Magazines

కరువు మండలంగా 
ప్రకటించకపోవడం అన్యాయం

1 గంట క్రితం

It is unfair not to declare it a drought-affected mandal.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

​మండల సభను బహిష్కరించిన సర్పంచ్‌‌లు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన

నిర్లక్ష్యంతో తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులు: సత్యనారాయణ

​నవతెలంగాణ-మద్దూరు

​సిద్దిపేట జిల్లా మద్దూరు మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించకపోవడంతో పలువురు సర్పంచ్‌‌లు అధికారుల తీరుపై మండల సభలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల సభను శుక్రవారం బహిష్కరించారు. మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో స్పెషలాఫీసర్ ప్రకాష్ అధ్యక్షతన మండల సభను నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ముందు మద్దూరు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్దూరు మండలంలో వర్షాభావం తక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు వేసిన పంటలు సగానికి పైగా ఎండిపోయినా అధికారుల నిర్లక్ష్యంతో ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం మద్దూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదన్నారు. మద్దూరు మండలం కరువు మండలం కాకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాలపై అంచనా వేసి భూగర్భ జలాల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే మద్దూరు మండలాన్ని కరువు మండలంగాప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇదే తరహాలో ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తామని సర్పంచ్‌‌లు హెచ్చరించారు. మండల పరిషత్ ముందు ఆందోళన చేస్తున్న సర్పంచ్‌‌లను స్పెషల్ ఆఫీసర్ ప్రకాష్, ఎంపీడీవో శ్రీనివాస్.. వచ్చి ఆందోళన విరమించి మండల సభలో పాల్గొనాలని కోరారు. దీనికి సర్పంచ్‌‌లు ససేమిరా అని అక్కడే భీష్మించి కూర్చున్నారు. ఆందోళన చేస్తున్న సర్పంచ్‌‌లను మద్దూరు ఎస్సై ఎండి ఆసిఫ్, ఏఎస్ఐ తిరుమల్ బాబు కలిసి సర్పంచ్‌‌లకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌‌లు దామెర మల్లేశం, ఇట్టబోయిన కనక చంద్రం, కాసర్ల రేణుక కనకరాజు, గడిపే మౌనిక అనిల్ కుమార్ , జక్కుల కనకమ్మ లింగయ్య, కర్నే సునీత మనోహర్, నీరటి శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు మోకు ఉదయ్ కుమార్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు జక్కుల రమేష్ తదితరులు ఉన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్