Magazines

విచక్షణ

52 నిమిషాల క్రితం

Discretion
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం

​నరసాపురం గ్రామంలో దత్తయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి దాదాపు వంద గొర్రెలు ఉండేవి. వాటి రక్షణ కోసం అతను ఎంతో నమ్మకమైన కుక్కను పెంచుకున్నాడు. అది తోడేళ్ళు, నక్కల వంటి క్రూరమైన జంతువుల బారిన పడకుండా గొర్రెలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుండేది. ఒకరోజు దత్తయ్య తన మందను మేత కోసం దట్టమైన అడవికి తోలుకుపోయాడు. చాలా దూరం నడవడంతో అలసిపోయిన దత్తయ్య, ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో గాఢంగా నిద్రపోయాడు. ​కాపరి నిద్రపోవడం గమనించని గొర్రెల మంద మేత మేస్తూ అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయాయి. అక్కడ వాటికి ఒక పెద్ద ఏటి ప్రవాహం కనిపించింది. ఆ ఏటి అవతలి ఒడ్డు కనుచూపు మేరలో కూడా కనిపించనంత విశాలంగా ఉంది. చాలా దూరం నడవడం వల్ల గొర్రెలకు తీవ్రమైన దాహం వేసింది. అవి ఏమాత్రం ఆలోచించకుండా ఏటిలోకి దిగబోయాయి. వెంటనే కుక్క పరుగున వచ్చి, "మిత్రులారా! ఆగండి. ఆ ఏరు చాలా లోతుగా ఉంటుంది. తొందరపడి నీటిలోకి దిగవద్దు, ప్రాణాలకే ప్రమాదం" అని గట్టిగా హెచ్చరించింది. ​అప్పుడే మందలోని ఒక పొగరుబోతు గొర్రెపోతు ముందుకు వచ్చి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసింది. ఏటి మధ్యలో ఒక ఒంటె నిలబడి ఉండటం కనిపించింది. ఆ గొర్రెపోతు గొంతు పెంచి, "ఓ ఒంటె నేస్తమా! నీటి లోతు ఎంత ఉంది?" అని అడిగింది. అందుకు ఒంటె, "పెద్ద లోతేమీ లేదు, నాకు నడుము లోతు వరకే ఉన్నాయి" అని తేలికగా చెప్పింది.

ఆ మాట వినగానే గొర్రెపోతు విర్రవీగుతూ, "ఓస్ అంతేనా! ఇంకేం భయం లేదు, పదండి దాహం తీర్చుకుందాం" అంటూ తోటి గొర్రెలను పురమాయించింది. ​కుక్క ఎంత మొత్తుకున్నా వినకుండా గొర్రెలన్నీ మొండిగా ఏటిలోకి దిగాయి. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో అవి ఈదడం మొదలుపెట్టాయి. కొంతదూరం ఈదాక బాగా అలసిపోయాయి. కాళ్ళు నేలకు ఆనకపోవడం, వాటి శరీరంపై ఉన్ని తడిచి బరువు పెరగడంతో అవి భయంతో గిలగిలా కొట్టుకోసాగాయి. కాపాడమంటూ లబోదిబోమని అరుస్తూ ఒక్కొక్కటే నీటిలో మునిగి కొట్టుకుపోయాయి. చివరనున్న ఒక గొర్రె మాత్రం ఓపిక చేసుకుని వెనక్కి ఈది బతుకుజీవుడా అనుకుంటూ బయటపడింది. ​ఆ గొర్రె ఏడుస్తూ, "కుక్కా! నీవు చెప్పిందే నిజం. నీ మాట వినుంటే ఇన్ని గొర్రెలు ప్రాణాలు కోల్పోయేవి కావు" అంది. అప్పుడు కుక్క, "అందుకే ఒకరి మాటను నమ్మి పనికి ఉపక్రమించే ముందు ఆ మాటను ఎవరు చెప్పారో ఆలోచించుకోవాలని పెద్దలు చెబుతారు. ఒంటె ఎత్తైన, బలమైన జంతువు. దానికి నడుము లోతు ఉంటే, భూమికి రెండడుగులు లేని మనకు ఎంత లోతో ఆలోచించాలి కదా! విచక్షణతో ఆలోచించకపోవడం వలన ఎంత పెద్ద ఘోరం జరిగిందో చూడు" అంటూ కన్నీరు పెట్టుకుంది. ​అంతలోనే మేల్కొన్న దత్తయ్య గొర్రెల మందను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. జరిగిందంతా చూసి నోటమాటరాక అక్కడే కుప్పకూలిపోయాడు. తన పనిని మరచి నిద్రపోవడం వల్లే ఇంతటి తీరని నష్టం వాటిల్లిందని తలచుకుని తీవ్రంగా బాధపడ్డాడు. వివేకం లేని ఆలోచన, బాధ్యతారహితమైన అలసత్వం రెండూ కలిసి సర్వనాశనానికి దారితీశాయని తెలుసుకున్నాడు.


డా.పోతగాని సత్యనారాయణ, 9182531202

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్