సమాజ మార్పునకు అవి రెండు కాళ్లలాంటివి
ఏది వెనుకపట్టు పట్టినా లక్ష్యం నెరవేరదు
ఆర్థిక పోరాటాలకు
రాజకీయ చైతన్యం తోడవ్వాలి
సమాజంలో ఒక నియమంగా
చెలామణి అవుతున్న కులధర్మం
వర్గ పోరాటాలకు అది అడ్డుగోడ : ఎస్‌వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం)
కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్: భారతదేశంలో సోషలిస్టు సమాజ స్థాపన కోసం ఆర్థిక, సామాజిక పోరాటాలు జమిలీగా జరగాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. సమాజ మార్పునకు ఆ రెండు పోరాటాలు రెండు కాళ్లలాంటివని అన్నారు. ఆ రెండింటిలో ఏది వెనుకపట్టు పట్టినా కమ్యూనిస్టులు అనుకున్న లక్ష్యం నెరవేరదని స్పష్టం చేశారు. ఆర్థిక పోరాటాలకు రాజకీయ చైతన్యం తోడవ్వాలన్నారు. అది కుల చైతన్యాన్ని దాటి సమాజ సమూల మార్పు దిశగా ముందుకు సాగాలని చెప్పారు. తరతరాలుగా కొనసాగుతూ... నరనరనా జీర్జించుకుపోయిన కులధర్మం సమాజంలో ఒక నియమంగా చెలామణి అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్గ పోరాటాలను కులం అడ్డుకుంటోందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘కుల నిర్మూలన మార్స్కిస్టు అవగాహన’ అనే అంశంపై వెబినార్ జరిగింది. దీనికి ఎస్‌వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ దేశంలో పాలకవర్గాల సిద్ధాంతాలే ప్రజల భావాలుగా చెలామణి అవుతున్నాయన్నారు. కుల ధర్మం పాటించే వారు కూడా ఎవ్వరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలనే విధంగా నాటుకుపోయిందన్నారు. దేశంలో కులం (బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్రులు) నిచ్చెన మెట్ల మాదిరిగా ఉందన్నారు. ప్రతికులానికి సామాజికి హోదా ఉందని తెలిపారు. ఈ విధానమే దోపిడీకి గురవుతున్న వర్గాలు ఐక్యం కాకుండా అడ్డుకుంటుందని చెప్పారు. శ్రమ చేసే వారు అక్కడికే పరిమితం కావడం, చదువు, సాంకేతికత, అభివృద్ధికి దూరంగా ఉండటంతో కొన్ని కులాలకు వాటిపై పెత్తనం పెరిగిపోతోందన్నారు. సమాజంలో నెలకొన్న అంతరాలతో కొన్ని కులాలు పూర్తిగా వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. ఆర్థిక అస మానతలు తొలగిపోతేనే కుల నిర్మూలన జరుగు తుందన్న భావన ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఆధితప్యం భావజాలాన్ని ధిక్కరించాలనన్నారు. దేశంలో సోషలిజం రావాలంటే, శ్రామికవర్గాల ఐక్యత ముఖ్యమని, దీన్ని కులం అడ్డుకుంటుందనితెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో భారీ పరిశ్రమలు రావడం ద్వారా కులం పోతుందని భావించినా, కొన్ని మార్పులు వచ్చాయో తప్ప కుల నిర్మూలన జరగలేదని చెప్పారు. మరోవైపు హిందువులంతా ఒక్కటేనంటూ బీజేపీ ప్రచారం చేస్తూ తమ రాజకీయ సంకల్పం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. హిందువులంతా ఒక్కటే అయినప్పడు బలహీనవర్గాల పిల్లలను ఎందుకు పెళ్లిళ్లు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ తమ మతోన్మాదం, కులోన్మాదం ద్వారా మనుధర్మాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. దీంతో పేదలు, దళితులు, గిరిజనులు, బడుగువర్గాలు ఏకతాటిపైకి రాకుండా అడ్డుపడుతున్నదని చెప్పారు. దేశంలో దళిత, గిరిజనులపై దాడులు, ధౌర్జన్యాలు, లైంగికదాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు పెరుగుతున్నా యన్నారు. కానీ ఆర్థిక పోరాటాలకు పరిమితం కావడంతో సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న పేదలు, దళితులు, గిరిజనులు దూరమయ్యారని తెలిపారు. భూమి కోసం, ఇంటి స్థలాల, ఉద్యోగ, ఉపాధి కోసం జరుగుతున్న పోరాటాల్లో దళితులు కలిసి వస్తున్నా... వారిని కులం మాత్రం వదలడం లేదని చెప్పారు. దీంతో ఎక్కువ మంది అస్థిత్వ వాదా ఉద్యమాల వైపు మొగ్గుచూపుతున్నారని వివరించారు. సామాజిక వివక్ష, కులనిర్మూలన కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. దళితజన ఉద్ధరణ కోసం ఆయన అనేక ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. మతం మారినా, కులాంతరవివాహాలు చేసుకుంటున్నా సహపంక్తి భోజనాలు చేస్తున్నా...బౌద్ధమతం స్వీకరించినా, క్రైస్తవుల్లో కలిసినా... కుల నిర్మూలన జరగడం లేదన్నారు. ఆర్థిక, సామాజిక పోరాటాల కలయికతోనే కుల నిర్మూలన అంతమవుతుందనే మార్స్కిస్టు ఆలోచన విధానంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
జమిలీగా ఆర్థిక, సామాజిక పోరాటాలు
55 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)