధర చెల్లించి దళారులు కొనుగోలు చేస్తున్నారు.

​రైతుల్లో ధీమా
బహిరంగ మార్కెట్‌‌ల్లో వడ్లకు ఎక్కువ ధర పలకడంతో పెట్టిన పెట్టుబడిపై రైతులు ధీమాతో ఉన్నారు. రైతులు కూడా ప్రయివేటులో అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత వానాకాలం సీజన్‌‌లో 8448 కొనుగోలు కేంద్రాల ద్వారా 71.86 లక్షల టన్నుల భారీ సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ‌కూడా చెల్లించింది. కానీ యాసంగి వచ్చే సరికి కరువు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారనున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్