Magazines

మనసు దోచే దోశ...

2 గంటల క్రితం

dosa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 3 నిమిషాల చదవడం

కరకరలాడే దోశలంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండీ! ఉదయం టిఫిన్‌లోకి దోశలు అనగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరిపోతాయి. కొంచెం కొంచెం తుంచుకుని.. చట్నీ అద్దుకుని తింటుంటే.. అసలింకేమైనా గుర్తొస్తుందా చెప్పండి! గతంలో దోశలంటే మినప్పప్పు, బియ్యంతోనే వేసేవారు. ఆ తర్వాత రవ్వ, రాగులతో వేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడైతే ఓట్స్, అటుకులు, జొన్నలు, పాలకూర, మొలకలు... ఇలా దేంతోనైనా దోశలు వేసేయొచ్చు. ఇవి నోటికి మంచి రుచిని ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అందుకే మీ మనసుదోచే కొన్ని రకాల దోశలు ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం...


ఓట్స్‌‌ దోశ

కావలసిన పదార్థాలు: ఓట్స్ - కప్పు, బియ్యంపిండి - పావు కప్పు, రవ్వ - పావు కప్పు, పెరుగు - పావు కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగినది), అల్లం - చిన్న ముక్క (సన్నగా తరిగినది), జీలకర్ర - అర స్పూను, మిరియాల పొడి - పావు స్పూను, కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత.

తయారీ విధానం: ముందుగా ఓట్స్‌‌ను మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, బియ్యంపిండి, రవ్వ చేర్చి బాగా కలపాలి. అందులో పెరుగు, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. తగినన్ని నీళ్లు చేర్చి దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 15-20 నిమిషాలపాటు నానుకోవాలి. తర్వాత పెనం వేడి చేసి దోశలా వేసుకోవాలి.

పాలక్‌‌ దోశ

కావలసిన పదార్థాలు: దోశ పిండి - రెండు కప్పులు, పాలకూర - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్న ముక్క, జీలకర్ర - అర స్పూను, ఉప్పు - తగినంత, నూనె - దోశలు కాల్చడానికి.

తయారీ విధానం: ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు మరిగించి పాలకూరను అందులో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసివేయాలి. చల్లారిన తర్వాత పాలకూరను పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకుని, అందులో పాలకూర ముద్ద, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. పెనం వేడి చేసి దోశలా వేసుకుని నూనె రాసి కాల్చుకోవాలి.

మల్టీ గ్రెయిన్ దోశ

కావలసిన పదార్థాలు: రాగులు - పావు కప్పు, జొన్నలు - పావు కప్పు, సజ్జలు - పావు కప్పు, గోధుమలు - పావు కప్పు, బియ్యం - పావు కప్పు, మినప్పప్పు - పావు కప్పు, మెంతులు - అర స్పూను, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - అర స్పూను, ఉప్పు - తగినంత, నూనె - దోశలు కాల్చడానికి, నీళ్లు - అవసరమైనంత.

తయారీ విధానం: ముందుగా రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, బియ్యం, మినప్పప్పు, మెంతులను శుభ్రంగా కడిగి 5-6 గంటల పాటు నానబెట్టాలి. నానిన పదార్థాల్లో నీళ్లు వంపేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండికి తగినంత ఉప్పు కలిపి 6-8 గంటల పాటు రాత్రంతా పులియనివ్వాలి. పులిసిన తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలిపి దోశలుగా వేసుకోవాలి.

మొలకల దోశ

కావలసిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు - కప్పు, దోశపిండి - కప్పున్నర, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - చెంచా, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - నాలుగు చెంచాలు

తయారీ విధానం: మిక్సీజార్‌లో మొలకెత్తిన గింజలు, కొన్ని నీళ్లు, ఉప్పు, అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో కలిపి దోశలు వేసుకోవాలి. వీటికి కొబ్బరి పచ్చడి సూపర్‌ కాంబినేషన్‌. ఇవి రుచే కాదు, బలం కూడా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్