Magazines

జల సిరులేవి?

1 గంట క్రితం

Where are the water riches?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 3 నిమిషాల చదవడం

ఖమ్మం, మహబూబాబాద్‌లో అడుగుంటిన చెరువులు

ఖమ్మం జిల్లాలో సగం నీరు కూడా లేని దుస్థితి

నల్లగొండలో 41 శాతం లోటు వర్షపాతం

హైదరాబాద్‌‌లో ప్రమాదకరంగా గ్రౌండ్‌‌వాటర్‌ ‌లెవల్స్‌

రబీ సాగు, తాగునీటి అవసరాలపై పెరుగుతున్న ఆందోళన

​రాబోయే యాసంగి సీజన్‌కు ముందస్తు హెచ్చరిక

చాలాచోట్ల నిద్రమత్తు వీడని అధికారగణం

నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ఈ ఏడాది నైబుతి రుతుపవనాల్లో వర్ష పాతం తగ్గడం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావం వెంటాడుతోంది.. గత ఏడాదితో పోలిస్తే చాలాచోట్ల ఈ సారి భూగర్భజలాలు మరింత అడుగంటుతు న్నాయి. గతేడాది 2025 సెప్టెంబర్‌లో 4.41 మీటర్ల లోతులో ఉన్న జలాలు.. ఈఏడాది 7.52 మీటర్లకు పడిపోయాయి. రంగారెడ్డి, మేడ్చెల్‌-‌మల్కాజిగిరి, హైదరాబాద్‌‌లోని కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో 70 శాతం జలాలను ఇప్పటికే తోడేశారు. దీంతో రాష్ట్రప్రభుత్వం కూడా కొత్త బోరు బావుల తవ్వకాలపై ఆంక్షలు విధించింది. తాగునీటి అవసరాల కోసం ఉన్న బోర్లను లోతుగా చేసుకోవడానికి మాత్రమే అనుమతించింది. రబీ సాగు, తాగునీటి భద్రతపై ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీటి వనరుల లభ్యతను పరిశీలిస్తే నీటి భద్రతపై భరోసా సన్నగిల్లుతోంది. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని 2,144 చెరువుల పరిస్థితిని పరిశీలిస్తే నీటి లభ్యతల్లో అసమానతలు ఉన్నాయి. ఒక్క చెరువు కూడా అలుగు పారకపోవడం రాబోయే యాసంగి సీజన్‌కు ముందస్తు హెచ్చరికగా మారింది. బోరుబావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా యంత్రాంగం నిద్రమత్తు వీడి ముందస్తు ప్రణాళికలు విడుదల చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

కొత్తగూడెంలో ఆందోళనకరం..

కొత్తగూడెం ఇరిగేషన్ పరిధిలోని 2,144 చిన్న నీటిపారుదల చెరువుల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయని నీటిపారుదల శాఖ నివేదిక వెల్లడించింది. మొత్తం చెరువుల్లో 245 చెరువుల్లో 25 శాతం లోపు, 524 చెరు వుల్లో 25 నుంచి 50 శాతం మాత్రమే నీరు ఉంది. అంటే 769 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో ఒక్క చెరువు కూడా అలుగు పారకపోవడం భూగర్భ జలాలపై ప్రభావం చూపే ప్రమాదాన్ని సూచిస్తోంది.

​ఖమ్మం, మహబూబాబాద్‌‌ల్లో ఘోరం

​​ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరి స్థితి మరీ ఘోరంగా ఉంది. ఖమ్మం జిల్లాలోని 92 చెరువుల్లో ఏకంగా 75 చెరువులు (దాదాపు 81 శాతం) సగం నీటికి కూడా నోచుకోలేదు. కేవలం 10 చెరువులు మాత్రమే 75 శాతానికి పైగా నిండగా, 24 చెరువులు పూర్తిగా అడుగుంటాయి. మహబూబాబాద్ జిల్లాలోని 162 చెరువుల్లో కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. అక్కడ 119 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరే అందుబాటులో ఉంది. కేవలం 20 చెరువుల్లోనే 75 శాతానికి పైగా నీరుంది.

​​ములుగులో జలకళ

​​మిగిలిన మూడు జిల్లాలతో పోలిస్తే ములుగు జిల్లా చిన్న నీటిపారుదల రంగంలో ఆశాజనకమైన పరిస్థితిని ఆవిష్కరిస్తోంది. ఈ జిల్లాలోని మొత్తం 179 చెరువుల్లో ఒక్కటి కూడా 50 శాతం కంటే తక్కువ నీటి విభాగంలో లేకపోవడం విశేషం. ఏకంగా 162 చెరువులు (90 శాతానికి పైగా) 75 నుండి 100 శాతం నిండి నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ కూడా అలుగు పారే చెరువులు సున్నాగానే ఉన్నాయి.​​కేవలం గణాంకాలను సేకరించి నివేదికలకే పరిమితం కావడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. తక్కువ నీరున్న 769 చెరువుల పరిధిలో తక్షణమే ‘ముందస్తు నీటి యాజమాన్య ప్రణాళికలు’ అమలు చేయాలని రైతుసంఘం నేతలు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

40 గ్రామాల్లో భూగర్భ జలాల లోటు

​​నల్లగొండలో 41 శాతం లోటు వర్షపాతం ఉంది. నల్లగొండ జిల్లాలో సెప్టెంబర్ 2026 నాటికి సగటు భూగర్భ జలమట్టం భూమి ఉపరితలం నుంచి 8.42 మీటర్ల లోతులో నమోదైంది. 2025 సెప్టెంబర్‌తో పోలిస్తే నీటిమట్టం 2.01 మీటర్ల లోతుకు వెళ్లింది. మరో వైపు, భూగర్భ జలాల శాఖ నివేదిక ప్రకారం.. జిల్లాలోని 40 గ్రామాల్లో మొత్తం 1,892 హెక్టార్ మీటర్ల మేర భూగర్భ జలాల లోటు నమోదైంది. దామరచర్ల మండలంలో అత్యంత తీవ్రమైన భూగర్భ జల కరువు సూచిక నమోదైనట్టు నివేదిక పేర్కొంది. సూర్యా పేట జిల్లాలో సాధారణ వర్షపాతం 541.5 మిల్లీమీటర్లు కాగా, 398.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలోని 23 మండలాల్లో 14 మండ లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొ న్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం 606 మిల్లీమీటర్లు కాగా, 421.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 30 శాతం లోటు ఏర్పడింది. జిల్లాలోని 17 మండలాల్లో 14 మండలాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మిషన్ భగీరథ నివేదిక ప్రకారం జిల్లాలో 262 గ్రామీణ ఆవాసాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా చేయడంలేదు. సంస్థాన్ నారాయణపూర్, ఆలేరు, చౌటుప్పల్, వలిగొండ, గుండాల మండలాల్లో బోర్లు 400 నుంచి 600 అడుగుల లోతుకు వేసినా నీరు పడడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 271 మండలాల్లో భూగర్భ జలం ప్రమాదకర స్థాయికి పడిపోతే, అందులో యాదాద్రి జిల్లా ఉందని భూగర్భ జల వనరుల శాఖ హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్