సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయనున్నట్టు సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి జెన్కో సీఎండీ హరీష్‌తో కలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెన్కో థర్మల్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనీ, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లకు ఆయన సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగితే సింగరేణి తన సామర్థ్యం మేరకు మరింత బొగ్గు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
నైనీ గనిలో ప్రస్తుతం రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, అయితే ప్రస్తుతం 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉందని సీఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి బొగ్గు రవాణాను పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నైనీ గని నుంచి సమీప రైల్వే సైడింగ్ వరకు రోడ్డు మార్గంలో జరుగుతున్న బొగ్గు రవాణాను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జెన్కో సీఎమ్‌డీ హరీశ్ ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, తిరుమలరావు, ఈడీ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)