“నేను తప్పు చేశాను” అని చెప్పడం కంటే “నీ వల్లే ఇలా జరిగింది” అని చెప్పడం కొందరికి చాలా సులభం. జీవితంలో చిన్న తప్పు జరిగినా, కుటుంబంలో గొడవ వచ్చినా, ఉద్యోగంలో సమస్య వచ్చినా.. తమ పాత్రను పరిశీలించకుండా ఎదుటివారినే నిందించే వ్యక్తులను మనం తరచూ చూస్తుంటాం. ఇది కేవలం మొండితనం మాత్రమే కాదు. దీని వెనుక అహం, ఆత్మరక్షణ, అపరాధ భావన నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం, చిన్ననాటి అనుభవాలు వంటి మానసిక అంశాలు ఉండవచ్చు.
“నేను తప్పు చేయను” అనే మైండ్సెట్
కొంతమంది తమ గురించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను మనసులో ఏర్పరుచుకుంటారు. “నేను చాలా తెలివైనవాడిని”, “నేను ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచిస్తాను”, “నా నిర్ణయం సాధారణంగా సరైనదే” అనే నమ్మకం ఉంటుంది. అలాంటి వ్యక్తి తన తప్పును ఎదుర్కొన్నప్పుడు, ఆ తప్పును అంగీకరించడం అతని స్వీయగౌరవానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. వెంటనే మనసు ఒక రక్షణ మార్గాన్ని ఎంచుకుంటుంది. అదే బాధ్యతను మరొకరిపైకి నెట్టడం.
జరిగిన సంఘటన
ఒక తల్లి తన కుమారుడి చదువు విషయంలో ఎప్పుడూ అతన్ని ఇతర పిల్లలతో పోల్చేది. “పక్కింటి పిల్లాడు ఎంత బాగా చదువుతున్నాడు.. నువ్వెందుకు చదవలేవు?” అంటూ ప్రతిరోజూ ఒత్తిడి చేసేది. కొంతకాలానికి ఆ బాలుడు చదువుపై ఆసక్తి కోల్పోయాడు. అప్పుడు తల్లి, “ఈ పిల్లవాడికి చదువంటేనే ఇష్టం లేదు. ఎంత చెప్పినా వినడు” అని బాధపడింది. ఇక్కడ తల్లి తప్పు అని తీర్పు ఇవ్వడం లక్ష్యం కాదు. కానీ “నా మాట తీరు, నా ఒత్తిడి కూడా పిల్లవాడి ప్రవర్తనపై ప్రభావం చూపిందేమో?” అని ఆమె ఒక్కసారి ఆలోచిస్తే సమస్యను అర్థం చేసుకునే కొత్త మార్గం కనిపిస్తుంది.
దాంపత్యంలో “బ్లేమ్ గేమ్”
భార్య భర్తతో, “నువ్వు నా మాట వినవు. కాబట్టే నేను కోపంగా ఉంటాను” అంటుంది. భర్త వెంటనే, “నువ్వు ఎప్పుడూ కోపంగా ఉంటావు కాబట్టే నేను మాట్లాడను” అంటాడు. ఇద్దరి మాటల్లోనూ ఒక నిజం ఉండవచ్చు. కానీ సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోవడానికి ఇద్దరూ తమవంతు పాత్రను పరిశీలించాలి. ఇలా కాకుండా ఒకరు మరొకరిని నిందిస్తూనే ఉంటే అది ‘బ్లేమ్ సైకిల్’ గా మారుతుంది.
ఒకరు నిందిస్తారు → మరొకరు తనను తాను కాపాడుకుంటారు → తిరిగి నిందిస్తారు → గొడవ పెరుగుతుంది. చివరికి అసలు సమస్య చిన్నదైనా, అహం మాత్రం పెద్దదైపోతుంది. కొంతమంది తప్పు ఒప్పుకోకపోవడానికి మరో కారణం అహం (Ego). “నేను తప్పు చేశాను” అని చెప్పడం తమ స్థాయిని తగ్గించుకుంటున్నట్లు వారు భావిస్తారు. ఇంట్లో భర్త తప్పు చేసినా “నువ్వు నాకు ఎదురు మాట్లాడకూడదు” అంటాడు. భార్య తప్పు చేసినా “అంతా నా మీదే వేస్తున్నారు” అంటుంది. పిల్లవాడు తప్పు చేసినా “టీచర్ సరిగ్గా చెప్పలేదు” అంటాడు. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఒకే లక్ష్యం.. తప్పు నాది కాకూడదు! ఇలాంటి కుటుంబంలో సమస్య పరిష్కారం కంటే “ఎవరి మీద నింద వేయాలి?” అనే పోటీ ఎక్కువగా జరుగుతుంది.
చిన్న హాస్య ఉదాహరణ
ఒక ఇంట్లో టీవీ రిమోట్ కనిపించలేదు.
భర్త: నువ్వే ఎక్కడో పెట్టి ఉంటావు!
భార్య: నేను పెట్టలేదు. పిల్లలు తీసి ఉంటారు!
పిల్లలు: మేము తీసుకోలేదు. నాన్నే చూస్తున్నారు!
చివరికి రిమోట్ ఎవరి దగ్గర దొరికిందో తెలుసా?
భర్త కూర్చున్న కుర్చీ కింద!.. ఇలాంటి సందర్భాల్లో మనం నవ్వుకుంటాం. కానీ జీవితంలో కూడా చాలాసార్లు ఇదే జరుగుతుంది. సమస్య మన దగ్గరే ఉన్నా, పరిష్కారం కోసం బయట వెతుకుతుంటాం.
చిన్ననాటి అనుభవాల ప్రభావం
చిన్నప్పుడు తప్పు చేసిన ప్రతిసారీ పిల్లలను తీవ్రంగా శిక్షించే వాతావరణం ఉంటే, కొందరు పిల్లలు “తప్పు ఒప్పుకుంటే ప్రమాదం” అనే భావనను నేర్చుకోవచ్చు. అందుకే పెద్దయ్యాక కూడా తప్పును దాచడం లేదా ఇతరులపైకి నెట్టడం అలవాటుగా మారవచ్చు. అందుకే తల్లిదండ్రులు పిల్లవాడు తప్పు చేసినప్పుడు, “ఎవరు చేశారు?” అని మాత్రమే అడగకుండా, “ఇప్పుడు జరిగిన తప్పును ఎలా సరిచేద్దాం?” అని కూడా నేర్పాలి. బాధ్యత తీసుకోవడం అంటే మొత్తం నిందను తీసుకోవడం కాదు.. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు మనమే కారణం అని అనుకోవడం కూడా ఆరోగ్యకరమైన పద్ధతి కాదు.
కానీ మనం అడగాల్సిన ప్రశ్న..
“ఈ పరిస్థితిలో ఎదుటివారి పాత్ర ఎంత? నా పాత్ర ఎంత?” ఇది నిందల నుంచి ఆత్మపరిశీలన వైపు తీసుకెళ్తుంది. “సారీ” అనే చిన్న మాట... పెద్ద మార్పు..“నా వల్ల కూడా తప్పు జరిగింది, సారీ.” ఈ మాట చాలా చిన్నదే. కానీ సంబంధంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు... తప్పును అంగీకరించడం సంబంధాన్ని చిన్నది చేయదు. చాలాసార్లు నమ్మకాన్ని పెంచుతుంది. అయితే క్షమాపణ అంటే మాటతో మాత్రమే కాకుండా, అవసరమైతే ప్రవర్తనలో మార్పు కూడా ఉండాలి.
ఆత్మపరిశీలనకు మూడు ప్రశ్నలు
1. ఈ పరిస్థితిలో నా పాత్ర ఏమిటి?
2. నేను వేరే విధంగా స్పందించగలిగానా?
3. ఇదే పరిస్థితి మళ్లీ వస్తే నేను ఏం మార్చుకోవాలి?
ఈ ప్రశ్నలు మనల్ని “ఎవరు తప్పు?” అనే స్థితి నుంచి “ఏం మార్చుకోవాలి?” అనే స్థితికి తీసుకెళ్తాయి. మనిషి తప్పు చేయడం సమస్య కాదు. తప్పు చేసిన తర్వాత కూడా నేర్చుకోకపోవడమే అసలు సమస్య. ఎదుటివారిని నిందించడం ద్వారా కొంతకాలం మనకు మనం ఓదార్పు పొందవచ్చు. కానీ సమస్య మాత్రం అక్కడే ఉంటుంది. బాధ్యతను స్వీకరించినప్పుడు మాత్రమే మార్పుకు తలుపు తెరుచుకుంటుంది. “తప్పు నాది కాదు” అని నిరూపించుకోవడం కంటే, “నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా?” అని ప్రశ్నించుకునే వ్యక్తిత్వం గొప్పది. నిందించే వ్యక్తి కారణాన్ని వెతుకుతాడు.. పరిపక్వమైన వ్యక్తి పరిష్కారాన్ని వెతుకుతాడు.
డా.హిప్నో పద్మా కమలాకర్ 9390044031 కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్






కామెంట్లు (0)