చార్మినార్, ఫలక్‌నుమాలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
49 బండిళ్లు, 13 కిలోలకు పైగా అల్యూమినియం ఫ్లేక్స్ స్వాధీనం
స్వీట్లు, పాన్, కేకుల్లో నకిలీ వెండి పూత
కిడ్నీలపై ప్రభావం పడే ప్రమాదం : సీపీ మహేష్ భగవత్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆహార భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కుతూ నకిలీ వెండి వరఖ్ (రేకులు), వెండి ఫ్లేక్స్‌ను అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న నాలుగు కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసులతో కలిసి మంగళవారం మెరుపు దాడులు నిర్వహించింది. నిందితులపై నాలుగు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్ వివరాలు వెల్లడించారు. పాతబస్తీకి చెందిన మహమ్మద్ అక్బర్ చార్మినార్ బస్టాండ్ సమీపంలోని మక్కా మసీదు పక్కన మెస్సర్స్ ఇత్తెహాద్ వరఖ్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. మహమ్మద్ వలీ ఉద్దీన్ అనే వ్యాపారి చార్మినార్ కొత్త బస్టాండ్ వద్ద పంచ్ మొహల్లాలో మెస్సర్స్ యూటీసీ సిల్వర్ లీఫ్స్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి మొహల్లాలోని చార్మినార్ బస్ స్టాప్ ఎదురుగా మెస్సర్స్ ఎంఎ. మెట్రో వరఖ్ షాప్ నడుపుతుండగా.. వ్యాపారి మహమ్మద్ జలీల్ ఖాన్ ఫలక్‌నుమాలోని బీబీకాచష్మా, అచ్చిరెడ్డి నగర్‌లో మెస్సర్స్ తారా యూనిట్ కొనసాగిస్తున్నాడు.
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు ఈ నాలుగు దుకాణాలపై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ నిల్వలు, ముడిసరుకులు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకుని.. వారిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 49 బండిళ్ల నకిలీ వెండి రేకులు (అల్యూమినియం రేకులు), కిలో నకిలీ వెండి పూత పూసిన చక్కెర గుళికలు, సీసాలు, గోనె సంచుల్లో పొగాకు, కిలో టాల్కమ్ పౌడర్, 50 సీసాల ఫ్లేవర్డ్ పాన్ చట్నీలు, జంతు చర్మపు షీట్లు, సుమారు 10 లీటర్ల గ్లూకోజ్ డ్రమ్ము, సుమారు 40 కిలోల మొక్కజొన్న పిండి స్వాధీనం చేసుకున్నారు. మిక్సర్ గ్రైండర్, లాంగ్ మిక్సర్, ప్యాకింగ్ మెషిన్, తూకం యంత్రం, ఖాళీ ఇండియన్ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, వంట పాత్రను పోలీసులు సీజ్ చేశారు.
నిందితులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండానే అసలైన వెండికి బదులుగా చౌకైన అల్యూమినియంను ఉపయోగించి తినదగిన వెండి వరఖ్‌లు, ఫ్లేక్స్, అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని స్వీట్ తయారీ కేంద్రాలకు సరఫరా చేస్తుండగా, అల్యూమినియం పూత పూసిన చక్కెర గుళికలను కేకులు, బేకరీ టాపింగ్స్ కోసం బేకరీలకు అమ్ముతున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం ఫ్లేక్స్‌ను దిగుమతి చేసుకుని జర్దా, ఖివామ్, సుగంధ పాన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛమైన వెండి ఉత్పత్తులుగా నమ్మించి తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ షాపులకు సరఫరా చేస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు.
వీటిని తీసుకోవడంతో ఆహార-గ్రేడ్ కాని ఇటువంటి అల్యూమినియం ఉత్పత్తులను దీర్ఘకాలం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం, నరాల సంబంధిత వ్యాధులు, ఎముకల రుగ్మతలు, జీర్ణవ్యవస్థ సమస్యలతోపాటు శరీరంలో విషపూరిత అల్యూమినియం పేరుకుపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతాయని సీపీ తెలిపారు.
అసలైన వెండి ఫాయిల్‌లో 99.9 శాతం వెండి ఉండాలని, చేతితో సున్నితంగా రుద్దితే పొడిలా విడిపోతుందని, అల్యూమినియం ఫాయిల్ చిన్న ముద్ద లేదా బాల్‌లా మారుతుందని చెప్పారు. రసాయన పరీక్షలో నకిలీ ఫాయిల్ నలుపు రంగులోకి మారుతుందని తెలిపారు. స్వీట్లు, పాన్ ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్సు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, సబ్-ఇన్‌స్పెక్టర్లు, టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)