Magazines

ఫిబ్రవరి 14–17 తేదీల్లో ఏఐఏడబ్ల్యూయూ11వ అఖిల భారత మహాసభలు

1 గంట క్రితం

of AIAWU from February 14–17
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

 సామాజిక న్యాయం, పేదల హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలు

పేదల పొట్టకొట్టి కార్పొరేట్ల ఖజానాలు నింపుతున్న మోడీ సర్కారు

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన 
కార్యదర్శి బి వెంకట్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

సామాజిక న్యాయం, సంక్షేమం, పేదల హక్కుల కోసం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతున్నదని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ ‌చెప్పారు. పేదలకు భూమి పంచాలనే డిమాండ్‌‌తో దేశ వ్యాప్తంగా అనేక సమరశీల పోరాటాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. వీటిన్నింటిని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకునేందుకు ఫిబ్రవరి 14-17 తేదీల్లో ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత మహాసభలను బెంగళూరులో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర నాయకులు చంద్రప్ప, పుట్ట మధు, ముని వెంకటప్ప, హనుమ గౌడ, హన్వేష్ తదితరులతో కలిసి బి వెంకట్‌... బెంగళూరు సిటీ యూనివర్సిటీ (మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ) క్యాంపస్‌లో గల జ్ఞాన జ్యోతి మందిర్ ఆడిటోరియంలో మహాసభల వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ, సంపదను సృష్టించే శ్రమజీవులను ఆకలి, అప్పులు, నిరుద్యోగంలోకి నెడుతున్నదని విమర్శించారు. కరువుతో పంటలు ఎండిపోయి, పనులు లేక గ్రామీణ పేదలు వలసబాట పడుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కరువు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఉపాధి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ ‌చేశారు. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక పరిహారం, ఆహార ధాన్యాల సరఫరా రెట్టింపు, తాగునీరు, పశుగ్రాసం, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సర్‌ పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలస కార్మికులు, గ్రామీణ పేదల ఓటుహక్కును కాలరాయడం ద్వారా ప్రజాస్వామ్యం వ్యవస్థపై దాడి చేస్తున్నదని విమర్శించారు. సరైన పత్రాలు లేవనే నెపం మోపి అర్హులైన పేదల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సర్‌ను రద్దు చేసి సమగ్ర ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ విధానాలను ఓడించేందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, జి రామ్ జి తెచ్చి మోడీ సర్కార్ పేదల కడుపు కొడుతున్నదని విమర్శించారు. ఆధార్, ఈ-కేవైసీ, డిజిటల్ హాజరు పేరుతో పేదలను పనికి దూరం చేయడం దుర్మార్గమన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించి, బలోపేతం చేయాలన్నారు. ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు భూపంపిణీ, వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర చట్టం, పెన్షన్, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. మహాసభలకు దేశవ్యాప్తంగా సుమారు 1,000 మంది ప్రతినిధులు, పరిశీలకులు, ఆహ్వానితులు పాల్గొంటారని వివరించారు. సాహితీవేత్త బరుగూరు రామచంద్రప్ప చైర్మెన్‌‌గా, వరలక్ష్మి వర్కింగ్ చైర్మెన్‌‌గా, చంద్రప్ప ప్రధాన కార్యదర్శిగా, పుట్ట మధు కోశాధికారిగా ఆహ్వాన సంఘం ఏర్పడిందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు పలువురు ప్రముఖులు చీఫ్ ప్యాట్రన్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్