Magazines

తొలి రోజే స్పిన్‌ మాయ

43 నిమిషాల క్రితం

Spin magic on the very first day
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

134 పరుగులకే త్రిపుర ఆలౌట్‌

అనికెత్‌ రెడ్డి ఐదు వికెట్ల మాయాజాలం

నవతెలంగాణ-హైదరాబాద్‌ :

రంజీ ట్రోఫీని మాజీ చాంపియన్‌ హైదరాబాద్‌ సూపర్‌గా మొదలెట్టింది. ఎర్ర మట్టితో కొత్తగా తయారు చేసిన పిచ్‌పై ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన కెప్టెన్‌ మహ్మద్‌ సిరాజ్‌.. తొలి రోజు త్రిపురను బుట్టలో పడేశాడు. స్పిన్‌ త్రయం అనికెత్‌ రెడ్డి (5/21), తనయ్‌ త్యాగరాజన్‌ (3/37), రుతిక్‌ మెండె (1/17) తొమ్మిది వికెట్లతో మాయాజాలం చేశారు. దీంతో హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో త్రిపుర 134 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి రోజు తిరుగులేని పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన త్రిపురకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. హైదరాబాద్‌ సీమర్లు మహ్మద్‌ సిరాజ్‌, సివి మిలింద్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఓపెనర్లు 23.2 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ఓపెనర్‌ హృతురాజ్‌ రాయ్‌ (33, 70 బంతుల్లో 5 ఫోర్లు) వికెట్‌తో హైదరాబాద్‌కు బ్రేక్‌ అందించాడు. తన తర్వాతి ఓవర్‌లో శ్రీదమ్‌ పాల్‌ (0), హనుమ విహారి (0)లను డకౌట్‌ చేసిన త్యాగరాజన్‌ త్రిపురను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత ఎక్కడా త్రిపుర కోలుకోలేదు. అనికెత్‌ రెడ్డి త్రిపుర పతనాన్ని శాసించాడు. 24 బంతుల వ్యవధిలో 4 పరుగులకే ఆఖరు ఆరు వికెట్లు కోల్పోయిన త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. మన్‌దీప్‌ సింగ్‌ (24), సేంతు సర్కార్‌ (0), రజత్‌ (1), సందీప్‌ సర్కార్‌ (0), అభిజిత్‌ సర్కార్‌ (1)లు అనికెత్‌ మాయకు విలవిల్లాడారు. ఓపెనర్‌ బిక్రమ్‌ కుమార్‌ దాస్‌ (50, 107 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో త్రిపురను ఆదుకున్నాడు. బ్యాట్‌తో హైదరాబాద్‌ సైతం ఆరంభంలో మెప్పించినా, ఆ తర్వాత త్రిపుర స్పిన్‌ మ్యాజిక్‌కు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (48 నాటౌట్‌, 107 బంతుల్లో 2 ఫోర్లు), అభిరాథ్‌ రెడ్డి (32, 56 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 18.2 ఓవర్లలో 60 పరుగులు జోడించారు. ఆఫ్‌ స్పిన్నర్‌ సందీప్‌ సర్కార్‌ (4/44) నాలుగు వికెట్ల ప్రదర్శనతో హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అభిరాథ్‌ రెడ్డి సహా రాహుల్‌ సింగ్‌ (5), ప్రజ్ఞయ్‌ రెడ్డి (0), కొడిమెల హిమతేజ (18) సందీప్‌ సర్కార్‌కు వికెట్‌ కోల్పోయారు. తన్మయ్‌ అగర్వాల్‌తో కలిసి రుత్విక్‌ యాదవ్‌ (11 నాటౌట్‌, 23 బంతుల్లో 1 ఫోర్‌) అజేయంగా ఆడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 13 పరుగుల వెనుకంజలో నిలిచింది. మహ్మద్‌ సిరాజ్‌, సివి మిలింద్‌, తనయ్‌ త్యాగరాజన్‌, అనికెత్‌ రెడ్డి, రాహుల్‌ రాడేశ్‌లు బ్యాట్‌తోనూ రాణించగల సమర్థులు. దీంతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంపై కన్నేసి రెండో రోజు ఆటలోకి రానుంది.

సంక్షిప్త స్కోరు వివరాలు

త్రిపుర తొలి ఇన్నింగ్స్‌ : 134/10 ( బిక్రమ్‌కుమార్‌ దాస్‌ 50, హృతురాజ్‌ రాయ్‌ 33, అనికెత్‌ రెడ్డి 5/21, తనయ్‌ త్యాగరాజన్‌ 3/37)

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ : 121/4 (తన్మయ్‌ అగర్వాల్‌ 48 నాటౌట్‌, అభిరాథ్‌ రెడ్డి 32, హిమతేజ 28, సందీప్‌ సర్కార్‌ 4/44)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్