Magazines

ఉపాధి హామీ అమలులో ప్రభుత్వాలు విఫలం

44 నిమిషాల క్రితం

Governments have failed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

వ్యవసాయ కార్మికుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమాలు : ​వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు విజయరాఘవన్‌

గోదాముల వద్ద ఆందోళనలు చేపడతాం: ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

నల్లగొండ నుంచి ఎమ్‌డి సాదత్ అలీ

​దేశంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు, మాజీ ఎంపీ విజయరాఘవన్‌ ప్రకటించారు. నల్లగొండలో జరుగుతున్న ఏఐకేఎస్‌ 36వ జాతీయ మహాసభ రెండో రోజు మంగళవారం సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉపాధి హామీ పథకం అమలు తీరు, భూ పంపిణీ, ప్రజా పంపిణీ వ్యవస్థలో కోతలు, కార్మికుల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ డిసెంబర్‌, జనవరి నెలల్లో పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని వెల్లడించారు. దేశంలో నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాల ధరలు రెండంకెల స్థాయిలో పెరగడం సామాన్యుల జీవనాన్ని భారంగా మార్చిందన్నారు. కేరళలో సైతం బియ్యం ధరలు పెరగడంతో పేద కుటుంబాలపై అదనపు భారం పడుతోందని చెప్పారు. ​గ్రామీణ పేదలకు పని కల్పించాల్సిన ఉపాధి హామీ పథకం లక్ష్యాలను చేరుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. గ్రామీణ కూలీలకు పని, వేతనం, ఉపాధి భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు..

ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్పొరేట్‌ సంస్థలకు పన్ను రాయితీలు, సామాన్యులపై పన్నుల భారం పెంచే విధానాలను విమర్శించారు.​ ప్రజా పంపిణీ వ్యవస్థలో పేద కుటుంబాలకు అందించే బియ్యం పరిమాణాన్ని 35 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించడం ఆందోళనకరమన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఈ సమావేశంలో ఎంపీ, సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి శివదాసన్‌, సహాయ కార్యదర్శులు విక్రమ్‌సింగ్‌, వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్‌ బొప్పని పద్మ, కేంద్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఉన్నారు.

​గోదాముల వద్ద ఆందోళనలు చేపడతాం

​అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 11వ జాతీయ మహాసభ కర్నాటకలోని బెంగళూరులో ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తెలిపారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించాలని, ప్రతి పేద కుటుంబానికీ ప్రస్తుతం అందిస్తున్న ఐదు కిలోల బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు ఇవ్వాలని, 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్‌, జనవరి నెలల్లో దేశవ్యాప్తంగా గోదాముల వద్ద ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భూ పంపిణీ ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచొచ్చన్నారు. ​ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వల్ల ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు నష్టపోతున్నారని వెంకట్‌ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్