Magazines

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

1 గంట క్రితం

Victory in the MLC elections is the goal
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలి :
మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు

అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి

ప్రభుత్వ విజయాలను 
ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

నాంపల్లిలో సన్నాహక సమావేశం

నవతెలంగాణ-సిటీ బ్యూరో

​హైదరాబాద్-రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నిక పార్టీకి అత్యంత కీలకమని, ఇక్కడ విజయం సాధించడం ద్వారా భవిష్యత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన రాజకీయ పట్టును నిరూపించుకుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 6వ తేదీలోపు అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను బూత్, బ్లాక్, నియోజకవర్గ స్థాయి నాయకులు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటీ కంపెనీలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఓటరు నమోదును వేగవంతం చేయాలన్నారు. సీనియర్ నేతలతో కలిసి తాను, మంత్రి అజారుద్దీన్ క్షేత్రస్థాయి కార్యాచరణను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.

​ప్రభుత్వ విజయాలను వివరిస్తూ ఓట్లు అడగాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోందని, ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు కూడగట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ మల్లు రవి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మెన్లు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, పీసీసీ కోఆర్డినేటర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్