Magazines

యాదాద్రి విద్యుత్‌ ‌ప్లాంట్‌ 
‌సీఈ సురేశ్‌ ‌సస్పెన్షన్‌

2 గంటల క్రితం

Yadadri Power Plant
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

టీజీ జెన్కో సీఎమ్‌డీ హరీశ్‌ ఉత్తర్వులు జారీ

విధుల్లో నిర్లక్ష్యంగా
 వ్యవహరించారని నిర్ధారణ

విద్యుత్‌ ఉత్పత్తి పర్యవేక్షణకు 
ఐదుగురు ఐఏఎస్‌ అధికారుల డిప్యూటేషన్‌


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం చీఫ్‌ ఇంజినీర్‌ బి.సురేశ్‌ నాయక్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు గాను ఆయనను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ జెన్కో) సీఎమ్‌డీ హరీశ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం స్టేజ్-1 లో విద్యుత్ ఉత్పత్తి పనితీరు మెరుగుపర్చడంపై జెన్కో సీఎమ్‌డీ, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రెండు నెలలుగా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత 15 రోజులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్లానింగ్, మానిటరింగ్, విద్యుత్ ఉత్పత్తి పనుల నిర్వహణలో వైటీపీఎస్ స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ సురేశ్‌ నిర్లక్ష్యం వహించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ, తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’’ అని జెన్కో సీఎమ్‌డీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో వైటీపీఎస్‌ అధికారుల ముందస్తు అనుమతి పొందకుండా ఆయన ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్ళరాదని సర్కార్‌ ‌పేర్కొంది. ఉత్పత్తి పర్యవేక్షణకు ఐఏఎస్‌‌లు యాదాద్రి థర్మల్‌ ‌విద్యుత్‌ ప్లాంట్‌లో తలెత్తుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధిగమించేందుకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ర్ట ప్రభుత్వం రంగంలోకి దింపింది.

పవర్ ప్లాంట్ వద్దే విడతలవారీగా విధుల్లో ఉండటానికి వీలుగా వీరిని డిప్యూట్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు వీరు ప్లాంట్ వద్దే ఉండి అన్ని అంశాలను పరిశీలించనున్నారు. నిర్దిష్టమైన అంశాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ‘ప్లాంట్‌లోని 4 బొగ్గు స్ట్రీమ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయా? ఏవైనా అంతరాయాలు ఉంటే కారణాలేంటి? ప్లాంట్‌కు చేరుతున్న బొగ్గు గ్రేడ్ ఎంత? ఆ గ్రేడ్‌కు తగినట్టుగానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా లేక ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? అన్ని యూనిట్లలో బంకర్లకు బొగ్గు సరఫరా నిరంతరాయంగా సాగుతుందా? ప్లాంట్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న భెల్ వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల పరిస్థితి ఏంటి? బొగ్గు వ్యాగన్ల అన్‌లోడింగ్ సమయం, టర్న్ అరౌండ్ టైమ్ ఏ విధంగా ఉంది? దానిని మరింత వేగవంతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్లాంట్‌లోని 4 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయా? ఒకవేళ ఉత్పత్తిలో లోటు ఉంటే దానికి గల స్పష్టమైన కారణాలను క్రోడీకరిస్తూ నివేదిక అందించాలి’ అని సీఎస్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ​


ఐఏఎస్‌ల డ్యూటీ ఇలా..

1. హరికిరణ్ అక్టోబర్ 15 నుంచి 17 వరకు

2, వెంకటేష్ ధోత్రే, అక్టోబర్ 18 నుంచి 19 వరకు

3. రాహుల్ రాజ్ అక్టోబర్ 22 నుంచి 24 వరకు

4. జెండేజ్ హనుమంత్, అక్టోబర్ 25 నుంచి 27 వరకు

5. కిల్లు శివకుమార్, అక్టోబర్ 28 నుంచి 30 వరకు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్