Magazines

ప్రజల కోసమే కొత్త రాజకీయ శక్తిగా వచ్చాం

1 గంట క్రితం

We have emerged as a new political force for the sake of the people.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం


పంటలు వేయొద్దన్న సీఎం అధికారంలో ఉండొద్దు
బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఏం చేశారు..?

ఎకరం నీళ్లు ఇవ్వకుండా ఏ ముఖం 
పెట్టుకొని రైతు గర్జన సభ పెడతారు
ఆదిలాబాద్ పాంచజన్య సంకల్ప సభలో
 తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ-ఇంద్రవెల్లి

​ప్రజల మేలు కోసమే కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్‌ ‌జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం పాంచజన్య సంకల్ప సభ నిర్వహించారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఈ ప్రాంత మహానీయులు, కుమురంభీం, కుమురం సూరు, రాంజీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడ్మ రాములను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆనాడు తమ పంటను దోచుకుంటున్న వాళ్ల నుంచి కాపాడుకునేందుకు ఆదివాసులు సమావేశం పెట్టుకోవాలని చూస్తే వారిని పొట్టన బెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. అయినా ఆ పార్టీ వాళ్లు ఇక్కడకు వచ్చి క్షమాపణ అడిగితే నాలుగు సీట్లు ఇచ్చిన గొప్ప మనసు ఆదివాసులదని చెప్పారు. ఇంద్రవెల్లి వీరులకు రూ. 25 లక్షలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని, కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. నాగోబా తల్లి దయతో తమ పార్టీ తొలి జెండా ఇక్కడ నుంచే ఎగురుతుందని గట్టిగా నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. 750 ఊళ్లకు కనీసం స్కూల్ లేదంటే ఎంత బాధాకరం.. రంగారెడ్డిలో తలసరి ఆదాయం రూ.11 లక్షలు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్‌‌లో రూ.2లక్షలు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలకు ఒక్కసారి జిల్లాకు వస్తానన్న ముఖ్యమంత్రి మూడేండ్లలో రెండుసార్లు మాత్రమే వచ్చారని అన్నారు.

ప్రజలకు మేలు చేసేందుకు తాము కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు. కేపీ రావు, జగన్నాథ ప్రాజెక్టులు ఏండ్లకు ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్నాయన్నారు. 12 ఏండ్లుగా తుమ్మిడి హెట్టి పేరు చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మురిపిస్తున్నాయే తప్ప ఆ ప్రాజెక్ట్ కట్టలేదని విమర్శించారు. తుమ్మిడి హెట్టిని పూర్తి చేసి ఉంటే ఈ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. చరిత్రలో రైతులను పంటవేయొద్దని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. రైతులను పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి మరి పదవిని వదిలేస్తారా.. అని సవాల్‌ ‌విసిరారు. వారి మోసాలను, కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకే ఇక్కడకు వచ్చామని, పాంచజన్యం పేరుతో ఐదు కీలకమైన అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. ప్రయివేట్‌‌లో మెరుగైన ఉచిత విద్య, వైద్యం ఇస్తామని భరోసా ఇస్తున్నానని, యువతకు రుణాలు ఇచ్చి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రిమ్స్‌‌లో పిల్లలు చనిపోతే వచ్చేందుకు ఈ ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు, కరెంట్, యూరియ ఇవ్వటం లేదని చెప్పారు. వారికి మేలు చేస్తూ గౌరవం పొందేలా తమ పార్టీ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఈనెల 1న ఆదిలాబాద్‌‌లో రైతు గర్జన పేరిట సభ పెడుతున్నారని, ఏం ముఖం పెట్టుకొని సభ పెడుతున్నారని ప్రశ్నించారు. ముందు కేసీఆర్‌‌ను ఆదిలాబాద్ సభకు తీసుకొచ్చి ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపూరావు, మాజీ మంత్రి బోడ జనార్ధన్, నాయకులు సబిత, చంద్రమోహన్, వినోద్ చారి, డా.చంద్రశేఖర్, వేణుగోపాల్, గీత, మెస్రం దయాకర్, రూప్ సింగ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్