Magazines

ఆర్థిక ఇబ్బందుల వల్లే పింఛన్ల మంజూరులో ఆలస్యం

37 నిమిషాల క్రితం

Delay in sanctioning pensions due to financial difficulties
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

మంత్రి జూపల్లి కృష్ణారావు

నవతెలంగాణ - వీపనగండ్ల

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్ల మంజూరు హామీ అమలులో కాస్త ఆలస్యం జరిగిందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేడు పెన్షన్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో మంగళవారం చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి జూపల్లి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేండ్ల నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదని, గత పాలకులు చేసిన విధానాల వల్ల రాష్ట్రం అప్పులపాలైయిందన్నారు. రాష్ట్రంలో 45 లక్ష‍ల నూతన పెన్షన్లు మంజూరు చేశామని, కొల్లాపూర్ నియోజక వర్గంలో 4 వేలు పైచిలుకు వీపనగండ్ల మండలంలో 389 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 65 వేల కోట్లు అప్పులు చేశారని, వాటికి నెలకు 6000 కోట్లు ప్రభుత్వం వడ్డీ కట్టడం జరుగుతుందని గుర్తు చేశారు. మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు నుంచి ఇవ్వడానికి బ్యాంక్ అధికారులకు 2000 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. గత పాలకులు మోయలేని భారం వేసినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశమంతా కరువు పరిస్థితులు ఏర్పడితే.. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తాను సింగోటం, గోపాల్దిన్నె రిజర్వాయర్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఐదేండ్లలో పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఉమ్మడి మండల రైతులకు తీవ్ర సాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ఇటీవల తాను పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. సింగోటం గోపాలదిన్నె లింకు కెనాల్ పూర్తి అయితే ఉమ్మడి మండలంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నంతవరకు రైతులకు సాగునీరు అందుతాయన్నారు. 30 కోట్లతో కల్వరాల వీపనగండ్ల డబల్ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతున్నదన్నారు.

ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్ష ల ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, డీఆర్‌డీ పీడీ , ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ ఖాజా మైనుద్దీన్, ఎంపీడీవో నరసింహ, ఆర్ ఐ రాములు, సర్పంచులు సుదర్శన్ రెడ్డి, మీసాల పార్వతమ్మ, దొడ్ల కవిత, రామన్ గౌడ్, ఆర్ గోపి, మీన్గా శివకుమార్, బత్తుల బాలరాజు యాదవ్, బండారి రాముడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు వల్లభాపురం నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఇంద్రకంటి వెంకటేష్, మాజీ సర్పంచ్ డాక్టర్ గోదల బీరయ్య యాదవ్, ఉప సర్పంచ్ బాల పిరు, శ్రీనివాస్ గౌడ్ మండల బీసీ సంఘం అధ్యక్షులు బసవరాజ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రా వెంకటేష్, వెంకట రాజయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్