Magazines

ఎందుకీ తాత్సారం?

1 గంట క్రితం

this delay
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 3 నిమిషాల చదవడం

315 కరువు మండలాలపై అధికారిక ప్రకటనేదీ?

వరి వేయొద్దంటూ సూచనలకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం..నష్టపరిహారం చెల్లింపుపై ఇవ్వని భరోసా
పట్టించుకోని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు..ఇప్పటికే కేంద్రానికి మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాల నివేదికలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎల్‌‌నినో ఎఫెక్ట్‌తో తెలంగాణ రైతాంగం తీవ్ర కరువు చాయల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నది. ఏ గ్రామానికెళ్లినా ఓవైపు ఎండిపోయిన పత్తిచేన్లు... ఇంకోవైపు ఎండుతున్న వరిఫైర్లు కనిపిస్తున్న దైన్యస్థితి నెలకొంది. ప్రాజెక్టుల నుంచి పంటలకు నీళ్లివ్వడం ఏమోగానీ ఇంకొన్ని రోజులు ఆగితే తాగునీటిని కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర సర్కారు మాత్రం కరువు మండలాలను అధికారికంగా గుర్తించి ప్రకటించడంపై మీనమేషాలు లెక్కిస్తూ తాత్సారం వహిస్తోంది. 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం రేవంత్‌‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నప్పటికీ అధికారికంగా కేంద్రానికి నివేదికలు పంపిన దాఖలాలు కనిపించడం లేదు. రబీ సీజన్‌ ‌ముగియడానికి ఇంకా 15 రోజుల సమయం కూడా లేదు. ఇలాంటి తరుణంలో క్షేత్రస్థాయి పర్యటనలకే పరిమితమై నివేదిక రూపకల్పన పేరుతో కాలయాపన చేస్తున్న పరిస్థితి అన్నదాతలకు నష్టంచేకూర్చే ప్రమాదముంది. ఎల్‌‌నినోతో తెలంగాణలో కరువు తీవ్ర స్థాయిలో ఉండబోతున్నద ని వాతావరణ శాఖ ఏడాది ముందు నుంచి హెచ్చరి స్తూనే ఉంది.

ఇలాంటి తరుణంలో కంటింజెన్సీ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందిగానీ క్షేత్రస్థాయిలో రైతులకు కరువు తీవ్రతను విడమర్చి చెప్పడంలోనూ, రైతులు తీవ్ర నష్టాల్లోకి కూరుకు పోకుండా చర్యలు చేపట్టడంలోనూ రాష్ట్ర సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలి. అప్పుడే కరువును అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రాష్ర్టానికి పంపుతుంది. ఆ బృందాలు నష్టపరిహారాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదికలను సమర్పిస్తాయి. దాని ఆధారంగానే కేంద్రం నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా నివేదికలే పంపలేదు కేంద్ర బృందాలు ఎప్పడు వస్తాయి? ఎప్పుడు నష్టపరిహారాన్ని అందజేస్తాయి? అనేదే పెద్ద ప్రశ్న. ఈ విషయంలో జాప్యం చేసేకొద్దీ అన్నదాతలకే నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. కరువు నివేదికలను కేంద్రానికి సమర్పించడంలో మన పొరుగు రాష్ర్టాలైన కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వాలు ముందు వరుసలో ఉన్నాయి. 305 తాలూకాల్లో కరువు పరిస్థితులున్నాయని మహారాష్ట్ర, 226 తాలూకాల్లో కరువు నెలకొందని కర్నాటక, 388 మండలాల్లో కరువు ఛాయలున్నాయని ఏపీ ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలను సమర్పించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా అధికారికంగా పంపలేదు.

మన రాష్ట్రంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటలను ఇప్పుడు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఫసల్‌‌బీమా పథకంలో లేదు కాబట్టి తెలంగాణ రైతాంగానికి పంటల బీమా కింద నష్టపరిహారం అందే సూచనలు కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కరువు మండలాలను ధ్రువీకరించేలా, ప్రత్యేకంగా నిధులు విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది. ఫైనాన్స్‌ ‌కమిషన్‌ ‌నుంచి డబ్బులు తెప్పించుకునే ప్రయత్నం చేయాలి. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్లు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ర్టానికి అధిక నిధులను రాబట్టేందుకు కృషి చేయాలి. వారి నుంచి ఆ కృషేమీ కనిపించడం లేదు. కరువు మండలాలను ప్రకటిస్తే పశువులకు దాణాను ఏర్పాటు చేయడం, గ్రామాల్లో పశువుల కోసం నీటితొట్టీలను ఏర్పాటు చేయించడం, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను అందజేయడం, వ్యవసాయ రుణాలను మాఫీ చేయించడం, రైతుల పిల్లలకు విద్యాసంస్థల్లో ఫీజుల నుంచి వెసులుబాటు కల్పించడం వంటి కరువు ఉపశమన చర్యలు చేపట్టాల్సి వస్తుందనే కరువు మండలాల ప్రకటనపై జాప్యం జరుగుతున్నదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ​యాసంగి సీజన్‌‌లో వరి వేయొద్దని రైతులకు సీఎం, మంత్రులు, అధికారులు నొక్కి మరీ చెబుతున్నారు. హార్టికల్చర్‌‌ను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదిగానీ..క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే అధికారులే లేని దుస్థితి.


ఒక్కో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఐదు నుంచి 15 మండలాలకు బాధ్యులుగా ఉన్నారు. వరి వేయకుండా ఉండే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికే కిలో బియ్యం రూ.90 అయ్యింది. ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు రైతుల కల్లాల మీద ఎగబడి క్వింటా రూ.5 వేల చొప్పున కొంటున్నారు. ఇలాగైతే సాధారణమైన మధ్యతరగతి ప్రజానీకానికి బియ్యం ధరలు అందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే తెలంగాణకు 50 శాతం కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. మున్ముందు కరువు ఇలాగే కొనసాగితే అవీ తగ్గుముఖం పట్టే సూచనలు బలంగా ఉన్నాయి. కరెంటే లేకపోతే...పంటలు వేయకపోతే రాబోయే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడంలేదు. ఇప్పటి కే నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నష్టనివారణ చర్యల విషయంలో ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన ప్రణాళికలేవీ లేవని తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమవుతున్నది. వరి వేసుకోవద్దు..ఇతర పంటలు వేయాలి...అని ప్రభుత్వ చెబుతున్నదిగా ప్రత్యామ్నాయ ప్రణాళిక మేరకు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు. ఆచరణాత్మక ప్రణాళిక అమలుపై స్పష్టత లేదు. కేసీఆర్‌ ‌గవర్నమెంట్‌ కాలంలో ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రూ.10 వేల చొప్పున ఇచ్చింది. తీవ్ర కరువు నేపథ్యంలో ఆ డబ్బులు సరిపోవు కాబట్టి వాణిజ్యపంటలైతే ఎకరాకు రూ.50 వేలు, ఆహార పంటలైతే ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్