ప్రభుత్వ పోర్టల్‌లో క్యాన్సర్ వివరాలు
ప్రయివేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రభుత్వం ఆదేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘
క్యూర్’ పరిధిలో ప్రతి క్యాన్సర్ కేసునూ అధికారికంగా నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులు, అల్ట్రాసౌండ్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లకూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్ ఇతర నోటిఫైడ్ వ్యాధుల మాదిరిగానే క్యాన్సర్ నిర్ధారణ అయ్యాక ప్రభుత్వ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. రోగి వ్యక్తిగత వివరాలు, ఇతర సమాచారం విషయంలో పూర్తి గోప్యత పాటించనున్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రభుత్వం గుర్తించింది. నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లోని క్యాన్సర్ డేటాను సేకరించి క్రోడీకరిస్తారు. ప్రతి క్యాన్సర్ కేసునూ ట్రాక్ చేసేలా ఏర్పాట్లు సైతం చేశారు.
ప్రయోజనాలు ఇలా..
క్యాన్సర్ వివరాల నమోదుతో ఏయే ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు, ఏయే రకాల క్యాన్సర్ కేసులు వస్తున్నాయో తెలుస్తుంది. తద్వారా ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఆయా క్యాన్సర్లపై పరిశోధనలు చేసి నివారణా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నెల రోజుల్లోనే వివరాలన్నీ నమోదు చేయడం వల్ల రియల్ టైం డేటా అందుబాటులోకి వస్తుంది. క్యాన్సర్ నివారణకు ఇది కీలకం.
నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్
రాష్ట్రంలో ఏటా 50 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి క్యాన్సర్‌ను 'నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు, క్లినిక్ లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు తమ వద్ద నమోదయ్యే క్యాన్సర్ కేసుల వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కార్పొరేట్, పెద్ద ఆస్పత్రుల నుంచి వివరాలు వస్తున్నా.. ‘క్యూర్’లోని సాధారణ ప్రయివేటు ఆస్పత్రుల నుంచి సమాచారం సకాలంలో అందకపోవడం సమస్యగా మారింది. ఇప్పటి వరకు పోర్టల్ లో హైదరాబాద్ జిల్లాలో 2వేలకుపైగా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 700 వరకు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం లక్ష జనాభాకు పోర్టల్‌లో 125 వార్షిక కేసులు నమోదవుతున్నట్టు చూపుతోంది. జిల్లాల్లో కొందరు సిబ్బందికి తగిన అవగాహన లేకపోవడం, కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నమోదు ప్రక్రియను పెద్దగా పట్టించుకోకపోవడం నమోదు ప్రక్రియకు ఆటంకంగా మారింది. డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని క్యాన్సర్ రోగుల వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు
పోర్టల్‌లో క్యాన్సర్ కేసుల వివరాల నమోదుకు అన్ని ప్రయివేటు ఆస్పత్రులు, డయా గ్నోస్టిక్ సెంటర్ల నిర్వా హకులు స్పందిస్తున్నారు. వ్యాధుల వ్యాప్తి, అనుమానం వచ్చినా, నిర్ధారణ అయినా, నెలవారీ నివేదిక కోసం వేచి చూడకుండా వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలి. ఎవరైనా అతిక్రమిస్తే క్లినికల్ ఎస్టాబ్లి ష్ మెంట్ యాక్టు కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ కె.ఆనంద్, డీఎంఅండ్‌హెచ్‌ఓ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా






కామెంట్‌లు (0)