Magazines

భిన్న కళల్లో రాణిస్తున్న సమీక్ష

2 గంటల క్రితం

arts
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 3 నిమిషాల చదవడం

సమీక్ష... చదువుతోపాటు కళలు, క్రీడల్లోనూ ప్రతిభ చాటుకుంటూ చిన్న వయసులోనే పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలను అందుకుంటోంది మంచిర్యాల జిల్లాకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని. నాట్యం, కరాటే, యోగా, కర్రసాము వంటి విభిన్న కళల్లో ఆసక్తితో శిక్షణ పొందుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. మూడేండ్ల ప్రాయంలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి తన ప్రతిభకు తొలి మెట్టు వేసుకుంది. నేటికీ విజయ పరంపరను కొనసా గిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో...


2017లో కేవలం మూడేండ్ల వయసులోనే రాష్ట్రస్థాయి పోటీలో ప్రథమ బహుమతి సాధించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీలు, ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని విజయాలు అందుకుంది. ఢిల్లీ, హర్యానాతోపాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. ఇప్పటివరకు సుమారు 260 ప్రదర్శనలు, పోటీల్లో పాల్గొనడంతోపాటు పలు ఆడిషన్లలోనూ తన ప్రతిభను ప్రదర్శించింది.

వివిధ కార్యక్రమాల్లో...

కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్రన్‌, జానపద నృత్యరీతుల్లో సమీక్ష ప్రత్యేక నైపుణ్యం కనబరుస్తోంది. 2022 నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక బహుమతులు సాధించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో నృత్యం, కోలాటం ప్రదర్శించి ప్రథమ బహుమతి అందుకుంది. ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం, బాలల దినోత్సవ వేడుకల్లోనూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. బాలకళా ఉత్సవ్‌-2022లో వెస్ట్రన్‌ డ్యాన్స్‌, కూచిపూడి విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించింది. బిగ్గెస్ట్‌ ఫ్యాషన్‌ షోలో బెస్ట్‌ పార్టిసిపెంట్‌ అవార్డును అందుకుంది. అదే ఏడాది హర్యానాలో నిర్వహించిన నేచురల్‌ దీవాలి రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని గుర్తింపు పొందింది.

ఆమె ప్రతిభకు గుర్తింపు...

2023లో తెలంగాణ రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీల్లో జానపద నృత్య విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. నాటరాజ అవార్డు ప్రదానోత్సవంలో ప్రతిభ చాటుకుంది. ‘నాచ్లే దీవానే’ టీవీ రియాలిటీ షోలో పాల్గొని కొరియోగ్రఫీ రౌండ్‌కు ఎంపికైంది. 2024లో నృత్య కళోత్సవ సంబరాలు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కళార్చన కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. తిరుపతిలోని శిల్పారామంలో జరిగిన సప్తగిరి కళారాధనలోనూ తన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమీక్ష ప్రతిభకు గుర్తింపుగా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం నాట్యనంది అవార్డు, జవహర్‌లాల్‌ నెహ్రూ నాట్య మయూరి పురస్కారం, నందీశ్వర నాట్య అవార్డు, ఇండియన్‌ ఆనరబుల్‌ అవార్డు, అన్నమాచార్య ఆర్ట్స్‌ అకాడమీ అవార్డు, విశ్వ సంస్కృతి నంది పురస్కారాలను అందుకుంది. అమెరికన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ గుర్తింపు పొందింది. తెలంగాణ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ ద్వారా నేషనల్‌ నంది పురస్కారంతోపాటు, కీర్తి ఆర్ట్స్‌ అకాడమీ నంది నటరాజ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అలాగే బాంబే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనూ అవార్డు అందుకుంది. 2025లో యువతేజం జాతీయ యువ ప్రతిభా పురస్కారం, నారీ రత్న, ఉమెన్‌ ఎక్సలెన్స్‌ అవార్డు, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఉత్తమ అవార్డులను అందుకుని తన ప్రతిభను చాటుకుంది.

ఆత్మరక్షణ కోసం...

నాట్యంతోపాటు ఆత్మరక్షణ విద్య అయిన కరాటేపైనా సమీక్ష ప్రత్యేక ఆసక్తి చూపుతోంది. కరాటే సాధన ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించుకుంటోంది. ప్రతి అమ్మాయి తనను తాను రక్షించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలనే ఆలోచనతో ఈ విద్యను అభ్యసిస్తోంది. కరాటేలో జిల్లా, మండల, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందింది. యోగాలోనూ తన ప్రతిభను చాటుతూ రాష్ట్రస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ నాట్యం, కరాటేకు అవసరమైన ఏకాగ్రత, శరీర సమతుల్యతను మెరుగుపరుచుకుంటోంది. భారతీయ యుద్ధకళ అయిన కర్రసాముపైనా ఆసక్తితో సాధన చేస్తోంది. ఆధునిక కళలతోపాటు సంప్రదాయ కళలపైనా మక్కువ చూపుతూ వాటిలో నైపుణ్యం సంపాదించేందుకు కృషి చేస్తోంది. స్పోర్ట్స్‌, యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగాల్లోనూ జిల్లా, మండల, రాష్ట్రస్థాయిల వరకు గుర్తింపు పొందడం విశేషం.

శిక్షకురాలిగా రాణించాలని

సమీక్ష ఆర్ట్స్‌ అకాడమీ ద్వారా వివిధ కళల్లో శిక్షణ పొందుతున్న సమీక్షకు ఆమె తల్లి మెర్సీ గురువుగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. ఇతర గురువుల మార్గదర్శకత్వంలోనూ నిరంతరం సాధన చేస్తోంది. చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే కళలు, క్రీడలకు సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడంతోపాటు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది. ఒకే రంగానికి పరిమితం కాకుండా అనేక కళలు, క్రీడల్లో ప్రతిభ చాటుకుంటున్న సమీక్ష భవిష్యత్తులో మంచి కళాకారిణిగా, క్రీడాకారిణిగా ఎదగడమే కాకుండా తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పిస్తూ శిక్షకురాలిగా రాణించాలని ఆకాంక్షిస్తోంది. చిన్న వయసులోనే ఇన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ, పట్టుదలతో విజయాలు సాధిస్తున్న సమీక్ష ప్రయాణం నేటి బాలికలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్