75 మంది నిరుద్యోగుల నుంచి రూ.4.5 లక్షలు వసూలు : మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్మనీలో కొలువుల పేరిట ప్రభుత్వ రంగ సంస్థ అయిన టాంకాం నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 15 జిల్లాల్లోని 75 మంది నిరుద్యోగుల నుంచి వీసాలు, పరీక్షల పేరిట ఒక్కొక్కరి వద్ద రూ. 4.5 లక్షలు వసూలు చేసి మోసం చేసిందని ఆరోపించారు. రెండేండ్లు గడిచినా 75 మందిలో ఏ ఒక్క అభ్యర్థికీ జర్మన్ కంపెనీతో కనీసం ఇంటర్వ్యూ కూడా ఇప్పించలేదని విమర్శిం చారు. బీ1 లాంగ్వేజ్ పరీక్ష పాసైన వారికి మళ్లీ బీ2 అంటూ కొర్రీలు పెడుతున్నారనీ, తొమ్మిది మంది జర్మనీకి వెళ్తున్నారని ఘనంగా ప్రచారం చేసుకుని తీరా ఒక్కరినీ పంపించలేదని గుర్తు చేశారు. ఏదైనా సమస్య వస్తే 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్నో కోర్టుకు వెళ్లాలని అమాయక యువతతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. బాధితులు న్యాయం కోసం ఏడుస్తుంటే, కార్మిక శాఖ మంత్రి మాత్రం జూన్లో మరో కొత్త బ్యాచ్ను ప్రారంభిస్తూ ఉద్యోగాలంటూ మాయమాటలు చెబుతోందని విమర్శించారు. మోసపోయిన బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. టాంకాం కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)