వ్యవసాయ రంగంపై ప్రభావాలను సమీక్షించాలి
రైతుల ఆదాయం, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి : ప్రొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించే విధానంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకనే ఆహార భద్రత విధానంలో ప్రతిష్టంబన ఏర్పడిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టనంలోని స్థానిక అనుధితి ఫంక్షన్ హాల్ లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘భారత దేశంలో ఆహార భద్రతపై ఇథనాల్ విధాన ప్రభావం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇథనాల్ వినియోగం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం వంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ, ఈ విధానం వల్ల రైతులకు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు, ఆహార భద్రతకు కలిగే ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. చెరుకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తే ఇథనాల్‌కు పెరుగుతున్న డిమాండ్ ఈ పంటలను సాగు చేసే రైతులకు అదనపు మార్కెట్ అవకాశాలను కల్పించాలన్నారు. అయితే ఇథనాల్ ఉత్పత్తి కోసం వ్యవసాయ పంటల వినియోగం పెరిగినప్పుడు ఆహార అవసరాలు, పశుగ్రాస లభ్యత, పంటల ధరలు, సాగునీటి వినియోగంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సాగు ఖర్చులు తగ్గడం, మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్ ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. ఇథనాల్ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు ఎంతవరకు చేరుతున్నాయి? ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు కలిగే లాభనష్టాలు ఏమిటి? పంటల సాగు విస్తీర్ణంలో మార్పులు చోటుచేసుకుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరమన్నారు.
దేశంలో వ్యవసాయం కోట్లాది కుటుంబాలకు జీవనాధారమన్నారు. ఈ రంగాన్ని ప్రభావితం చేసే ఏ విధానమైనా రైతుల ఆదాయం, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం పంటలను వినియోగించే విధానంలో ఆహార అవసరాలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటల సాగు, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఈ విధానంపై స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం చేయించాలన్నారు. రైతుసంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
రైతులకు ప్రయోజనం చేకూర్చేలా, ఆహార భద్రతకు భంగం కలగకుండా, పర్యావరణానికి మేలు చేసే విధంగా విధానంలో అవసరమైన మార్పులు చేపట్టాలని తెలిపారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం అనేది కేవలం ఇంధనానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని ఇది వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ఆదాయం, ఆహార భద్రత, భూగర్భ జలాలు, పర్యావరణం, దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న విధానమని తెలిపారు. దేశానికి ఇంధన భద్రత ఎంత ముఖ్యమో, ప్రజలకు ఆహార భద్రత కూడా అంతే ముఖ్యమని రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ఆహారం, వ్యవసాయానికి అవసరమైన నీరు, పర్యావరణ పరిరక్షణ, ఈ నాలుగు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఇథనాల్ విధానం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా మారుతుందని తెలిపారు.
రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ ఇంధన అవసరాల కోసం వ్యవసాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. కానీ వ్యవసాయాన్ని కేవలం ఇంధన ముడిపదార్థాల సరఫరా రంగంగా మార్చకుండా, రైతుల జీవనోపాధిని, దేశ ఆహార భద్రతను కాపాడడం ప్రభుత్వ విధానంలో ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జాతీయ రైతు సంఘం మహాసభ జరగనుందని, దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు ఆ మహాసభలకు హాజరవుతారన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, ఆదర్శ రైతు జొన్నలగడ్డ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)