Magazines

ఓటర్ల తొలగింపుల వెనుక అసలు లెక్కలేవి?

1 గంట క్రితం

voters
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 3 నిమిషాల చదవడం

రాష్ట్రాల వారీగా పూర్తి లెక్కలు లేవంటున్న అధికారులు

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగింపు

ఆరు రాష్ట్రాల్లో 9.86 కోట్ల ఓటర్లకు 1,600 మంది విదేశీయులుగా గుర్తింపు

విదేశీయుల వివరాల సేకరణపై ఈసీ వద్దే స్పష్టత కరువు

అక్రమ వలసదారులను గుర్తించడమే సర్‌ లక్ష్యమన్న బీజేపీ, ఈసీ


న్యూఢిల్లీ : అక్రమ వలసదారులను గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యమంటూ బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ) ప్రచారం చేసిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియపై కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోట్లాది పేర్ల తొలగింపుల మధ్య విదేశీయులుగా గుర్తించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రక్రియ ఉద్దేశం, అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఓటర్ల జాబితాల్లో అక్రమ విదేశీ వలసదారులు ఉన్నారంటూ పెద్దఎత్తున ప్రచారం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి తాజా నివేదిక ఇబ్బందికరమైన ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఆరు రాష్ట్రాల్లో మొత్తం 9.86 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ.. వారిలో విదేశీయులుగా గుర్తించినవారు కేవలం 1,600 మందే కావడం గమనార్హం. ఈ విషయాన్ని ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ కథనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో ఇప్పటివరకు సుమారు 13 కోట్ల పేర్లు తొలగించినట్టు ‘ది వైర్‌’ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంత భారీ సంఖ్యలో పేర్లు తొలగించడానికి అక్రమ వలసదారుల గుర్తింపు ఎంతవరకు కారణమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘గుర్తించు.. తొలగించు.. దేశం నుంచి పంపించు’ అనే విధానంలో భాగంగానే సర్‌ చేపట్టినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఏడాది క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా బీహార్‌లో సర్‌ ద్వారా తొలగించినవారు చొరబాటుదారులేనని వ్యాఖ్యానించారు. భారతీయులైతే తమ పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు సమర్పించేవారనీ, తొలగించిన పేర్లపై కేవలం మూడు అప్పీళ్లే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే, అప్పీళ్లు తక్కువగా రావడమే తొలగించినవారు భారతీయులు కాదనేందుకు ఆధారం కాదన్న ప్రశ్న ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశీయుల వివరాలేవీ? సర్‌ పూర్తయిన లేదా ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదలైన 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల ఎన్నికల అధికారులను ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ సంప్రదించింది. వీరిలో 11 రాష్ట్రాల అధికారులు స్పందించగా.. ఆరు రాష్ట్రాలు మాత్రమే అనుమానిత విదేశీయుల సంఖ్యను వెల్లడించాయి. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం ఈ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయలేదని తెలిపాయి.

ఒడిశాలో అనుమానిత విదేశీయులను గుర్తించినప్పటికీ, వారి సంఖ్యను నమోదు చేయలేదని అక్కడి అధికారి చెప్పినట్టు నివేదిక పేర్కొంది. రాష్ట్రాల నుంచి విదేశీయుల వివరాలను ప్రత్యేకంగా సేకరించాలని ఎన్నికల సంఘం కోరలేదని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించడం గమనార్హం. ఇలాంటి కేసులు ఎదురైతే వాటిని ‘ఇతరులు’ అనే విభాగంలో నమోదు చేశారనీ, రాష్ట్రాల వారీగా లేదా దేశవ్యాప్తంగా సమగ్ర గణాంకాలు తమ వద్ద లేవని ఆయన వివరించారు. కర్నాటకలో 716 మంది విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు గుర్తించినట్టు అక్కడి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. వీరిలో బెంగళూరు ఉత్తర ప్రాంతంలోనే 545 మంది నేపాల్‌ పౌరులు ఉన్నారు. అయితే, సర్‌కు ముందు కర్నాటకలో 5.54 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తాజా జాబితాలో దాదాపు 99.77 లక్షల పేర్లు తగ్గాయి.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి. అన్బుకుమార్‌ కూడా గుర్తించిన విదేశీయుల సంఖ్య వెయ్యిలోపేనని తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రధాన ఎన్నికల అధికారి బి.వి.ఆర్‌.సి. పురుషోత్తం మాత్రం విదేశీయుల వివరాలను సేకరించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఈ పని ఎన్నికల అధికారుల పరిధికి మించినదని వ్యాఖ్యానించారు. సర్‌ ప్రక్రియపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, యువత ఈ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కోట్లాది పేర్లు తొలగించిన ప్రక్రియలో విదేశీయుల గుర్తింపుపై సరైన గణాంకాలే లేకపోవడం, వివరాల సేకరణకు స్పష్టమైన విధానం కనిపించకపోవడం ఎన్నికల జాబితాల పారదర్శకతపై కీలక సందేహాలను రేకెత్తిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్